పైసల కోసమే 13 ఏళ్ల బాలుడి హత్య.. ట్యూషన్ నుండి సైకిల్ పై ఇంటికి వెళ్తుండగా..

పైసల కోసమే 13 ఏళ్ల బాలుడి హత్య.. ట్యూషన్ నుండి  సైకిల్ పై ఇంటికి వెళ్తుండగా..

బెంగళూరులోని కగ్గలిపుర రోడ్డులో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. కొద్దిరోజుల క్రితం తప్పిపోయిన 13 ఏళ్ల బాలుడు నిశ్చిత్   మృతదేహం దొరికింది. 

పోలీసు ఫిర్యాదు ప్రకారం  నిశ్చిత్  క్రైస్ట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతుండగా, ఈ బుధవారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లేందుకు ఇంటి నుండి బయలుదేరాక కనిపించకుండా పోయాడు. అతని తండ్రి జె.సి. అచిత్ ఓ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.  కొడుకు సమయానికి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది ట్యూషన్ టీచర్‌ను సంప్రదించగా నిశ్చిత్ ట్యూషన్ అయిపోగానే అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది.

ఆ తర్వాత నిశ్చిత్ సైకిల్‌ అరెకెరె ఫ్యామిలీ పార్క్ దగ్గర కనిపించింది. అదే సమయంలో కొందరు 5 లక్షలు డిమాండ్ చేస్తూ ఒక గుర్తు తెలియని నంబర్ నుండి వారికి ఫోన్ చేశారు. దీంతో వెంటనే హులిమావు పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇచ్చారు. 

పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో గురువారం కగ్గలిపుర రోడ్డు సమీపంలో నిశ్చిత్ మృతదేహం దొరికింది. అయితే అదే రోజు అర్థరాత్రి పోలీసులు ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు. అరెస్ట్ చేసే సమయంలో నిందితులు గురుమూర్తి, గోపాల్ కృష్ణ పోలీసులపై దాడికి ప్రయత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు నిందితులకు బుల్లెట్ గాయాలు అయ్యాయి.

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న గురుమూర్తి, గతంలో నిశ్చిత్ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేశాడు. ఈ హత్యకు గల కారణాలు, ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.