12 జిల్లాల్లో మొక్కుబడిగా ‘మన ఇసుక వాహనం’ సర్వీస్
వేములవాడకు చెందిన దామోదర్ 15 రోజుల కింద ఇంటి నిర్మాణాన్ని స్టార్ట్ చేశాడు. ముగ్గు పోసి పునాదులు తీసి కంకర, సలాక, సిమెంట్, ఇతర సామాగ్రి కొని పెట్టుకున్నాడు. ఇక కావాల్సింది ఇసుకే...తన ఊరిలోనే వాగు పారుతుంది కదా..కొరత ఏముంటదని అనుకున్నాడు. కానీ, అక్కడే కష్టాలు మొదలయ్యాయి. ఎంత తిరిగినా ఇసుకకు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. ఆన్లైన్లో బుక్ చేస్తే టెన్షన్ లేకుండా ఇసుక ఇంటికే వస్తుంది కదా అని అనుకున్నాడు. ‘మన ఇసుక వాహనం’ పోర్టల్‌లో చెక్ చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లానే కనిపించలేదు. చేసేదిలేక మళ్లీ అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. వాళ్లు రేపు..మాపు అని చెప్పి తిప్పించుకుంటుండడంతో ఇంటి నిర్మాణాన్ని ఆపేసి ఇసుక ఎప్పుడిస్తారా అని ఎదురుచూస్తున్నాడు.
కరీంనగర్/నెట్ వర్క్, వెలుగు : రాష్ట్రంలో కొత్త ఇల్లు కట్టుకునేవాళ్లను ఇసుక కష్టాలు వెంటాడుతున్నాయి. ఇసుక రీచ్ లు ఉన్న జిల్లాల్లో తప్పా మిగతా జిల్లాల్లో సామాన్యులకు ఇసుక దొరకడం గగనమైంది. నదులు, వాగులు లేని ఏరియాల్లో ఇసుక దొరకడమే కష్టంగా మారింది. ఇసుక రీచ్ లు ఉన్న జిల్లాల్లో స్థానిక వాగుల నుంచి తెచ్చుకుందామంటే రెవెన్యూ, పోలీసుల భయం.. గోదావరి, మానేరు, కృష్ణా నదుల్లోని రీచ్ ల నుంచి వచ్చే ఇసుకను కొనాలంటే వ్యాపారులు చెప్తున్న ధరలు సామాన్య నిర్మాణదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా మానేరు, గోదావరి సాండ్ రీచుల్లోని ఇసుకను కేవలం హైదరాబాద్ సిటీ, దాని చుట్టుపక్కల ఏరియాలకే ఎక్కువగా తరలిస్తుండడంతో..ఇతర పట్టణాలు, జిల్లా కేంద్రాలు, గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టేవారికి ఇసుక దొరకడం లేదు. దీంతో రెవెన్యూ, పోలీసులకు మామూళ్లు ముట్టజెప్తూ వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల ఓనర్లు.. ఒక్కో ట్రిప్పుకు దూరాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు.
ఆ 21 జిల్లాల సంగతేంది?
బ్లాక్ మార్కెట్ గా మారిన ఇసుకను సామాన్యుల ఇంటి వద్దకే ట్రాక్టర్లలో సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్‌ఎండీసీ) ద్వారా 2019 జూలై 1 నుంచి 'మన ఇసుక వాహనం' పేరుతో కొత్తపాలసీని అమలు చేస్తోంది. మన ఇసుక వాహనం పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ లో ఇసుకను బుక్ చేసుకుంటే ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తోంది. ట్రాక్టర్ ట్రిప్పు ఇసుక(3క్యూబిక్ మీటర్లు)కు దూరాన్ని బట్టి రూ.2600 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తోంది. అయితే ఈ పోర్టల్ కేవలం ఇసుక రీచ్ లు దగ్గర్లో ఉన్న 12 జిల్లాలకే పరిమితమైంది. ఇందులో కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నల్లగొండ, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నారాయణపేట్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఈ జిల్లాల్లోనూ కొన్ని మండలాల ప్రజలకు ఇసుక బుక్‌చేసుకునే ఆప్షన్ కనిపించడం లేదు. మరో 21 జిల్లాల పేర్లయితే అసలు పోర్టల్ లోనే కనిపించడం లేదు. దీంతో ఇసుక అవసరాలున్న ఆయా జిల్లాల ప్రజలు బ్లాక్ లో కొనుగోలు చేస్తున్నారు. లేదంటే సమీప వాగుల్లో అనుమతి లేకుండా దొడ్డిదారిన తరలించే ఇసుకను ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తోంది.
లారీ ఓనర్లు, రిటైలర్లు చెప్పిందే రేటు
రాష్ట్రంలో ఇసుక బుకింగ్, అమ్మకాల ప్రక్రియ అంతా ఆన్ లైన్ లో జరుగుతున్నప్పటికీ.. లారీ ఓనర్లు, ఇసుక డంప్ లు నిర్వహించే రిటైలర్లు చెప్పిందే రేటు. మన ఇసుక వాహనం అందుబాటులో లేని 21 జిల్లాల్లో సామాన్యుడు సాండ్ పోర్టల్ లో ఆన్ లైన్ లో బుక్ చేసుకుని ఇసుక రీచ్ ల నుంచి కొనుగోలు చేసే అవకాశమే లేదు. ఈ వ్యవహారమంతా లారీల ఓనర్లే నడిపిస్తున్నారు. ఇసుక బుకింగ్స్ కోసం వీరు ప్రత్యేక టీమ్ లనే పెట్టుకున్నారు. రోజూ టీఎస్‌ఎండీసీ ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందో ప్రకటించగానే.. వీళ్లు బుక్ చేస్తారు. ఇందుకుగాను ఒక్కో బుకింగ్ కు రూ.500 నుంచి రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. ఇలా ఇసుక రీచ్ ల నుంచి తరలించిన ఇసుకను డంపింగ్ యార్డులకు చేర్చి భవన నిర్మాణదారులకు టన్నుల చొప్పున అమ్ముతున్నారు. ఒక్కో టన్నుకు రూ.1500 నుంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. డీజిల్ ధరలు పెరగడం, ఆఫీసర్లకు ఇవ్వాల్సిన మామూళ్ల కారణంగానే గత్యంతరం లేక ఇసుకను ఎక్కువ రేటుకు అమ్మాల్సి వస్తోందని లారీల ఓనర్లు చెప్తున్నారు.
ఇల్లీగల్‌గా రవాణా
రాష్ట్రంలోని మెజార్టీ ఏరియాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు లోకల్ వాగుల ఇసుకే దిక్కవుతోంది. గోదావరి, కృష్ణా ఇసుకకు ఎక్కువ రేటు ఉండడం, అందులో దొడ్డు ఇసుక రాకపోవడంతో స్థానిక వాగుల్లోని ఇసుకనే తరలిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణ పనులకు కావాల్సిన ఇసుక పర్మిట్లను స్థానిక తహసీల్దార్లు, ఆర్డీఓలు ఇస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని చాలాచోట్ల రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు కుమ్మక్కయి ట్రాక్టర్ల యజమానుల దగ్గర డబ్బులు తీసుకుని ప్రభుత్వ పనుల ముసుగులో పర్మిట్లు జారీ చేస్తున్నారు. గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా జరిగే ఇసుక రవాణా అంతా ఇల్లీగల్ గానే నడుస్తోంది.
ఇసుక లేక ఇల్లు కట్టుడు ఆపిన
లింగంపల్లిలో నేను కొత్తగా ఇల్లు మొదలుపెట్టిన. నెల రోజుల క్రితం కంకర, ఐరన్ తోపాటు తెలిసిన ట్రాక్టర్ ఓనర్ తో మాట్లాడి ఇసుక తీసుకొచ్చి పిల్లర్ల వరకు కట్టించిన. ఇప్పుడు దగ్గర్లోని వాగులోగానీ, ఇతర చోట్ల నుంచిగానీ ఇసుక తీసుకురానియ్యట్లేదు. ఇసుక దొరక్కపోవడంతో మిగతా పనులు ముందుకుపోవట్లేదు. గ్రామాల్లో స్థానికుల ఇండ్ల నిర్మాణాలకైనా ఇసుక తెచ్చుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే బాగుండేది. ఇతర జిల్లాల్లో ఉన్నట్లు మన ఇసుక వాహనం లాంటి సౌకర్యం మా జిల్లాలో లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇసుక లేక ఇంటి నిర్మాణం ఆపాల్సి వస్తోంది. మంత్రి కేటీఆర్ జిల్లాలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే మిగతా చోట్ల ఎట్లున్నదో..
- పరశురాం, లింగంపల్లి, వేములవాడ రూరల్