బీఆర్ఎస్​తో పొత్తు.. బహుజనుల కోసమేనా?

బీఆర్ఎస్​తో పొత్తు.. బహుజనుల కోసమేనా?

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విసుగు చెందిన తెలంగాణ ప్రజానీకం ఆ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడారు. అంతేవేగంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబట్టారు. వాస్తవానికి నాలుగు నెలల కాంగ్రెస్ పాలన పట్ల సర్వత్రా ప్రజలు కొంత సంతృప్తిగా ఉన్న మాట యథార్థం. అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం కనిపిస్తున్న తరుణంలో బీఎస్పీ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్​తో జతకట్టడం చర్చనీయాంశమైంది.  ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఎస్పీ అష్ట కష్టాల పాలవుతున్నది.  బీఎస్పీకి తెలంగాణాలో కనీసం రాజకీయంగా తన ఉనికిని చాటుకోవడానికైనా ఈ పొత్తు  మేలు చేస్తుందా అనేది ప్రశ్న. అట్టడుగు వర్గాల హక్కులు, సాధికారత కోసం బీఎస్పీ భారత రాజకీయాల్లో 2004 వరకు బలమైన శక్తిగా కొనసాగింది.

ఆ తర్వాత ఎన్నో ఒడుదొడుకులు అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ,  ఆ పార్టీ వ్యవస్థాపక సూత్రాలైన సామాజిక న్యాయం,  పాలనకు రానురాను కట్టుబడి లేకుండా పోయింది.  దేశంలో అభివృద్ధి పేరుతో విధ్వంసం, అణచివేత, అసమానత్వం పెచ్చరిల్లుతున్నప్పుడు బహుజన సమాజం గొంతును వినిపించడంలో బీఎస్పీ విఫలమైంది. కానీ, తెలంగాణలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్  మాత్రం ప్రజావ్యతిరేక విధానాలను అమలుపరుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో సమస్యలపై ఉద్యమించారు. ముఖ్యంగా ఫ్యూడల్ పాలన, గడీల పాలన అంతం కావాలని అయన ధ్వజమెత్తారు.  

ఎన్నో ప్రజా అనుకూల అంశాలలో ముఖ్యంగా టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజీలు, పరీక్షల వాయిదాల విషయంలో నికార్సుగా ఉద్యమించిన వాళ్లలో ప్రవీణ్ కుమార్ ఒకరు. గత పాలకుల వైఫల్యాల వల్ల ఒక తరం నష్టపోయింది. బహుజన విద్యార్థులు అలాంటి గడ్డుకాల పరిస్థితుల నుంచి ఇంకా తేరుకోలేదు.  మేడిగడ్డ లాంటి ప్రాజెక్టుకి జరిగిన నష్ట నివారణ పూడ్చనే లేదు. ఈ పరిస్థితుల్లో ఏ వర్గ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీతో  బీఎస్పీ జతకడుతోంది?.

స్వార్థ రాజకీయ భావజాలం

ఎన్నికల్లో పొత్తులు సహజమే కావచ్చు. కానీ, దళితుల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడని రాజకీయ సమూహాలకు  మద్దతు ప్రకటించడం సమంజసమేనా.  ఇది పార్టీ అభివృద్ధికి కానీ,  ప్రస్తుత సమాజంలోని ఏ వర్గమూ వెనుకబడిపోకుండా ఉండటానికిగానీ ఈ పొత్తు ఉపయోగపడుతుందా?.  అధికారం కోల్పోయిన  బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తును విశ్లేషిస్తే  తెలంగాణలో ఆ పార్టీ బలోపేతానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.  కానీ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో బీఎస్పీ బలి పశువు కారాదు.

నిజానికి ఈ పొత్తు.. వ్యవస్థలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించటానికి కాకపోవచ్చు. ఇందులో స్వార్థ రాజకీయ భావజాలం దాగి ఉన్నది. అంతేకాదు ఈ పొత్తును బీఎస్పీ మద్దతుదారులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒక్కమాటల్లో చెప్పాలంటే మనువాద భావజాలాన్ని అనుసరించే రాజకీయ పార్టీల వల్ల దళితుల ఆస్తిత్వానికి ముప్పు పొంచి ఉన్నది.  ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు అనుసరించే భావజాలం పూర్తిగా దళితులకు విరుద్ధం. 

బీఆర్ఎస్​తో బీఎస్పీ పొత్తు విచారకరం

 బీఎస్పీ రాజకీయ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా అధికారాన్ని కాన్షీరాం చేపట్టారు. కాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసిన బీఎస్పీకి కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలు కొంతమేరకు సానుకూలంగానే స్పందించారు. బహుజన పార్టీకి తెలంగాణలో అనుకూల పరిస్థితులే కనిపించాయి. అంతేకాదు ఒక ప్రత్యామ్నాయ పార్టీగా బీఎస్పీ తెలంగాణ రాజకీయాల్లో బలపడబోతున్నదని  ఎన్నికలకు ముందు ప్రజలు విశ్వసించారు. 


గతంలో మాయావతి ఉత్తరప్రదేశ్​లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు వారి సంప్రదాయక ఓటు బ్యాంకు ప్రధానంగా బీజేపీ వైపు మళ్లింది. ఆ తర్వాత నుంచి బీఎస్పీ రాజకీయంగా కోలుకోలేకపోతున్నది. ఇప్పుడు రాష్ట్రంలో సామాన్య ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలించిన వారితో బీఎస్పీ పొత్తుపెట్టుకోవడం విచారకరం. అయితే ఈ ఎన్నికలలో పార్టీ తరఫున స్వతంత్రంగా పోటీ చేస్తే పార్టీ పట్ల కొంత సానుభూతి, పార్టీ విస్తరణకు ఉపయోగపడేది. ఇలాంటి సమీకరణాల వల్ల పార్టీకి జరిగే  మేలు కంటే శాశ్వతంగా జరిగే నష్టం ఎక్కువ.  ఎందుకంటే బహుజన ఓటు బ్యాంకు అన్ని పార్టీలకు  సమానంగా విస్తరించి ఉంది. అందువల్ల పార్టీ  ప్రధాన క్యాడర్ అత్యధికంగా వనరులు కలిగిన పార్టీల వైపు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ పొత్తు వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎదగడానికి మాత్రమే ఉపయోగపడవచ్చు తప్ప బహుజన సంక్షేమానికి కాదు.

అప్రజాస్వామికంగా రాజకీయ సమీకరణలు

సమకాలీన రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అన్వేషించటం అంటే నమ్మిన విలువలని అగ్రవర్ణ పార్టీలకు తాకట్టుపెట్టి రాజకీయం చేయడం కాదు. రాష్ట్రంలో బహుజన రాజ్య స్థాపనకు అనుకూల పరిస్థితులు లేవనుకున్నప్పుడు బహుజన ఓటు బ్యాంకు, వివిధ కుల, మత సమూహాలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ సమాజంలోని అట్టడుగు వర్గాల వారి సామాజిక,  ఆర్థిక, రాజకీయపరమైన వివక్షల పట్ల పోరాడకుండా బీఎస్పీ తన భావజాలాన్ని అధికార సాధనకు మాత్రమే పరిమితం చేసింది.

దేశంలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు అప్రజాస్వామికంగా మారుతున్నాయి.  పార్టీలు అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ మూడోసారి గద్దెనెక్కడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే తన పదేండ్ల పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన, ప్రశ్నిస్తే అణచివేతలకు పాల్పడుతున్న తీరు చూస్తే భవిష్యత్తులో మరింత భయానక పరిస్థితులు  తప్పవేమోనని అనిపిస్తున్నది.  దేశ సమకాలీన రాజకీయాలలో చాలా భిన్నమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సైద్ధాంతికపరమైన భావజాలం ఎన్నికలలో అంత ప్రాధాన్యత సంతరించుకోవటంలేదు. మతాన్ని జోడించి రాజకీయం చేయడం  రాజకీయ లక్షణంగా మారడం శోచనీయం.

-  సునిల్ నీరడి, ఉస్మానియా యూనివర్సిటీ