
- సింగరేణి కార్మికవాడలకు సాఫీగా నీటి సరఫరా
- శ్రీరాంపూర్ లో చివరి దశలో ర్యాపిడ్ గ్రావిటీ వాటర్ ప్లాంట్ పనులు
- సింగరేణి మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలకు రోజుకు 30 ఎంఎల్డీ వాటర్
- 50 వేల కుటుంబాలకు సరఫరా
- శాశ్వత పరిష్కారందిశగా చర్యలు
కోల్ బెల్ట్/నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని కోల్ బెల్ట్వాసులకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. కార్మిక కాలనీలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు సింగరేణి మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంటోంది. మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి, సింగరేణేతర కుటుంబాలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు చివరి దశకు చేరుకున్నాయి. రూ.10 కోట్లతో శ్రీరాంపూర్‌లో నిర్మిస్తున్న ర్యాపిడ్ సాండ్ గ్రావిటీ ఫిల్టరేషన్(ఆర్జీఎఫ్) ప్లాంట్ మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానుంది. గోదావరి నది నీటిని శుద్ధి చేసి రోజుకు 30 ఎంఎల్డీల నీరు మూడు ఏరియాల్లోని సుమారు 50 వేల కుటుంబాలకు అందించనుంది. దీంతో వేసవిలో తాగునీటి ఎద్దడి, వానాకాలంలో కలుషిత నీటి నుంచి కోల్ బెల్ట్ వాసులు ఊరట లభించనుంది.
కలుషిత జలాలతో ఇబ్బందులు
సింగరేణి బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి కాలనీల్లో క్వార్టర్స్ లో సుమారు 30 వేల నల్లా కనెక్షన్లు, సాధారణ ప్రజలకు సుమారు 10 వేల వరకు కలెక్షన్లు ఉన్నాయి. శ్రీరాంపూర్ సీతారాంపల్లి గోదావరి నది ఒడ్డునున్న ఇన్‌టెక్‌వెల్ నుంచి నీటిని క్లోరినేషన్ చేసి మూడు ఏరియాలకు సింగరేణి అందిస్తోంది. 1977లో నిర్మించిన ఇన్ టెక్ వెల్ శిథిలావస్థకు చేరడంతో అధికారులు 1995లో అక్కడే మరోదాన్ని నిర్మించి రెండు పైపులైన్లు ఏర్పాటు చేశారు.
కొద్ది కాలం క్రితం మొదటి ఇన్ టెక్వెల్ను మూసివేసి రెండో దాని ద్వారా నీళ్లు సప్లై చేస్తున్నారు. అయితే గతేడాది రెండో ఇన్ టెక్‌వెల్ పైపులైన్లో సమస్య వచ్చి నీటి సరఫరాకు ఇబ్బందులు రావడంతో రూ.7 కోట్లతో సీతారాంపల్లి ఇన్ టెక్‌వెల్ నుంచి సీసీసీలోని జీఎల్ఎస్ఆర్ వరకు దాదాపు 6.6 కిలోమీటర్ల మేర పైపులు కూడా వేశారు. మూడేండ్ల క్రితం వరకు కార్మిక వాడలకు నీటి సరఫరా సాఫీగానే సాగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తిప్పలు మొదలయ్యాయి. ప్రాజెక్టులోని బ్యాక్ వాటర్‌తో నదిలో నీటి నిల్వలు పేరుకుపోవడం, గోదావరి నది పరివాహాక ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా కలవడంతో నీరు కలుషితమవుతోంది. వానాకాలంలో ఇన్ టెక్‌వెల్ వద్ద నదిలో ఛాంబర్ పై మూతలు కొట్టుకుపోవడంతో సాధారణ నీరు అందులోకి చేరి బురద, కలుషిత నీరు కాలనీలకు సప్లై అయ్యేది. ఈ నీటిని తాగిన కార్మిక కుటుంబాలు డయేరియా బారిన పడుతున్నారు. మున్సిపాలిటీ వాటర్ ట్యాంకుల నుంచి, ఆర్వోప్లాంట్ల నుంచి నీటిని తెచ్చుకునేవారు.
శాశ్వత పరిష్కారం
శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి ప్రాంతాల్లోని కార్మిక, కార్మికేతర కుటుంబాలకు తాగునీటి ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు ర్యాపిడ్ సాండ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ నిర్మించాలని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.10 కోట్లు మంజూరు చేసింది. శ్రీరాంపూర్ ఏరియాలోని సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం పరిసరాల్లో ర్యాపిడ్ గ్రావిటీ ప్లాంట్నిర్మాణాన్ని గతేడాది మార్చిలో ప్రారంభించారు. గోదావరి నుంచి నేరుగా వచ్చే నీటిని ఇక్కడ వివిధ దశల్లో శుద్ధి చేసి రోజుకు 30ఎంఎల్డీ నీళ్లను మూడు ఏరియాల్లోని కార్మిక కాలనీలకు సప్లై చేయనున్నారు. శ్రీరాంపూర్ సింగరేణి జీఎం ఎం.శ్రీనివాస్ పర్యవేక్షణలో డీజీఎం ఆనంద్‌కుమార్ (సివిల్) నేతృత్వంలో ర్యాపిడ్ సాండ్ గ్రావిటీ ఫిల్టరేషన్ ప్లాంట్ పనులు సాగుతున్నాయి. మరో రెండు నెల్లలో పనులన్నీ పూర్తయ్యి ప్లాంట్ అందుబాటులోకి రానుంది.
50వేల కుటుంబాలకు తాగునీరు సప్లై చేస్తాం
సింగరేణి కార్మికుల సంక్షేమానికి మేనేజ్మెంట్ కట్టుబడి ఉంది. రూ.10 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీసీసీలో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ల నిర్మాణం చేపడుతున్నాం. అక్టోబర్ నాటికి పనులు పూర్తవుతాయి. ఈ ప్లాంట్ ద్వారా బెల్లంపల్లి రీజియన్‌లోని మూడు ఏరియాల్లోని 50 వేల సింగరేణి కార్మిక, కార్మికేతర కుటుంబాలకు శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీటి సప్లై చేస్తాం.-ఎం.శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం