హైదరాబాద్‌లో కాలం చెల్లిన వాహనాలు 21 లక్షలపైనే

హైదరాబాద్‌లో  కాలం చెల్లిన వాహనాలు 21 లక్షలపైనే
  • 17 లక్షల బైక్‌‌‌‌లు, 3.5 లక్షల కార్లు పదిహేనేండ్లకు పైబడినవే..
  • గ్రీన్‌‌‌‌ట్యాక్స్‌‌‌‌, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్టులు లేకుండానే రోడ్లపైకి
  • పెరుగుతున్న పొల్యూషన్‌‌‌‌, యాక్సిడెంట్లు
  • పట్టించుకోని ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్‌‌‌‌ పోలీసులు

హైదరాబాద్, వెలుగు : కంపెనీల నుంచి వెలువడే కాలుష్యానికి తోడు కాలం తీరిన వాహనాల వల్ల వచ్చే కాలుష్యంతో గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రేటర్‌‌‌‌ పరిధిలో తిరిగే ప్రతి నాలుగు వాహనాల్లో ఒకటి కాలం చెల్లిన వెహికలే కావడం గమనార్హం. ఇలా లక్షలాది వాహనాలు నగరంలోని రోడ్లపై పరుగులు పెడుతుండడంతో ఓ వైపు కాలుష్యం, మరో వైపు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లు లేకుండా, గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ కట్టకుండానే వాహనాలు రోడ్లపైకి వస్తున్నా ఆర్టీఏ ఆఫీసర్లు, ట్రాఫిక్‌‌‌‌ పోలీసులు పట్టించుకోవడం లేదు. 

15 ఏళ్లు దాటిన వాహనాలు 20 లక్షల పైనే...

గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ పరిధిలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాస్తవానికి 15 సంవత్సరాలు దాటిన వాహనాలు రోడ్లపైకి రావాలంటే తప్పనిసరిగా ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్టులు చేయించడంతో పాటు, గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ చెల్లించాలి. కానీ ఇవేమీ లేకుండానే 15 నుంచి 20 సంవత్సరాలు పూర్తయిన వాహనాలు సైతం గ్రేటర్‌‌‌‌ రోడ్లపై తిరుగుతున్నాయి. గ్రేటర్‌‌‌‌ పరిధిలో తిరిగే ప్రతి నాలుగు వాహనాల్లో ఓ వెహికల్‌‌‌‌కు గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ కట్టే టైం దాటినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. 

ఆర్టీఏ లెక్కల ప్రకారం హైదరాబాద్‌‌‌‌లో 80 లక్షల నుంచి 90 లక్షల వాహనాలు ఉండగా 21 లక్షల వాహనాలు 15 ఏళ్లు లేదా అంతకంటే పైబడినవేని తేలింది. ఇందులో 17 లక్షలు ద్విచక్రవాహనాలు, 3.5 లక్షల కార్లు, లక్ష గూడ్స్ వెహికల్స్‌‌‌‌, ఆటోలు 20 వేలు, క్యాబ్‌‌‌‌లు 4 వేల వరకు ఉన్నాయి. పలు విద్యా సంస్థలకు చెందిన సుమారు 2 వేల బస్సులు కూడా 15 ఏళ్లు దాటినవేనని తెలుస్తోంది. వీటిలో చాలా వాహనాలకు గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ చెల్లించాల్సి ఉన్నా యజమానులు పట్టించుకోవడం లేదు. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ పరీక్షలను సైతం చేయించడం లేదు. 

శ్వాససంబంధ వ్యాధుల బారిన ప్రజలు

కాలం చెల్లిన వాహనాలు అధిక మోతాదులో కార్బన్‌‌‌‌ డైఆక్సైడ్‌‌‌‌, హైడ్రో కార్బన్, నైట్రోజన్‌‌‌‌ ఆక్సైడ్, కార్బన్‌‌‌‌ మోనాక్సైడ్‌‌‌‌, మీథేన్‌‌‌‌ వంటి ప్రమాదకర వాయువులు వెలువడుతాయి. ఇలాంటి వాహనాలు పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ను సైతం ఎక్కువ మొత్తంలో తీసుకుంటాయని ఆఫీసర్లు తెలిపారు. వాహనాలు రోడ్లపై తిరుగుతున్నప్పుడు వాటి నుంచి ప్రమాదకర వాయువులు వెలువడి గాల్లో కలుస్తున్నాయి. ఇలాంటి గాలి పీల్చడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లేని వాహనాల కారణంగా రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. 

పట్టించుకోని ఆఫీసర్లు

ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్టులు లేకుండా, గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ కట్టకుండా పదిహేను ఏండ్లకు పైబడిన వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా అటు ఆర్టీఏ ఆఫీసర్లు గానీ, ఇటు ట్రాఫిక్‌‌‌‌ పోలీసులు గానీ పట్టించుకోవడం లేదు. ఇలాంటి వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. 15 ఏండ్లకు పైబడినవాహనాలను పక్కనపెట్టే విషయంలో ప్రభుత్వపరంగా ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఇలాంటి వాహనాలను స్వచ్ఛందంగా పక్కన పట్టేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించినా అది అమలు కావడం లేదు.