కవర్ స్టోరీ : రైస్.. రైజ్!

కవర్ స్టోరీ : రైస్.. రైజ్!

బియ్యం ధరలకు రెక్కలొచ్చినయ్! కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో విదేశాల్లో బియ్యం ధరలు చుక్కలను అంటుతున్నయ్. దాంతో ప్రవాస భారతీయుల్లో టెన్షన్ మొదలైంది. అందుకే ఓ నాలుగు బ్యాగులు కొని దాచుకుంటున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలాంటి దేశాల్లో మనవాళ్లు సూపర్ మార్కెట్ల ముందు ‘క్యూ’లు కడుతున్నరు. ఇంకొందరేమో ఏదో పెద్ద కరువు వచ్చినట్టు ఫీలవుతున్నరు. కొన్ని సూపర్ మార్కెట్ల దగ్గర కొవిడ్ సమయంలో సరుకుల కోసం ఎగబడ్డట్టు ఇప్పుడు బియ్యం కోసం ఎగబడుతున్నరు. మనదేశంలోనూ బియ్యం ధరలు కాస్త పెరిగాయి. అయితే.. నిన్నమొన్నటి దాకా బియ్యానికి ఎటువంటి కొరత లేదు. మరి ఈ కొన్నిరోజుల్లో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ పరిస్థితి ఎప్పటిదాకా?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి అన్నమే ప్రధాన ఆహారం. ముఖ్యంగా ఆసియా దేశ ప్రజలకు అన్నం లేనిదే కడుపు నిండదు.  ఏది తిన్నా తిన్నట్టు ఉండదు. నాలుగు అన్నం ముద్దలు తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది. అనేక దేశాల ఫుడ్ కల్చర్లో అన్నం కూడా భాగమే. అందుకే చాలా దేశాలు మన దగ్గర్నించి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంటాయి. అయితే.. ఇప్పుడు బాస్మతి, పారా బాయిల్డ్ రైస్  మినహా అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ ‘ఆహార, వినియోగదారుల వ్యవహారాల’ మంత్రిత్వ శాఖ గత నెల 20న ఉత్తర్వులు ఇచ్చింది. దేశీయ మార్కెట్లో కావాల్సినన్ని బియ్యం ఉండేలా చూసేందుకు, ధరల్లో భారీ పెరుగుదలను నియంత్రించేందుకు గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం వల్ల పోయినేడు నుంచి పెరుగుతున్న దేశీయ బియ్యం ధరలు కాస్త తగ్గుతాయని అనుకుంటున్నారు. అయితే.. బాయిల్డ్ రై ఎలాంటి నిషేధం విధించలేదు. నిషేధం రా రైస్ పైనే ఉంది. పాక్షికంగా మరపట్టిన బాస్మతియేతర తెల్లబియ్యం, పూర్తిగా మరపట్టిన తెల్లబియ్యం, పాలిష్ చేయని తెల్లబియ్యం ఎగుమతులు సాధ్యం కావు. అయితే బాస్మతి బియ్యం, బాస్మతియేతర రకాల్లో ఉప్పుడు బియ్యం, నూకలు, బియ్యప్పిండిని యథావిధిగా కొనుక్కోవచ్చు.

భారీ వర్షాలు

దేశంలో వరి పండించే చాలా రాష్ట్రాల్లో సరైన టైంకి వర్షాలు పడలేదు. దాంతో సీజన్ కాస్త ఆలస్యంగా మొదలైంది. వరి నాట్లు ఆలస్యంగా పడ్డాయి. అంతా బాగానే ఉంది అనుకునేలోపే విపరీతమైన వర్షాలు పంటలను ముంచేశాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని వరి పండించే ముఖ్యమైన రాష్ట్రాలు వరదలతో ఇబ్బంది పడ్డాయి. తర్వాత మనరాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. మరికొన్ని రాష్ట్రాల్లో లోటు వర్షపాతం ఉంది. ఒక అంచనా ప్రకారం ఒక్క పంజాబ్ లోనే 2.4 లక్షల హెక్టార్ల వరి సాగు దెబ్బతింది. 83,000 హెక్టార్లలో తిరిగి నాట్లు వేయాల్సి వచ్చింది. హర్యానాలో కూడా ఏడు జిల్లాల్లో1.5 లక్షల హెక్టార్లలో విస్తరించిన వరి పంట నీట మునిగింది. పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి కీలకమైన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్,  బిహార్ వంటి ప్రధాన వృద్ధి రాష్ట్రాల్లో రుతుపవనాలు సగటు కంటే 25% తక్కువగా ఉన్నాయి. మొత్తంమీద ఈ కాలంలో దేశంలో సాధారణం కంటే 5% ఎక్కువ వర్షపాతం ఉంది. పోయిన ఖరీఫ్ సీజన్​తో పోలిస్తే.. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌‌‌‌గఢ్ లాంటి వరి పండించే రాష్ట్రాల్లో ఈ సీజన్​లో తక్కువ విస్తీర్ణం సాగు చేశారు. వరి సాగు లోటు జార్ఖండ్‌‌‌‌లో 54 శాతం, ఒడిశాలో 45 శాతంగా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం 2023–24 క్రాప్ ఇయర్లో వరి ఉత్పత్తి బాగా తగ్గుతుందని అంచనా వేసింది. ఆ అంచనాల వల్లే ఈ బియ్యం ఎగుమతులపై బ్యాన్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ నిర్ణయం కేవలం ముందు జాగ్రత్త చర్య మాత్రమే. దేశానికి కరువు వస్తుందనే ఉద్దేశంతో ఎగుమతులపై బ్యాన్ విధించింది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. సీజన్ ఆలస్యం అయినప్పుడు ఆగస్టు చివరకు కూడా వరినాట్లు వేస్తుంటారు. కాబట్టి ఇప్పుడే ఈ సీజన్​లో ఉత్పత్తి విపరీతంగా తగ్గుందని అంచనా వేయలేం. కాకపోతే... సీజన్ ఆలస్యంగా మొదలవడం వల్ల పోయినేడుతో పోలిస్తే కాస్త దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అంతగా ఆందోళన పడాల్సిన అవసరంలేదు.

తెలంగాణలో...

జులై మొదటి రెండు వారాల్లో మన రాష్ట్రంలో కూడా వరిసాగు మందకొడిగా సాగింది. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక... అన్ని రకాలు కలిపి కేవలం 42.76 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు వేశారు. సీజన్‌‌‌‌ సాధారణ సాగు విస్తీర్ణం1.24 కోట్ల ఎకరాలు కాగా గత ఏడాది ఇదే టైంకి 53.79 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. అందులోనూ వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా జులై మొదటి రెండు వారాల్లో 2.95 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. నిజానికి ఈసారి 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రుతుపవనాలు ఆలస్యంగా రావటం, వచ్చినా అన్ని చోట్ల వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల సాగు విస్తీర్ణం తగ్గింది. అయితే.. జులై మూడోవారం వచ్చేసరికి పరిస్థితులు చక్కబడ్డాయి. ఎడతెరపి లేని వర్షాలు కురిసి పంటలు వేసుకోవడానికి కాస్త గ్యాప్ ఇచ్చాయి. అయితే భారీ వరదలతో దాదాపు పదిహేను లక్షల ఎకరాల పంట మొదటి దశలోనే దెబ్బ తిన్నట్టు అంచనా. వరద తీవ్రత లేని ప్రాంతంలో నాట్లు కొనసాగాయి. మనరాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా.. ఆగస్టు 2 నాటికే 82.92 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఇక ఈ నెల చివరినాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక వరిసాగు విషయానికి వస్తే.. ఆగస్టు 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 25.52 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. పోయినేడు ఆ టైంకి కేవలం14.75 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. గత వానకాలంలో రికార్డు స్థాయిలో 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ నెల చివరిదాక పరిస్థితులు బాగుంటే ఈ సీజన్‌‌‌‌లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.

బఫర్ స్టాక్

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా బియ్యం సేకరించి పెట్టింది. ప్రభుత్వం దగ్గర దాదాపు 4.1 కోట్ల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయి. ఈ బియ్యం దేశంలోని 80 కోట్లమంది పేదలకు చౌక ధరలకు అందిస్తున్నారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. 

ఇథనాల్ కోసం

పెట్రోల్​తో కలపడానికి ఇథనాల్​ని​ వాడతారు. దాన్ని తయారుచేసేందుకు నూకలను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో నూకలకు డిమాండ్ పెరిగింది. రానున్న రోజుల్లో బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ నిషేధం విధించింది. ఈ పరిస్థితుల్లో దేశంలో బియ్యం లభ్యత పెరిగితేనే ధరలు అదుపులోకి వస్తాయి.  వచ్చే ఏడాది జనరల్ ఎలక్షన్స్ కూడా ఉండటంతో బియ్యం ధరలు పెరిగితే ప్రభుత్వంపై ప్రజల్లో ప్రతికూల ప్రభావం పడుతుందని భావించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్పర్ట్స్‌‌‌‌ అంటున్నారు.

ప్రభావం ఎలా ఉంటుందంటే...

కొన్ని రకాలైన బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం పడుతుంది అంటున్నారు నిపుణులు. అందుకు ఇండియా బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం ఒక కారణమైతే.. ఉక్రెయిన్ నల్ల సముద్రం మీదుగా ఎక్స్​పోర్ట్స్​ని రష్యా ఆపేయడం మరో కారణంగా ఎక్స్పర్ట్‌‌‌‌ చెప్తున్నారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ధాన్యం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.బియ్యం విదేశీ రవాణా హఠాత్తుగా ఆగిపోవడం వల్ల గోధుమలు,  మొక్కజొన్న మార్కెట్లలోనూ ధరలు పెరుగుతాయి. ఆహార ద్రవ్యోల్బణం మరింత ఎక్కువ అవుతుంది. ప్రపంచంలోని బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా సుమారు 40 శాతం. భారత్ నుంచి సుమారు142 దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుంది. మొత్తం ఎగుమతుల్లో బాస్మతియేతర బియ్యం దాదాపు 60 శాతం కంటే ఎక్కువే.

పక్క దేశాలకు లాభమే!

భారత్ బియ్యం ఎగుమతులు ఆపేస్తే.. భారత్​తోపాటు బియ్యాన్ని ఎగుమతి చేసే ఇతర దేశాలకు లాభమే. ఎందుకంటే.. మన దేశం బియ్యం అమ్మకపోతే.. అవసరం ఉన్న దేశాలు మిగతా ఎక్స్​పోర్టర్​ల దగ్గరకు వెళ్తాయి. అలాంటప్పుడు ఆటోమెటిక్​గా డిమాండ్ పెరుగుతుంది. దాని వల్ల ధర పెరుగుతుంది. భారత్ తరువాత అత్యధికంగా థాయిలాండ్, వియత్నాం, పాకిస్తాన్, అమెరికా బియ్యం ఎగుమతి చేస్తున్నాయి. అందులోనూ ఈ నిర్ణయం వల్ల ఇప్పటికిప్పుడు లాభపడేది పాకిస్తాన్, వియత్నాం దేశాలే. వీళ్లే మన తర్వాత ఆఫ్రికన్ దేశాలకు ఎక్కువ బియ్యం ఎక్స్​పోర్ట్​ చేస్తున్నారు. 2022లో ప్రపంచ బియ్యం ఎగుమతులు 5.54 కోట్ల టన్నులు కాగా అందులో ఒక్క భారత్ నుంచే 2.22 కోట్ల టన్నులు ఎగుమతి అయ్యాయి. ఇందులో బాస్మతియేతర రకాల బియ్యం1.8 కోట్ల టన్నులు. ఈ1.8 కోట్ల టన్నులలో 1.03 కోట్ల టన్నులు తెల్ల బియ్యం ఉన్నాయి. బియ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ఎగుమతులు తగ్గాయి. ఇప్పటికే నూకల ఎగుమతులపై ఆంక్షలు పెట్టగా మొత్తం దేశ ఎగుమతులు 30-–40 శాతం ప్రభావితం అయ్యాయి. 

మన దగ్గర నుంచే ఎక్కువ

అమెరికాలో ఆసియా ప్రజల ప్రధాన ఆహారం బియ్యమే. ఎక్కువగా భారత్ నుంచే అక్కడకు ఎగుమతి అవుతుంటుంది. భారత్ ఇప్పుడు బాస్మతి తప్ప మిగతా అన్ని రకాల బియ్యం ఎగుమతులు నిషేధించడంతో అమెరికాలోని భారతీయులు, ఆసియా ప్రజలు సూపర్ మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. అయితే.. కొన్ని లెక్కల ప్రకారం ప్రతి నెలా సగటున 6,000 టన్నుల బాస్మతియేతర బియ్యం భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వాటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌ల నుంచే 4,000 టన్నుల బియ్యం ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో సుమారు12,000 టన్నుల బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయి. నిషేధం ప్రకటనకు ముందే మరో 18,000 టన్నుల బియ్యం షిప్పుల్లో ఎక్కించారు. కాబట్టి ఇప్పుడున్న నిల్వలు దాదాపు ఆరు నెలల వరకు సరిపోతాయి. అయితే.. మరో మూడు.. నాలుగు నెలల్లో ఖరీఫ్ క్రాప్ చేతికొచ్చాక కేంద్రం ఎగుమతులపై నిషేధం ఎత్తేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎన్ఆర్ఐలు పెద్దగా భయపట్టాల్సిన అవసరమే లేదు. కాకపోతే... ప్రస్తుతం అమెరికాలో బియ్యం ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి.  

ఎఫెక్ట్‌‌‌‌

ఆఫ్రికా దేశాల్లోని కోట్లాది మందికి కూడా అన్నమే ప్రధాన ఆహారం. దీంతో ప్రస్తుత పరిస్థితులు ఆయా దేశాల్లో తెల్లబియ్యం షార్టేజ్​తోపాటు ద్రవ్యోల్బణానికీ దారితీస్తున్నాయి.  ఇప్పటికే వియత్నాం టన్ను బియ్యం ధరను 600 డాలర్లకు పెంచింది. థాయిలాండ్​లోనూ దాదాపు రెండేండ్ల గరిష్టాన్ని తాకుతూ టన్ను 534 డాలర్లకు చేరింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ధరల పెరుగుదల దశాబ్దం గరిష్టాన్ని చేరవచ్చన్న భయాలు ఉన్నాయి. మనదేశం నుంచి ఎక్కువగా బియ్యం కొనే చైనా, ఫిలిప్పీన్స్​కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి విషమించే అవకాశం ఉంది. గోధుమలు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయోత్పత్తులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. భారత్ నుంచి కొన్ని దేశాలకు ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తితో ఇప్పటికీ బియ్యం ఎగుమతులు సాగుతున్నాయి. దౌత్యపరమైన విధానాలతో భారత్ నుంచి బియ్యం దిగుమతులను చేసుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయా దేశాలకు ఐక్యరాజ్య సమితి వర్గాలు సూచిస్తున్నాయి.

నిషేధం కొనసాగితే మరిన్ని ఇబ్బందులు

భారతదేశం పొరుగు దేశాలకు బాస్మతియేతర బియ్యం అమ్మకాలను కొనసాగిస్తే ప్రభావం పరిమితంగానే ఉంటుంది. నిషేధం మరింతకాలం కొనసాగితే మాత్రం ప్రస్తుతం భారతదేశం నుండి దిగుమతులపై ఆధారపడిన దేశాలకు పెద్ద చిక్కులను తెచ్చిపెడుతుంది. ఇతర ధాన్యాలతో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లలో బియ్యం వర్తకం తక్కువే. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో బియ్యం ఎగుమతులు11శాతం, మొక్కజొన్న 16శాతం, గోధుమలు 27శాతం,  సోయాబీన్ 42శాతం ఉన్నాయి. నిషేధం వల్ల  ప్రపంచ బియ్యం ఎగుమతిదారుల దగ్గర స్టాక్ తగ్గుతుంది. 
దేశీయ అవసరాలను తీర్చడానికి ఎగుమతి నిషేధం కొనసాగింపు ఎంతో ఉపయోగపడుతుంది. భారతదేశంలో ధరలపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.   థాయిలాండ్ , వియత్నాం వంటి ఇతర ప్రధాన ఎగుమతిదారులు ప్రపంచ మార్కెట్ సరఫరాలను బాగా తగ్గిస్తారు. దీనివల్ల ధరలు పెరుగుతాయి.  2007–08లోనూ బియ్యం ఎగుమతులను భారత్ నిషేధించింది. దీంతో ఇతర దేశాలూ ఇదే బాట పట్టాయి.

వియత్నాం జూన్ 2007లో ఆంక్షలు విధించింది.  మే 2008 నాటికి పాకిస్తాన్,  థాయిలాండ్ కూడా ఆ జాబితాలో చేరాయి. ఈ నాలుగు దేశాల మార్కెట్ వాటా 70శాతం పైగా ఉంది. అక్టోబర్ 2007 నుండి ఏప్రిల్ 2008 వరకు బెంచ్ మార్క్ థాయ్ బియ్యం ధర దాదాపు మూడు రెట్లు పెరిగింది. బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతులపై భారతదేశం ఇటీవల నిషేధం విధించడం వల్ల సరఫరాలు విపరీతంగా తగ్గాయి. ఆహార భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో ఆహారం లభ్యత దాదాపు ఐదవ వంతుకు తగ్గుతుందని అంచనా. వాస్తవానికి, దేశీయ ధరలను తగ్గించడానికి దేశం గత సెప్టెంబరులో నూకల ఎగుమతులను నిషేధించినందున ఆఫ్రికన్ కొనుగోలుదారులు బియ్యం అమ్మకాల కోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉంది. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దిగుమతిదారులు థాయిలాండ్,  వియత్నాం వంటి అగ్రశ్రేణి బియ్యం ఎగుమతిదారులతో ప్రభుత్వ ఒప్పందాలపై సంతకం చేయవచ్చు.ఎల్​–నినో వాతావరణ పరిస్థితులు దేశీయ సరఫరాలకు అంతరాయం కలిగిస్తే ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఇండోనేసియా ఇప్పటికే భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వియత్నాం తన  పంటను కోయడం మొదలుపెట్టబోతుంది. ఇది ప్రపంచ బియ్యం సరఫరాపై ఒత్తిడిని తగ్గించవచ్చు. నూకల ఎగుమతులను నిషేధించడం వల్ల ఆహార ద్రవ్యోల్బణమే కాదు డెయిరీ ప్రొడక్టుల రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నూకలను ఆఫ్రికా, చైనా వంటి దేశాలు పశువుల దాణాగా వాడతాయి. ఇప్పుడు వీటి లభ్యత తగ్గింది. గోధుమలు, ఇతర ధాన్యాల రేట్లూ పెరిగాయి. దీంతో డెయిరీ ప్రొడక్టులకు రెక్కలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 3.8 మిలియన్ టన్నుల నూకలను ఎగుమతి చేసింది. ఇది మొత్తం బాస్మతియేతర బియ్యం ఎగుమతుల్లో ఐదవ వంతుకు సమానం. దీంతో ఇలాంటి దేశాలు థాయిలాండ్, వియత్నాం వంటి దేశాల  నుంచి ఎక్కువ ధరకు నూకలను తెప్పించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.

ఎగుమతిదారులకు పండుగే

కొన్నేళ్ళుగా దేశం నుంచి బియ్యం ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా 40శాతంగా ఉంది. ఇక్కడ పేదరిక నిర్మూలన పథకాల కింద దేశవ్యాప్తంగా పేదలకు ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని బ్లాక్​మార్కెట్ల ద్వారా కొందరు బడా ఎక్స్​పోర్టర్లు.. కిలో10నుంచి15రూపాయల చొప్పున కొంటున్నారు. వీటికే సానబట్టి సూపర్​ఫైన్​ రకంగా చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈ బియ్యం ఒక కిలో 50–60 రూపాయల ధర ఉంటోంది. ఈ మేరకే వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయి. దాంతో భారతీయ మారకపు విలువలో కిలో బియ్యానికి రూ.130 వరకు లభిస్తోంది. ఈ పరిస్థితి బ్లాక్​ మార్కెట్​ వ్యాపారులకు కాసులు పండిస్తోందన్న నమ్మకాలు ఉన్నాయి. 

ప్రత్యామ్నాయాలు ఏంటి ?

అమెరికా వంటి దేశాల్లో బియ్యం వాడకం మరీ ఎక్కువగా ఉండదు. బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి విదేశాల్లో ఉండే మనవాళ్లు తక్కువగానే తింటారు. డాక్టర్ల సూచనలను తూ.చ. తప్పకుండా పాటిస్తారు. బియ్యం వాడకాన్ని తగ్గించి మన దగ్గర లభించే సజ్జలు, రాగులు లాంటి పోషక విలువలున్న మిల్లెట్స్ ఎక్కువగా వాడుతుంటారు. క్వీన్వా ఒకటి రెండు కప్పుల బియ్యం పోసి ప్రధాన ఆహారంగా తింటున్నారు. అయితే అమెరికాలో ఉంటున్న మనవాళ్లు ఎవరి దగ్గరైనా బియ్యం లేవని తెలిస్తే వాళ్లకి పంపిస్తున్నారు. కొందరు సాధారణ బియ్యానికి బదులు బాస్మతి బియ్యం వాడుతున్నారు. విదేశీ మార్కెట్లలో బియ్యం ధరలు మాత్రం పెరిగాయి. ఒక నెల వరకు ఇబ్బంది లేదు. వచ్చే నెల వరకు పరిస్థితులు చక్కబడవచ్చు అంటున్నారు ప్రవాస భారతీయులు.

తాత్కాలికమే

ఒక సూపర్ మార్కెట్లో రోజుకు వంద బస్తాల బియ్యం అమ్ముడవుతున్నాయి. అనుకుంటే.. దాన్ని నడిపేవాళ్లు అందుకు సరిపడా స్టాక్ మాత్రమే మెయింటెయిన్ చేస్తారు. కానీ.. బియ్యం ఎక్స్​పోర్ట్​ ఆపేశారు అనగానే ఇంట్లో బియ్యం ఉన్నవాళ్లు కూడా కొనుక్కోవడంతో వంద బస్తాల డిమాండ్ కాస్త రెండు నుంచి మూడు వందల బస్తాలకు చేరుకుంటోంది. దాంతో మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరిగి, ధర పెరుగుతోంది. ఇప్పుడు అమెరికా కెనడాలో జరిగింది కూడా అదే. చాలామంది భారతీయులతో పాటు ఆసియా దేశాల వాళ్లు షాపులకు ఎగబడి బియ్యాన్ని కొన్నారు. దాంతో తాత్కాలిక డిమాండ్ ఏర్పడుతోంది. ఇది ఎక్కువ కాలం ఉండదు. 

నాలుగు రకాలే

ప్రపంచవ్యాప్తంగా చాలా బియ్యం రకాలు ఉన్నాయి. కానీ.. వాటిలో ఎక్కువమంది వాడేది నాలుగు రకాలు మాత్రమే. వాటిలో ముఖ్యమైనది సన్నగా, పొడవుగా ఉండే ఇండికా రకం. ఇప్పుడు మన దేశం బ్యాన్ చేసింది ఈ రకాన్నే. ఇక ఎక్కువగా డిమాండ్ ఉండే రెండో రకం బియ్యం బాస్మతి. మూడోది సుషి కోసం వాడే పొట్టి రకం జపోనికా రైస్. నాలుగోది స్వీట్స్ తయారీలో వాడే స్వీట్ రైస్. అయితే.. ఈ నాలుగింటిలో ఇండికా రకం వైట్ రైస్​ని70శాతం మంది వాడుతున్నారు. అందుకే బ్యాన్ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. అంతేకాదు... ఈ ఎఫెక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుతాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్ పియర్- ఒలివియర్ గౌరించాస్ అంచనా వేశారు. వాస్తవానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బియ్యానికి డిమాండ్ ఉంది. అందుకే 2022 మొదటి నుంచి ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. గత జూన్ నుంచి ఇప్పటివరకు బియ్యం ధరల్లో దాదాపు14శాతం పెరుగుదల కనిపించింది. ఇలాంటి టైంలో ఈ బ్యాన్ నిర్ణయం ధరల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. పైగా వెంటనే సప్లయ్ పెంచడానికి అవకాశం కూడా లేదు. ఇదే టైంలో దక్షిణాసియాలో ప్రతికూల వాతావరణం ఉంది. భారతదేశంలో రుతుపవనాలు సరిగా లేకపోవడం, పాకిస్తాన్​లో వరదలు ఈ సప్లయ్ చెయిన్ మీద ఎఫెక్ట్ చూపించాయి. ఎరువుల ధరలు పెరగడంతో వరి సాగు ఖర్చు కూడా పెరిగింది.

కనీస మద్దతు ధర పెరిగితే..

బియ్యం ధరలను కంట్రోల్లో ఉంచేందుకే ప్రభుత్వం బ్యాన్ నిర్ణయం తీసుకున్నప్పటికీ భవిష్యత్తులో బియ్యం ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సాగు విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడు ఎంఎస్పీ(మినిమమ్ సపోర్ట్ ప్రైస్)ని పెంచింది. ప్రతి సంవత్సరం జులైలో నిర్ణయించే ఎంఎస్పీ మరుసటి సంవత్సరం జూన్ వరకు ఉంటుంది. పోయినేడు ఇది క్వింటాల్​కు 2,040  రూపాయలు ఉంది. అయితే..  2023–24 క్రాప్ ఇయర్​కు మాత్రం ఎంఎస్పీని 2,183 రూపాయలకు పెంచారు. గత ఏడాదితో పోలిస్తే.. 143 రూపాయలు పెరిగింది. ఈ పెరుగుదల బియ్యం ధరల్లో కూడా ఉంటుందని  వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ఎగుమతుల బ్యాన్ వల్ల ఇప్పటికిప్పుడు రైతుల మీద ఎలాంటి ప్రభావం చూపించకపోయినా.. భవిష్యత్తులో ధరలు పెరిగితే లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ.. ఎల్​–నినో ఎఫెక్ట్ ఎక్కువైతే సాగుకు నీళ్లు లేక రైతులకు కన్నీళ్లు తప్పవు.

పేద దేశాలపై ఎఫెక్ట్

మన దేశం142 దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నా.. దాదాపు 42 దేశాల్లోని సగం బియ్యం అవసరాలను ఇండియానే తీరుస్తోంది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ గణాంకాల ప్రకారం.. కొన్ని ఆఫ్రికన్ దేశాలకు దాదాపు 80శాతం బియ్యాన్ని ఇండియానే ఎగుమతి చేస్తోంది. అక్కడివాళ్లకు కూడా బియ్యమే ప్రధాన ఆహారం. ఇలాంటి నిషేధాల వల్ల ఆ దేశాల్లో పేదరికంలో ఉన్నవాళ్లకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ల ఆదాయంలో ఎక్కువ భాగం ఆహారం కోసమే ఖర్చు చేయాల్సి వస్తుంది.

కొత్తేమీ కాదు

దేశాలు ఆహారధాన్యాల ఎగుమతులపై నిషేధం విధించడం కొత్తేమీ కాదు. పోయినేడాది ఉక్రెయిన్​పై రష్యా దాడి చేసినప్పటి నుండి చాలా దేశాలు ఇలా ఆహార ధాన్యాల ఎగుమతులను నిషేధించాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ ఇనిస్టిట్యూట్ ప్రకారం16 దేశాలు ఇలా ఎగుమతులపై నిషేధాలు విధించాయి. 
ఇండోనేసియా పామాయిల్​ను, అర్జెంటీనా బీఫ్ ఎగుమతులను నిషేధించాయి. టర్కీ, కిర్గిజిస్తాన్ దేశాలు కొన్ని ధాన్యాల ఎగుమతులను ఆపేశాయి. కరోనా వచ్చిన మొదటి నాలుగు వారాల్లో 21 దేశాలు తమ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. అలాంటప్పుడు మార్కెట్ ధరల్లో మార్పులు రావడం సహజమే. కానీ.. ఇండియాలాంటి పెద్ద ఎక్స్​పోర్టర్ నిషేధం విధించినప్పుడు ఆ ఎఫెక్ట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతుంది. కొన్ని ఆఫ్రికన్ దేశాలను మరింత ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఈ పరిస్థితులు రెండు మూడు నెలల్లో చక్కబడతాయన్న నమ్మకం ఉంది.

మన దగ్గర సాగు పెరిగింది

దేశంలో ఒకప్పుడు వరిసాగు అంటే పంజాబ్​, ఉత్తరప్రదేశ్​, పశ్చిమ బెంగాల్​ గుర్తొచ్చేవి. ఇప్పుడు ఆ లిస్ట్‌‌లో మన రాష్ట్రం కూడా చేరిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం తక్కువగానే ఉండేది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. దిగుబడులు కూడా పెరిగాయి. కొన్నేండ్ల నుంచి వర్షాలు విస్తారంగా కురవడమే సాగు పెరగడానికి ముఖ్య కారణం. 
2013-14తో పోలిస్తే వానాకాలంలో 238 శాతం, యాసంగిలో 450 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. 
పోయిన యాసంగి వరి సాగులో తెలంగాణ రైతులు సరికొత్త రికార్డు సృష్టించారు. మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 57.43 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 2019-20 యాసంగి సీజన్‌‌‌‌‌లో 39.31 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. పోయినేడు వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం 64.55 లక్షల ఎకరాలు. సాగు విస్తీర్ణంలోనే కాదు.. ఉత్పత్తిలోనూ పంజాబ్‌‌, ఉత్తర ప్రదేశ్​, పశ్చిమ బెంగాల్​ లాంటి రాష్ట్రాలకు పోటీ ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం 2022-23లో 160.14 లక్షల టన్నుల
 బియ్యం ఉత్పత్తితో తొలి స్థానంలో నిలిచింది. 

ప్రమాదమా? 

బియ్యం ఎగుమతులపై భారతదేశం విధించిన ఆంక్షలు ప్రపంచ ఆహార ధరల ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉంది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) చీఫ్ ఎకానమిస్ట్‌‌‌‌ పియరీ ఒలివియర్ గౌరించాస్ అన్నారు. దీనివల్ల ఇతర దేశాల్లో ధాన్యం ధరలు 10–15శాతం పెరగొచ్చని అంచనా వేశారు.

భవిష్యత్తులో...

ఈ సీజన్​లో ఎల్​–నినో ఎఫెక్ట్‌‌‌‌ వల్ల పంటలకు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.  ఎల్​–నినో వల్ల సెప్టెంబర్ నాటికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేర పెరగొచ్చని ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ అంచనా వేసింది. అయితే.. మొత్తం సీజన్‌‌‌‌లో ఉష్ణోగ్రతలు1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండవని భారత వాతావరణ శాఖ అంచనా. జులైలో ఇండియాలో వర్షాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నాయి. వాస్తవానికి జులై మొదటి రెండు వారాల్లో వాయువ్య భారతదేశంలో వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 59 శాతం  మిగులు  వర్షపాతం నమోదైంది. దక్షిణ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం 19 శాతం లోటు వర్షపాతం ఉంది. ఎల్​–నినో ఎఫెక్ట్‌‌‌‌ వల్ల పంజాబ్, హర్యానా వంటి ప్రాంతాల్లో బాస్మతి వరి పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. యూపీ, బిహార్, జార్ఖండ్, చత్తీస్‌‌‌‌గఢ్, పశ్చిమ బెంగాల్‌‌‌‌లో తక్కువ వర్షపాతం ఉంటుంది. ఆగస్టులో వర్షాలు బాగుంటే పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. 

తగినన్ని బియ్యం ఉన్నాయి

ఎగుమతి నిషేధం తర్వాత కూడా అమెరికా మార్కెట్‌‌‌‌లో బియ్యం నిల్వలు తగినంత ఉన్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులు (ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఐలు) బియ్యం దొరకవేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అయితే..  ప్రవాస భారతీయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాం. గతంలో  16-18 డాలర్లు పలికిన 9.07 కిలోల బియ్యం బస్తా ధర ఇప్పుడు రెండింతలు పెరిగింది. కొన్ని చోట్ల 50 డాలర్ల వరకు వసూలు చేస్తున్నారు. 

- కిరణ్ కుమార్ పోలా
డెక్కన్ గ్రెయిన్స్ ఇండియా డైరెక్టర్