నెక్స్ట్ బిట్ కాయిన్ యాప్ తో.. రూ.300 కోట్లకు పైగా మోసపోయిన జనం

నెక్స్ట్ బిట్ కాయిన్  యాప్ తో.. రూ.300 కోట్లకు పైగా మోసపోయిన జనం
  •  
  • తాజాగా నెక్స్ట్​ బిట్  యాప్  పేరిట మరో రూ.250 కోట్లు హుష్​కాకి
  • బాధితుల్లో ఎక్కువ మంది జగిత్యాల, కరీంనగర్  వాసులే
  • పాత్రదారులుగా కొందరు ప్రభుత్వ టీచర్లు
  • ఇన్వెస్టర్లలో పలువురు రెవెన్యూ, పోలీసాఫీసర్లు, వ్యాపారులు?
  • ఇటీవల మహారాష్ట్ర యువకుడిని అరెస్ట్​ చేసిన  రాచకొండ పోలీసులు


కరీంనగర్, వెలుగు: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల రూపంలో రాష్ట్రం నుంచి వందల కోట్ల సంపద దేశం దాటిపోతోంది. జగిత్యాల, కరీంనగర్  జిల్లాలతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వందలాది మంది మధ్యతరగతి జనం అత్యాశకు పోయి రిక్సోస్ ట్రేడ్, వాలిట్ బ్లాక్  అనే యాప్ ల ద్వారా క్రిప్టో కరెన్సీలో గతంలో  రూ.300 కోట్లకు పైగా ఇన్వెస్ట్ మెంట్  చేసి మోసపోగా.. తాజాగా నెక్స్ట్ బిట్ కాయిన్  అనే యాప్  ద్వారా మరో రూ.250 కోట్ల వరకు మోసపోయినట్లు తెలిసింది. ఇటీవల జగిత్యాల, కరీంనగర్ జిల్లాలోని వందలాది మంది నుంచి రూ.కోట్లలో కొల్లగొట్టిన హిమాంశు సింగ్  అనే మహారాష్ట్ర యువకుడిని  రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అతడు నెక్స్ట్​బిట్‌ యాప్‌ పేరుతో రాష్ట్రంలో సుమారు 400 మంది నుంచి రూ.19 కోట్లకుపైగా వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడిపై హైదరాబాద్ లోని మేడిపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. హిమాంశు బాధితుల్లో ఉమ్మడి కరీంనగర్  జిల్లాకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ దందా వెనుక కొందరు ప్రభుత్వ టీచర్లు ఉన్నట్లు తెలుస్తుండగా, పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుల్లో పలువురు రెవెన్యూ, పోలీస్​ ఆఫీసర్లు, వ్యాపారులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

విదేశీయుల కంట్రోల్ లో యాప్.. 

ఇటీవల నెక్స్ట్ బిట్‌యాప్‌తో సుమారు 400 మందిని రూ.19 కోట్ల వరకు మోసగించిన హిమంశు సింగ్ ను హైదరాబాద్ లో రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దందాలో చీఫ్  ఓవర్సీస్ కోఆర్డినేటర్ గా వియత్నాంకు చెందిన రికీ ఫామ్, థాయ్‌లాండ్ నుంచి యాప్ పేమెంట్ హ్యాండ్లర్ గా రాజస్థాన్ కు చెందిన అశోక్ శర్మ, రీజినల్ రిక్రూటర్ గా డీజే సోహైల్, క్యాష్ కలెక్టర్ మోహన్(బోడుప్పల్) వ్యవహరించగా అశోక్ కుమార్ సింగ్ అనే వ్యక్తి దేశంలోని ఇతర ప్రాంతాల్లో తమ మనుషులను నియమించే బాధ్యత తీసుకున్నట్లు గుర్తించారు. ఇదే వషయాన్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఓ వైపు క్రిప్టో మోసాలపై రాచకొండ పోలీసుల ఉక్కుపాదం మోపుతుండగా.. ఉమ్మడి కరీంనగర్ పోలీసుల మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ వందలాది మంది బాధితులున్నా పెద్దగా కేసులు నమోదు కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నకిలీ క్రిప్టో కరెన్సీ యాప్ ల రూపంలో విదేశాలకు వందల కోట్లు దాటుతున్నా కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

అత్యాశే.. మోసగాళ్లకు వరం.. 

'రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టండి.. ఇన్వెస్ట్ చేసిన మరుసటి రోజు నుంచి డెయిలీ రిటర్న్స్ అందుకోండి. మీ గ్రూపులోకి మరికొందరిని ఆహ్వానించి కోట్లు సంపాందించండి.' అంటూ టెలిగ్రామ్, వాట్సప్ గ్రూపుల ద్వారా జనాలను ఆకర్షించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా వందలాది మందిని చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

 యాప్ లో పెట్టుబడి పెట్టిన తొలి రోజుల్లో రిటర్న్స్ రావడం, చేర్పించినవాళ్లకు వెంటనే కమీషన్లు చెల్లించడం వెంటవెంటనే జరిగిపోతుంది. ఇలా ఓ పది మందికి ముందే చెప్పినట్లుగా ఇస్తూ.. వందల మందిని మోసగిస్తున్నారు. ఇందులో ఎక్కువ మందితో ఇన్వెస్ట్ మెంట్ చేయించినవారికి థాయిలాండ్, బ్యాంకాక్ లాంటి ఫారిన్ టూర్లు ఆఫర్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈ దందాలో ఎక్కువగా గవర్నమెంట్ టీచర్లు పాత్రధారులుకాగా.. ఇన్వెస్టర్లలో పలువురు రెవెన్యూ, పోలీసాఫీసర్లు, వ్యాపారులు  ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే బాధితుల్లో చాలా మంది ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నట్లు తెలిసింది. 

జగిత్యాల జిల్లాలో మరో యాప్ చలామణిలోకి..

క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడుల పేరుతో గతంలో పలు ఫేక్  యాప్స్ తో చేసిన మోసాలను మరువక ముందే కేటుగాళ్లు యాస్పెక్ట్ అనే కొత్త యాప్ పేరిట నయా దందాకు తెర లేపారు. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ పేరుతో పెట్టుబడులు అంటేనే జనం బెంబేలెత్తుతుండడంతో ఈ సారి ఏకంగా 'భూములను రిజిస్ట్రేషన్ చేస్తాం.. పెట్టుబడులు పెట్టండి' అంటూ అఫర్ ఇస్తున్నారు.  శివారు ప్రాంతంలోని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు విలువ చేసే గుంట భూమిని రిజిస్ట్రేషన్ చేస్తూ రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టిస్తున్నారు. పెట్టుబడి పెట్టేందుకు నమ్మకాన్ని కల్పిస్తూ సెక్యూరిటీ కింద రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. పెట్టుబడి అమౌంటు పూర్తిస్థాయిలో రాగానే తిరిగి మాకే రిజిస్ట్రేషన్ చేయాలని నమ్మిస్తున్నారు.