పాకిస్థాన్లో శ్రీలంక పరిస్థితే

పాకిస్థాన్లో శ్రీలంక పరిస్థితే

పాకిస్థాన్ లో శ్రీలంక పరిస్థితే నెలకొంది. దాయాది దేశంలో ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అలమటిస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది భారీ వరదలు సంభవించి, దాని నుంచి కోలుకోకముందే మరో సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతుంది. పాక్​ ఆర్థిక వ్యవస్థ మరో రూ.3.3 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తడంతో దేశం దివాళా తీసే స్థాయికి వెళ్లిపోయింది. 

ప్రస్తుతం పాక్ లో కరెంట్,ఆహారం, ఇంధనం, డబ్బుకు కొరత ఏర్పడింది. కరెంట్​ లేక ఆ దేశం చీకట్లలో మగ్గుతోంది. విద్యుత్ ను ఆదా చేసేందుకు షాపులు, షాపింగ్​ మాళ్లను రాత్రి 8.30కే మూసేయాలని, రెస్టారెంట్లను రాత్రి 10 గంటల లోపు కట్టేయాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ ఆదేశాలిచ్చారు. కరెంటును ఎక్కువ గుంజే ఫ్యాన్ల తయారీని బంద్​ పెట్టించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో కరెంట్​ వాడకాన్ని 30 శాతానికి తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. 

దాయాది దేశంలో ఇప్పుడు విదేశీ మారక నిల్వలు (డాలర్​) గణనీయంగా పడిపోయాయి. నిరుడు జనవరిలో 16.6 బిలియన్​ డాలర్లున్న ఆ దేశ విదేశీ మారక నిల్వలు.. ఇప్పుడు 5.6 బిలియన్​ డాలర్లకు పడిపోయాయంటేనే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. పెట్రోల్​, డీజిల్​పై పాకిస్థాన్​ ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడడం, వాటి ధరలు విపరీతంగా పెరగడం, పాకిస్థాన్​ రూపీ విలువ పతనమవ్వడం వంటి కారణాలు డాలర్​ నిల్వలు తరిగిపోవడానికి కారణమైంది. ఫలితంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పాకిస్థాన్​ బ్యూరో ఆఫ్​ స్టాటిస్టిక్స్​ (పీబీఎస్​) ప్రకారం నిరుడు 24.5 శాతంగా నమోదైంది. గోధుమలు, కూరగాయలు ఇతర తిండి వస్తువుల ధరలు ఆకాశాన్నంటేశాయి. తిండి గింజలకు కొరత ఏర్పడింది. గోధుమ పిండి కోసం వీధుల్లో జనం ఎగబడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం ఆ గొడవల్లో నలుగురు చనిపోయారు. ఇప్పటికీ దుకాణాల ముందు నిత్యావసరాల కోసం జనం క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఆర్థిక సంక్షోభం ముంగిట ఆ దేశం ఇటు ఎంబసీలనూ మూసేస్తున్నది. ఈ పరిస్థితుల నుంచి జనాన్ని బయట పడేసేందుకు ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన సోమవారం జెనీవాలో జరిగిన ఓ సదస్సులో విదేశాల సాయం కోసం అర్థించారు. ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్​) నుంచి రావాల్సిన ఎక్స్​టెండెడ్​ ఫండ్​ ఫెసిలిటీ (ఈఎఫ్​ఎఫ్​) నిధుల కోసం పాక్​ అధికారులు ఐఎంఎఫ్​ అధికారులతో సమావేశమయ్యారు. వాస్తవానికి 6 బిలియన్​ డాలర్ల ఈఎఫ్​ఎఫ్​ కోసం 2019లోనే ఒప్పందం కుదరగా.. దానిని ఆ తర్వాత 7 బిలియన్​ డాలర్లకు పెంచారు. అయితే, నిరుడు నవంబర్​లో పాక్​కు 1.18 బిలియన్​ డాలర్ల ఈఎఫ్​ఎఫ్​ను ఐఎంఎఫ్​ ఇవ్వలేదు. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్​ చేసేందుకు పన్నులు, కరెంట్​ చార్జీలు, ఎక్స్​చేంజ్​ రేట్​పై కృత్రిమ నియంత్రణ వంటి చర్యలకు పాక్​ అంగీకరించకపోవడంతోనే ఐఎంఎఫ్​ ఆ నిధులను ఆపేసింది. 

ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పాకిస్థాన్​ మరిన్ని అప్పులు చేసేందుకు సిద్ధమవుతున్నది. చైనా నుంచి 2.1 బిలియన్​ డాలర్లు అప్పుగా తీసుకునేందుకు నిర్ణయించింది. అంతేగాకుండా పాక్​ స్టేట్​బ్యాంక్​లో సౌదీ ఫండ్​ ఫర్​ డెవలప్​మెంట్​ నిధులను 3 బిలియన్​ డాలర్ల నుంచి 5 బిలియన్​ డాలర్లకు పెంచేందుకు స్టడీ చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ఫలిస్తే పాక్​కు అంతో ఇంతో ఊరట ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రాబోయే మరికొన్ని నెలలు పాకిస్థాన్​లో గడ్డు పరిస్థితులు తప్పవని అంచనా వేస్తు్న్నారు.