ఓటు వేసేందుకు..సొంతూళ్లకు జనం

ఓటు వేసేందుకు..సొంతూళ్లకు జనం
  • జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్ ​బస్​ స్టేషన్లలో రద్దీ
  • బస్సులు తక్కువ ఉండటంతో ప్రయాణికుల ఇబ్బందులు
  • ప్రైవేటు వాహనదారుల దోపిడీ.. దూరాన్నిబట్టి 1,000 దాకా వసూలు

హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్​ జనం ఓటు వేసేందుకు సొంతూళ్ల బాటపట్టారు. దీంతో సిటీలోని ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్ లు ప్రయాణిలకులతో కిక్కిరిసిపోయాయి. స్కూళ్లకు రెండు రోజులు, ప్రైవేట్ ఆఫీసులకు పోలింగ్ రోజు సెలవు ఇవ్వడంతో ప్రజలు సొంత గ్రామాలకు బయలుదేరారు. ఉదయం నుంచే బస్టాండ్లు కిటకిటలాడగా సాయంత్రానికి రద్దీ మరింత పెరిగింది. అయితే రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్​స్టేషన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ప్రధానంగా ఉప్పల్ నుంచి ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని తొర్రూర్, మరిపెడ బంగ్లా.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి, తుంగతుర్తి ప్రాంతాలకు, అలాగే ఎంజీబీఎస్ నుంచి ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని నాగర్​కర్నూల్, వనపర్తి, అచ్చంపేట తదితర ప్రాంతాలకు వెళ్లే ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపు కోసం రోజుకు రూ.20  వేల చొప్పున అద్దెకు 1,450 బస్సులు ఎలక్షన్ డ్యూటీకి ఇచ్చినట్లు ఆర్టీసీ ఈడీ మునిశేఖర్ తెలిపారు. దీంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి ఎలక్షన్ డ్యూటీ కోసం పోలీసులను తీసుకురావడం, మళ్లీ తీసుకువెళ్లడం కోసం మరో 350 బస్సులు నడపుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో రెగ్యులర్​సర్వీసులు తగ్గి జనం ఇబ్బంది పడ్డారు. 

సిటీ నుంచి 5 లక్షల మంది 

పోలింగ్ సందర్భంగా జంట నగరాల నుంచి సుమారు 5 లక్షల మంది జిల్లాలకు వెళ్లినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్ బీ నగర్, ఆరాంఘర్  ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచే అధిక రద్దీ నెలకొంది. సాధారణ రోజుల్లో ఎంజీబీఎస్ నుంచి 3,280 బస్సులు నడుస్తుండగా, బుధవారం వీటికి అదనంగా 750 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు.

రాష్ర్టంలో 9 ఉమ్మడి జిల్లాల్లో అన్ని రూట్లకు సమాన రద్దీ ఉందన్నారు. ఇందులో తొలిసారి ఓటు వచ్చిన 25 ఏండ్ల లోపు యూత్ ఎక్కువున్నారని ఆయన తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఉందని, నిలబడి అయినా జర్నీ చేసేందుకు పబ్లిక్ బస్సులు ఎక్కుతున్నారని తెలిపారు.

ప్రైవేటు దోపిడీ

రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా కార్లు, టాటా ఏసీలు, క్రూజర్లు తదితర ప్రైవేట్ వాహనదారులు దోపిడీకి తెరలేపారు. దూరాన్ని బట్టి 500 నుంచి 1,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లడానికి 1,000 రూపాయలు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వెళ్లడానికి రూ.500, తొర్రూర్ వెళ్లడానికి రూ.800 దాకా వసూలు చేస్తున్నారు.

ఎల్బీనగర్ నుంచి సూర్యాపేట వెళ్లడానికి రూ. 600 దాకా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇటు బస్సులు దొరక్క, అటు ప్రైవేటు దోపిడీని భరించలేక సతమతమయ్యారు. ఓటు వేయాలని చెప్పే ప్రభుత్వమే సరైన సౌకర్యాలు కల్పించకపోతే 
ఎలా అని ప్రజలు మండిపడుతున్నారు. 

అభ్యర్థుల నుంచి పిలుపులు...

ప్రతి ఓటు ముఖ్యమని భావిస్తున్న అభ్యర్థులు ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ రోజు ఊరికి వచ్చేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను గ్రామాలకు తీసుకెళ్లడానికి కొంత మంది అభ్యర్థులు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు.

మరికొందరు అభ్యర్థులు మీరే రండి ప్రయాణ ఖర్చులను భరిస్తామని చెబుతున్నారు. మీరైతే ఊరికి రండి వచ్చాక ప్రయాణ ఖర్చులు చెల్లిస్తామని మరికొందరు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల్లో పనులు చేసుకునే ఓటర్లు గ్రామాలకు వెళ్లడానికి ఆసక్తి చూపించారు. 

ప్రభుత్వానికి తెలియదా.?

ఎన్నికలు ఉన్నాయని ప్రభుత్వానికి తెల్వదా? రద్దీకి సరిపడా బస్సులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సర్కారుదే కదా. నేను మహబూబ్ నగర్ వెళ్లాలి. ఎంజీబీఎస్​కు వచ్చి రెండు గంటలు అవుతుంది. వచ్చిన ఒక బస్సులో సీట్లు నిండిపోయాయి. ఇద్దరు పిల్లలతో మూడు గంటలు నిల్చొని ఎలా ప్రయాణం చేయాలి. అవసరమైనన్ని బస్సులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. 

గాయత్రి, అకౌంటెంట్

బస్సులు లేవు, ఎవ్వరిని అడగాలో తెలియదు

ఓటు వేయడానికి ఊరు వెళుతున్న. పొద్దున పదకొండున్నరకు వచ్చినా... ఒకటిన్నర అవుతున్నది. తొర్రూర్​కు వెళ్లే బస్సులు రెండే వచ్చాయి. అవి కూడా నిండిపోయి ఉన్నాయి. చాలా మంది చిన్న పిల్లలతో  రోడ్డు మీదనే ఎండలో వెయిట్ చేస్తున్నారు.  ఇక్కడ ఎంక్వైరీలో అడిగితే మాకు తెలియదు అంటున్నారు. ఎవరిని అడగాలి?

 నరేశ్​, ప్రైవేటు ఎంప్లాయ్​

ఓటు విలువ తెలిసే వెళ్తున్న.. కానీ

ఓటు చాలా విలువైనది. దాన్ని వినియోగించు కోవడానికే మంచిర్యాల వెళుతున్న. బస్టాండ్​లో క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తున్నది. ఇది మంచి విషయమే. కానీ సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదు. ఎన్నికల సమయంలో ఎక్కువ బస్సులు నడుపుతారు అనుకున్న. కానీ బస్టాండ్​కు వచ్చి రెండు గంటలపైనే అవుతుంది. ఒక్క బస్సు రాలేదు. 

వివేక్, ప్రైవేట్ ఉద్యోగి