బాబును ఓదార్చాడా... సెటిల్ మెంట్ మాట్లాడుకున్నాడా: మాజీ మంత్రి పేర్ని నాని

బాబును ఓదార్చాడా... సెటిల్ మెంట్ మాట్లాడుకున్నాడా: మాజీ మంత్రి పేర్ని నాని

జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడిని ఓదారుస్తా అని వెళ్లి పవన్ కల్యాణ్ సెటిల్‌మెంట్ చేసుకుని వచ్చాడని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌ది ములాఖత్ కాదని.. మిలాఖత్ అని ఎద్దేవా చేశారు.   పవన్ పొత్తు పాతవార్తేనని.. ఇందులో కొత్తదనం ఏమీ లేదని పేర్ని నాని అన్నారు. తెలుగు దేశం పార్టీలో పవన్ కల్యాణ్ ఓ అంతర్భాగమని చెప్పారు. కలవడం, విడిపోవడం కేవలం ముసుగు మాత్రమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పవన్ వ్యాపారం మాట్లాడుకుని వచ్చారా అనేది జనసేన కార్యకర్తలకైనా పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని చెప్పాలని పేర్ని నాని నిలదీశారు.

పవన్ పరామర్శకు జైలుకు వెళ్లి చంద్రబాబుతో డీల్ కుదుర్చుకుని వచ్చారు. ప్రజాధనం దోచుకున్న దొంగను పవన్ పరామర్శిస్తాడా ఇదేనా పవన్ చెప్పిన జనసేన సిద్ధాంతం?. అవినీతిపై పవన్ రాజీలేని పోరాటం చేస్తానన్నాడు. మరి అవినీతిపరుడు అయిన చంద్రబాబుకు ఎలా మద్దతు ప్రకటిస్తాడు. తాను దోచుకున్న డబ్బులో నారా లోకేశ్ వాటా ఇస్తానని చెప్పాడా? లోకేశ్ తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా?. తనను నమ్ముకున్న వారిని మోసం చేసి పవన్ లాభపడుతున్నాడు. కేవలం సినిమాల్లో మాత్రమే పవన్ హీరో.. బయట మాత్రం జోకర్. 25 స్థానాలకు పవన్ అభ్యర్థులను సప్లై చేస్తాడు' అంటూ పేర్ని నాని మండి పడ్డారు.

చంద్రబాబు నాయుడి తత్వమే వాడుకుని వదిలేయడమని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారని.. అలాంటి వ్యక్తితో మరోసారి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. జనసేన జెండా మోసే కార్యకర్తలకైనా ఈ విషయం చెప్పాలి కదా అన్నారు. పవన్ కల్యాణ్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతారని విమర్శించారు. టీడీపీ అవినీతి పార్టీ అని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని గతంలో విమర్శించిన పవన్ కల్యాణే.. ఇప్పుడు రాష్ట్ర ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తిని కలవడానికి జైలుకు వెళ్లారని పేర్ని నాన్ని అన్నారు. 2019లో ఏ సిద్ధాంతాలు కలవక విభేదించి విడిపోయారో, ఇప్పుడు ఏ సిద్ధాంతాలు కలిసి మళ్లీ పొత్తు పెట్టుకుంటున్నారో చెప్పాలన్నారు. అవినీతిపై రాజీలేని యుద్ధమే తన సిద్ధాంతం అని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అవినీతిపరుడితో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావని పేర్ని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తన నటనతో రాష్ట్ర ప్రజలను, జనసేన కార్యకర్తలను వంచిస్తున్నాడని అన్నారు.