కొత్తపల్లి మున్సిపాలిటీలో పన్ను బాదుడుపై ప్రజల ఆందోళన

కొత్తపల్లి మున్సిపాలిటీలో పన్ను బాదుడుపై ప్రజల ఆందోళన

మున్సిపల్​ ఆఫీస్​ ఎదుట బాధితుల ఆందోళన

కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ ​జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో పన్ను బాదుడుపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్నుల భారం విపరీతంగా పెంచారని, తగ్గించాలంటూ జేఏసీగా ఏర్పడి నెలరోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి పట్టణానికి చెందిన భూమయ్యకు కరీంనగర్​కార్పొరేషన్​లో ఒక ఇల్లు, కొత్తపల్లి పట్టణంలో మరో ఇల్లు ఉంది. ఈ ఏడాది ఏప్రిల్​లో ఈ రెండు ఇండ్లకు టాక్స్​కట్టేందుకు ముందుగా కొత్తపల్లి మున్సిపల్​ఆఫీస్​కు వెళ్లాడు. 2022 ఏప్రిల్​నుంచి 2023 మార్చి వరకు రూ.7,604 చెల్లించాలని అధికారులు చెప్పడంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు. మరుసటి రోజు కరీంనగర్​కార్పొరేషన్​పరిధిలోని ఇంటికి టాక్స్​ కట్టడానికి ఆన్​లైన్​సెంటర్​కు వెళ్లాడు. అక్కడ ఇంటి టాక్స్​రూ.1,500 చూపించింది. అక్కడా చెల్లించాడు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్​గా మారిన కరీంనగర్​టౌన్​కన్నా కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి మున్సిపాలిటీలోని తన ఇంటికి టాక్స్​ఎక్కువ ఎందుకు ఉందని కొత్తపల్లి మున్సిపల్​అధికారులను సంప్రదించాడు. కొత్తగా వచ్చిన భువన్​యాప్​లో ఇంటి వివరాలను నమోదు చేశామని, ఆ యాప్​ ప్రకారం టాక్స్​పడుతుందని అధికారులు సమాధానం ఇచ్చారు. భూమయ్య ఒక్కడే కాదు మున్సిపాలిటీ ప్రజలంతా పన్నులు భారీగా పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని కోరుతూ పట్టణంలోని అన్నిపార్టీల నాయకులు జేఏసీగా ఏర్పడి నెల రోజులుగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మున్సిపల్​ ఆఫీస్​ ఎదుట ఆందోళనకు దిగారు. పెంచిన ఇంటి పన్నును తగ్గించి పాత ఇంటి పన్నుకు ఏటా10 శాతం పెంచుతూ కొత్త ఇంటి పన్ను వసూలు చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్ వేణుమాధవ్​కు అందజేశారు. 

సౌకర్యాలు నిల్.. 

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది కొత్తపల్లి పట్టణ ప్రజల పరిస్థితి. తమ ఊరు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినందుకు సంతోషపడాలో.. మౌలిక సదుపాయాలు సరిగా లేవని బాధపడాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. మున్సిపాలిటీగా మారిన తమ ఊరు కరీంనగర్ కు దీటుగా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. జీపీగా ఉన్న తమ ఊరు పేరు మున్సిపాలిటీగా మారిందే తప్ప మరే ఇతర అభివృద్ధి జరగడం లేదని ప్రజలు అంటున్నారు. జీపీగా ఉన్నప్పుడు రూ.200 కట్టిన ఇండ్లకు ప్రస్తుతం రూ.7 వేల నుంచి 10 వేల వరకు టాక్స్​చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో ఇంటికి మాత్రమే పన్ను లెక్కించి  తీసుకోగా ప్రస్తుతం భువన్​యాప్​ద్వారా జియో ట్యాగింగ్​ చేసి ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలానికి సైతం పన్ను వేస్తున్నారు. ఈ పన్ను పట్టణంలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలు మోయలేని విధంగా ఉంది. రెండు గుంటల స్థలంలో గుంటలో ఇల్లు ఉండి మరో గుంట భూమి ఖాళీగా ఉంటే ఖాళీ స్థలానికి రూ.1,250 పన్నుగా చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి పన్నులు తగ్గించాలని కోరుతున్నారు.