
- ఫెయిల్ సీడ్ పై క్లారిటీ లేకపోవడమే ప్రధాన కారణం
గద్వాల, వెలుగు : పత్తి విత్తనాలకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఆధారంగా జర్మినేషన్లో పాస్, ఫెయిల్ అయినట్లు చెప్పి రైతుల కష్టాన్ని విత్తన కంపెనీలు, ఆర్గనైజర్లు దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వానాకాలం సీజన్ లో గద్వాల నియోజకవర్గంలో ప్రతి రైతు తన పొలంలో ఎకరం, అర ఎకరం సీడ్ పంట సాగు చేస్తుంటారు. ఎకరా సీడ్ పంట సాగు చేయడానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారు. జర్మినేషన్ లో పాస్ అయితే రైతుకు ఎకరాపై ఖర్చులు పోను రూ.లక్షన్నర వరకు మిగులుతాయి.
ఫెయిల్ అయితే రూపాయి కూడా రాదు. మార్కెట్లో పత్తి విత్తనాలకు డిమాండ్ ఉంటే జర్మినేషన్లో పాస్ అయ్యాయని, లేదంటే ఫెయిల్ అయ్యాయని తేల్చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈసారి మార్కెట్ లో సీడ్ కు డిమాండ్ లేకపోవడంతో 30 శాతం వరకు విత్తనాలను సీడ్ కంపెనీలు ఫెయిల్ చేశాయని రైతులు వాపోతున్నారు. 20 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు రైతులు ఉత్పత్తి చేస్తే, అందులో 6 లక్షల ప్యాకెట్లు ఫెయిల్ చేయడంతో వేలాది మంది రైతులు నష్టపోయారు.
కంపెనీలు, ఆర్గనైజర్ల ఇష్టారాజ్యం..
రైతులు సాగు చేస్తున్న సీడ్ పత్తి పాస్ అయినా ఫెయిల్ అయినా రైతులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కంపెనీలతో రైతులకు ఎలాంటి సంబంధం లేకుండా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సీడ్ ఆర్గనైజర్లు విత్తనాలను అందజేస్తారు. విత్తనాలు ఫెయిల్ అయితే సంబంధిత రైతు కంపెనీని అడగడానికి ఎలాంటి ఆధారాలు ఉండడం లేదు. ఈ వ్యవహారం అంతా ఆర్గనైజర్ల ద్వారా నడుస్తుండడంతో రైతులకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. ఇలా కంపెనీలు, ఆర్గనైజర్ల మోసానికి రైతులు బలవుతున్నారు.
ఫెయిల్ సీడ్‌పై స్పష్టత కరువు..
గద్వాల జిల్లాలో 50 వేల ఎకరాలకుపైగా సీడ్ పత్తిని సాగు చేస్తారు. ఇందులో 80 శాతానికి పైగా జర్మినేషన్ వచ్చిన వాటినే కంపెనీలు తీసుకుంటాయి. 80 శాతం కన్నా తక్కువ జర్మినేషన్ వస్తే ఫెయిల్ సీడ్ కింద పరిగణించి రైతులకే తిరిగిఇవ్వాలి. కానీ, ఫెయిల్ అయిందని చెప్పి విత్తనాలు చూపించకుండా, ఇవ్వకుండా కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లు చేతులు దులుపుకుంటున్నారు. ఫెయిల్ అయిన విత్తనాలను ఏం చేయాలనే దానిపై అగ్రికల్చర్ ఆఫీసర్లు, సర్కారు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.
వాస్తవానికి ఈ విత్తనాలు నాటితే పెద్దగా నష్టం ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. ఫెయిల్ అయిన విత్తనాలను కొందరు ఆర్గనైజర్లు, సీడ్ వ్యాపారులు యాసిడ్ ట్రీట్మెంట్ చేసి, కలర్ అద్ది, వివిధ కంపెనీల పేరుతో ప్యాక్ చేసి అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ఫెయిల్ అయిన సీడ్ ను రైతులు తమ ఇండ్లలో ఉంచుకున్నా, ఇతర రైతులకు అమ్మినా కేసులు
పెడుతున్నారు.
రీ జర్మినేషన్ కు వెనకడుగు..
సీడ్ విత్తనాలను రైతు కమిటీ సమక్షంలో జర్మినేషన్ చేయించాలనే ప్రతిపాదనను సీడ్ కంపెనీలు అంగీకరించడం లేదు. ఫెయిల్ అయిన విత్తనాలను రీ జర్మినేషన్ చేయాలని ఆఫీసర్లు సూచించారు. కానీ, కంపెనీలు ఒప్పుకోకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. మార్కెట్లో డిమాండ్ లేకపోతే రైతులకు డబ్బు చెల్లించాల్సి వస్తుందనే కారణంతో ఫెయిల్ చేసే అవకాశాలు ఉంటాయని పలువురు సైంటిస్టులు చెబుతున్నారు. వ్యాపారుల మోసం నుంచి రైతులు బయటపడాలంటే రీ జర్మినేషన్ కు రైతులతో కమిటీలు వేయడమే ఏకైక మార్గమని చెబుతున్నారు.
రైతు తీసుకెళ్లిన శాంపిల్ ను కంపెనీలో పరీక్షించి పాస్, ఫెయిల్ నిర్ధారిస్తారు. ఇందులో కంపెనీలు చెప్పిందే వేదం. జర్మినేషన్ లో పాస్ అని వస్తే రైతుకు నాలుగు రూపాయలు చేతికొస్తాయి. లేదంటే ఒక్క రూపాయి కూడా రాదు. పైగా ఆర్గనైజర్లు రైతుకు అప్పుగా ఇచ్చిన డబ్బులను బలవంతంగా వసూలు చేస్తారు. రైతు, ఆర్గనైజర్, కంపెనీ మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేకపోవడంతో రైతులు అన్యాయానికి గురవుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేక ఫెయిల్ అని చెబితే ఊరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇకనైనా సర్కారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, సీడ్ విత్తనాలను రీ జర్మినేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
హై లెవెల్ లో నిర్ణయం తీసుకోవాలి..
ఫెయిల్ అయిన విత్తనాలపై హై లెవెల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొన్ని కంపెనీలు ఫెయిల్ అయిన లాట్లను చూపించడానికి ఒప్పుకుంటున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా, నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం. నకిలీ సీడ్ వ్యాపారం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. - సక్రియ నాయక్, డీఏవో