
న్యూఢిల్లీ: టీవీలలో గేమ్స్ చూసేవాళ్లు విపరీతంగా పెరుగుతున్నారు. ఫలితంగా టీవీ స్పోర్ట్స్ మార్కెట్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.9,830 కోట్లకు చేరుకుంటుందని రిపోర్ట్ ఒకటి అంచనావేసింది. మరోవైపు ఓటీటీలలో కూడా స్పోర్ట్స్ ఫాలో అయ్యేవారు పెరుగుతున్నారని, ఈ సెగ్మెంట్ మార్కెట్ సైజు వచ్చే మూడేళ్లలో రూ. 4,360 కోట్లకు చేరుకుంటుందని కేపీఎంజీ, సీఐఐ, ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) లు కలిసి విడుదల చేసిన రిపోర్ట్ అంచనావేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్పోర్ట్స్ ఓటీటీ మార్కెట్ సైజు రూ.1,540 కోట్లుగా రికార్డయ్యింది.
ఇదే టైమ్‌లో టీవీ స్పోర్ట్స్ మార్కెట్ రూ. 7,050 కోట్లుగా ఉంది. దేశంలో క్రికెట్‌కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఐపీఎల్ పెద్ద మొత్తంలో వ్యూవర్లను ఆకర్షిస్తుంటే, కబడ్డి, ఫుట్‌బాల్, ఖోఖో వంటి గేమ్స్‌కు సంబంధించిన ఈవెంట్స్ కూడా వ్యూవర్లను టీవీలకు, ఓటీటీలకు కట్టిపడేస్తున్నాయి. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో వివిధ రకాల స్పోర్ట్స్ (ఓటీటీ, టీవీ) వ్యూవర్‌షిప్ 72.2 కోట్లుగా రికార్డయ్యింది. కరోనా ముందు స్థాయి (2019) లో నమోదైన 77.6 కోట్ల వ్యూవర్‌షిప్‌ను ఈ ఏడాది దాటేయ్యొచ్చని కేపీఎంజీ, సీఐఐ, ఐబీడీఎఫ్ విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది.
ఓటీటీలు ఉన్నా..టీవీలోనే
‘ఓటీటీల్లో కంటెంట్ చూసేవారు విపరీతంగా పెరిగారు. అదే విధంగా ఓటీటీలలో స్పోర్ట్స్‌ను ఫాలో అయ్యేవారు ఎక్కువయ్యారు. ఎక్కడైన, ఎప్పుడైన వీడియో కంటెంట్‌ను చూసుకునే వీలుండడంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది’ అని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఓటీటీలలోని స్పోర్ట్స్ ఈవెంట్‌లకు అడ్వర్టయిజర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం, ఓటీటీలకు సబ్‌స్క్రయిబ్ అయ్యే వాళ్లు పెరుగుతుండడంతో స్పోర్ట్స్‌కు వచ్చే సబ్‌స్క్రిప్షన్ రెవెన్యూ పెరుగుతుంది. ఓటీటీలలో స్పోర్ట్స్ చూసేవాళ్లు ఎక్కువవుతున్నా, టీవీ స్పోర్ట్స్ మార్కెట్ కూడా లాంగ్‌టర్మ్‌లో రెండింతలు పెరుగుతుందని ఈ రిపోర్ట్ అంచనావేసింది. ఈ మార్కెట్ సైజ్ వచ్చే మూడేళ్లలో ఏడాదికి 7 శాతం గ్రోత్ సాధిస్తుందని, రూ.9,830 కోట్లకు చేరుకుంటుందని వివరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, స్పోర్ట్స్‌ను అన్ని ఏజ్‌ల వారు ఎంజాయ్ చేస్తారు కాబట్టి వీటి ద్వారా వచ్చే టీవీ యాడ్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది.
కన్జూమర్లు టీవీ కనెక్షన్స్ పెట్టుకునేటప్పుడు స్పోర్ట్స్ ఛానెల్స్‌ను కూడా అందించడం, ఇండ్లలో టీవీ పెట్టుకునేవాళ్లు పెరగడం, టీవీ ఏఆర్‌పీయూ (యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్) వంటి కారణాలతో స్పోర్ట్స్ ద్వారా వచ్చే సబ్‌స్క్రిప్షన్ రెవెన్యూ పెరుగుతోంది. బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అంచనాల ప్రకారం, 2020 లో 21 కోట్ల కుటుంబాల్లో టీవీలు ఉన్నాయి. అంటే సుమారు 90 కోట్ల మంది టీవీ చూస్తున్నారని అర్థం. కానీ, యూఎస్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో టీవీలలో స్పోర్ట్స్ చూసే వాళ్లు ఇంకా తక్కువగానే ఉన్నారని, కేవలం 3 శాతం మంది మాత్రమే స్పోర్ట్స్ చూస్తున్నారని బార్క్ పేర్కొంది. అదే యూఎస్‌లో 10 శాతం మంది టీవీలలో స్పోర్ట్స్ చూస్తున్నారు.
క్రికెటర్లు, ఇతర అథ్లెట్ల పెర్ఫార్మెన్స్ మెరుగుపడితే ఈ గ్యాప్ తగ్గుతుందని కేపీఎంజీ, సీఐఐ,ఐబీడీఎఫ్‌లు కలిసి విడుదల చేసిన రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుతం టీవీ స్పోర్ట్స్ మార్కెట్‌లో క్రికెట్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ అతిపెద్ద టీవీ స్పోర్ట్స్ ఈవెంట్‌గా నిలుస్తోంది. ఈ ఏడాదిలోని మొదటి 44 వారాల్లో లైవ్ అయిన క్రికెట్ కంటెంట్ 16,217 గంటలుగా ఉంది. కిందటేడాది రికార్డయిన 15,506 గంటలను ఇప్పటికే దాటేసింది. కంటెంట్ వాల్యూమ్స్ బట్టి, ప్రజలకు చేరువైన దాని బట్టి చూస్తే క్రికెట్ దరిదాపులకు ఏ ఇతర గేమ్ కూడా రాలేదని కేపీఎంజీ–సీఐఐ–ఐబీడీఎఫ్ రిపోర్ట్ వివరించింది. ఇతర స్పోర్ట్స్ ఈవెంట్‌లు కూడా ఆకర్షిస్తున్నాయని, కిందటేడాది వీటిని చూసినవారు 20 శాతం పెరిగారని తెలిపింది.