హైదరాబాద్లో పురుగుల మందు తాగి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్లో పురుగుల మందు తాగి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

రంగారెడ్డి- హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మనీషా (28) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన   కానిస్టేబుల్ మనీషా.. శనివారం (ఆగస్టు 02) చికిత్స పొందుతూ మృతిచెందింది. 

2020 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్ మనీషా.. గత 5 సంవత్సరాలుగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో  విధులు నిర్వహిస్తోంది. కుటుంబ కలహాల కారణంగా వారం రోజుల క్రితం నంది హిల్స్ లోని తన ఇంట్లో పురుగుల మందు తాగటంతో  అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
 
వారం రోజులుగా చికిత్స పొందుతున్న మనీషా.. ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. మనీషా మృతితో తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. భర్త వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకోవచ్చని అనుమానిస్తున్నారు బంధువులు. మీర్ పేట పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.