అన్ని వర్గాల ప్రజలు మోదీకి అండగా నిలవాలి: ఎంపీ లక్ష్మణ్

అన్ని వర్గాల ప్రజలు మోదీకి అండగా నిలవాలి: ఎంపీ లక్ష్మణ్
  • 29 కులాలను ఓబీసీ జాబితాలో కలిపేందుకు.. కమిషన్ పరిశీలిస్తున్నది

హైదరాబాద్, వెలుగు: ఓబీసీ జాబితాలో 29 కులాలను కలిపే అంశాన్ని నేషనల్ ఓబీసీ కమిషన్ పరిశీలిస్తున్నదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో సొండి కులానికి చెందిన వాళ్లు ఉన్నా.. ఓబీసీ లిస్ట్​లో వారు లేరని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను పట్టించుకున్న నాయకుడు ప్రధాని మోదీ అని, ఆయనకు అన్ని కుల సంఘాలు అండగా నిలవాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. 

ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో జరిగిన సొండి కులాల మీటింగ్​లో పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు. రాష్ట్రంలో పాలకులు, ప్రభుత్వాలు మారినా చాలా కులాలకు న్యాయం జరగడం లేదన్నారు. నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్​గా హన్స్​రాజ్ బాధ్యతలు చేపట్టాక ఓబీసీలో కులాలను కలిపే అంశంపై చాలా సార్లు రివ్యూ చేశారని గుర్తు చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాంకేతికపరమైన అంశాలు ఇంకా పెండింగ్​లో ఉన్నాయని, తెలంగాణ వచ్చాక 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని విమర్శించారు. సాంకేతిక సమస్యలు లేకుండా రాష్ట్ర అధికారులను ప్రపోజల్స్ పంపాలని కేంద్రం కోరిందన్నారు. జాతీయ నాయకత్వం సొండి, శిష్ట కరణం కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. వివక్షకు గురైన కులాలకు మేలు చేసేందుకు ప్రధాని పీఎం విశ్వకర్మ స్కీమ్ తీసుకొచ్చారన్నారు.