
- ఓ వైపు ముర్రాకు తెగుళ్లు, మరోవైపు దుంపకుళ్లు
- 60 శాతం పంటపై ప్రభావం
- దిగుబడిపై దిగాలు చెందుతున్న అన్నదాతలు
- సర్కారు ఆదుకోవాలని డిమాండ్
మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన మహిళా రైతు నల్లా లావణ్య రెండెకరాల్లో పసుపు పంట సాగు చేసింది. ఎకరాకు రూ. 1.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టింది. నవంబర్ చివరివారం వచ్చినా పంట ఎదగలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు దుంప తెగులు సోకి మండలను పురుగులు తినేశాయి. మొక్కలు తవ్వి చూస్తే లోపల మండలు కనిపించడం లేదు. పంట తవ్వకాలకు రావాలంటే ఇంకా రెండు నెలలు ఉంది. అప్పటికి మొత్తం పంటకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది. సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
మెట్ పల్లి, వెలుగు: రాష్ట్రంలో పసుపు పంటపై తెగుళ్లు పంజా విసిరాయి. పంట వేసిన మొదట్లో వర్షాలకు చేన్లలో నీళ్లు నిలవడంతో దుంప తెగులు సోకింది. ప్రస్తుతం మర్రాకు తెగులుతో రైతన్నలు సతమతమవుతున్నారు. ఒకేసారి రెండు రకాల తెగుళ్లు పంటను పీల్చి పిప్పి చేస్తుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 63 వేల ఎకరాల్లో పసుపు పంట సాగు చేశారు. దుంపకుళ్లు కారణంగా పసుపు మొక్క కింది భాగాన కొమ్ము పిలకలు మురిగిపోయాయి. దాదాపు 60 శాతం పంటకు దుంపకుళ్లు సోకినట్లు రైతులు చెబుతున్నారు. దుంప తెగుళ్లు సోకిన పసుపు కొమ్ముల్లో వృద్ధి కనిపించడం లేదు. సాధారణంగా ఎకరానికి సుమారు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, దుంపతెగులుతో ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎకరాకు రూ. 1.2 లక్షల ఖర్చు
ఎకరంలో పసుపు సాగు చేసేందుకు సుమారు రూ. 1.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కోళ్ల ఎరువు, పశువుల పేడ ధరలు పెరగడంతో ఒక్కో లారీకి రూ. 36 వేలు, దుక్కికి రూ.10 వేలు, విత్తనానికి రూ.30 వేలు, విత్తుకోవడానికి రూ.6 వేలు, సేంద్రియ ఎరువులకు రూ.10 వేలు, కలుపుతీత, కూలీల ఖర్చు రూ.10 వేలు, పసుపు తీయడం, ఉడికించడం, పాలీషింగ్, మార్కెట్ తరలింపునకు రూ.25 వేల చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం పసుపు క్వింటాల్ధర రూ. 6 వేల లోపు పలుకుతోంది. సాధారణ దిగుబడి వచ్చి ఉంటే రైతులకు లాభాలు లేకున్నా కనీసం పెట్టుబడి చేతికి అందేది. తెగుళ్ల కారణంగా 40 శాతం లోపు మాత్రమే దిగుబడి వస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
20 శాతం దిగుబడి వస్తలేదు
రెండున్నర ఎకరాల్లో పసుపు సాగు చేశా. కొన్ని నెలల క్రితం కురిసిన వర్షాలకు తడి ఎక్కువయ్యి దుంపకుళ్లు తెగులు సోకి మొక్క ఎదగలేదు. నేలలో కొమ్ము కుళ్లుతోంది. గతేడాది కూడా తెగుళ్లు సోకి దిగుబడి రాక పెట్టుబడి నష్టపోయాం. ఈ ఏడాది రెండున్నర ఎకరాల సాగుకు రూ.2.7 లక్షల ఖర్చయ్యింది. తెగుళ్లు సోకడంతో 20 శాతం పంట దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెట్టుబడి సగం కూడా రావడం కష్టమే.
- సురకంటి భూమారెడ్డి, అమ్మక్కపేట
సస్యరక్షణతో తెగుళ్ల నివారణ
రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే దుంపకుళ్లు, మర్రాకు తెగుళ్లను నివారించవచ్చు. లీటర్ నీటికి ఒక గ్రాము మెటలాక్సిల్ ప్లస్ మాంకోజెట్ లేదా 2 గ్రాముల కాప్టాస్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్‌ను కలిపి తెగులు సోకిన మొక్కలు, వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి. తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి 10 కిలోల ఫారెట్10 జి గుళికలు, ఒక కిలో సైమాక్సోనిల్ ప్లస్ మాంకోజెట్ పొడి, తగినంత యూరియా కలిపి పంట మొత్తం చల్లాలి. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు అవసరమైన మందులు వినియోగించాలి. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తాం.
- ప్రతాప్ సింగ్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్, జగిత్యాల