14 బీసీ కుల సంఘాలకు  బిల్డింగ్ పర్మిషన్

14 బీసీ కుల సంఘాలకు  బిల్డింగ్ పర్మిషన్

హైదరాబాద్‌‌, వెలుగు: మార్చి నెలాఖరులోగా ఆత్మగౌరవ భవనాల పనులు ప్రారంభమవుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌‌ అన్నారు. 14 బీసీ కుల సంఘాలకు బుధవారం హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్‌‌హెచ్‌‌ఆర్‌‌డీలో మంత్రులు శ్రీనివాస్‌‌ గౌడ్‌‌, శ్రీనివాస్‌‌ యాదవ్‌‌తో కలిసి ఆత్మగౌరవ భవనాల పర్మిషన్​ పేపర్లను అందజేశారు. తర్వాత గంగుల మాట్లాడుతూ ప‌‌ట్టాలు పొందిన సంఘాలు త్వరలో బిల్డింగ్​పనులు చేపట్టాలన్నారు. లేకుంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నిర్మాణాలు చేపడుతుందన్నారు. ఒక కులంలోని వివిధ సంఘాలన్ని కలిసి ఒకే సంఘంగా ఏర్పడాలని.. ఈనెల 15లోగా ఇది పూర్తవ్వాలన్ని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆత్మగౌరవ భవనాలు, కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ మాట్లాడుతూ బీసీల కులం ఐక్యత గురించి ప్రతి ఒక్క బీసీ పాటుపడాలని పిలుపునిచ్చారు. మంత్రి శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ మాట్లాడుతూ- చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్- పార్టీదేనని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, బీసీసంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ బుర్రా వెంక‌‌టేశం తదితరులు పాల్గొన్నారు.