
కొందరు నచ్చిన ఫుడ్ కోసం ఎంత దూరమైనా వెళ్లి తింటారు. ఢిల్లీకి చెందిన సాగర్ కూడా అలాంటివాడే. ఎందుకంటే.. ఫుడ్ కూడా ఒక రకమైన ఎమోషన్. నచ్చితే అంత ఈజీగా వదులుకోలేం. తనకు నచ్చిన ఫుడ్ కోసం తన కెరీర్‌నే పణంగా పెట్టాడు. పదేళ్ల పాటు బ్యాంకింగ్ రంగంలో చేస్తున్న ఉద్యోగం వదిలేసి.. 39 ఏండ్ల వయసులో స్టార్టప్ పెట్టాడు. దాని ద్వారా ‘చోలే కుల్చే’ వెండింగ్ మెషిన్ తయారుచేసి.. అసలైన ఫుడ్ లవర్ అనిపించుకున్నాడు.
సాగర్ మల్హోత్రా పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో పుట్టి పెరిగాడు. చదువు కూడా నార్త్ ఇండియాలోనే పూర్తి చేశాడు. అతనికి చిన్నప్పటినుంచి ‘చోలే కుల్చే’ అనే స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. బ్రెడ్(కుల్చా), ఉడికించిన కాబులీ శనగల్లో మసాలాలు కలిపి చేసే ప్రత్యేకమైన కర్రీ(చోలే) కలిపి సర్వ్ చేస్తారు. దీన్ని నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా తింటుంటారు. ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల చోలే కుల్చే రెగ్యులర్‌గా తినేవాడు సాగర్.
చదువు పూర్తయ్యాక బ్యాంకింగ్ రంగంలో జాబ్ సాధించాడు. ఎక్కవ రోజులు బెంగళూరు, పుణె, ముంబై లాంటి నగరాల్లోనే ఉద్యోగం చేశాడు. అయితే.. అక్కడ సాగర్ రుచికరమైన చోలే కుల్చే తినలేకపోయాడు. ఢిల్లీలో దొరికే చోలే కుల్చేతో పోలిస్తే.. మహారాష్ట్ర, సౌత్ ఇండియాలో దొరికేదానికి రుచిలో చాలా తేడా ఉంది. ఢిల్లీ స్ట్రీట్ స్టైల్ చోలే కుల్చే రుచి కోసం సౌత్‌లో చాలా ప్రాంతాల్లో వెతికాడు. కానీ.. దొరకలేదు. ‘ఉత్తర భారతదేశపు ఐకానిక్ ఫుడ్ దేశమంతా ఎందుకు దొరకడం లేదు’ అని ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు.
స్టార్టప్ పెట్టాలనే..
ఉద్యోగంలో చేరి.. చూస్తుండగానే 14 సంవత్సరాలు గడిచిపోయాయి. సాగర్ సిటీబ్యాంక్, క్రెడిట్ సూయిస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశాడు. క్రమంగా ప్రమోషన్లు కూడా వచ్చాయి. క్రెడిట్ నూయిస్లో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడు. అదే టైంలో 2023లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన సీనియర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌కి వెళ్లాడు. అక్కడ కొంతమంది సీఈవోలు, ఎంట్రపెన్యూర్లు, బ్లాగర్లను కలిశాడు. వాళ్లలో చాలామంది గతంలో ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లే.
కానీ.. ఇప్పుడు నచ్చిన పనులు చేస్తూ కార్పొరేట్ ఎంప్లాయిస్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అప్పుడే సాగర్ కూడా తనకు ఎంతో నచ్చిన ‘చోలే కుల్చే’ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏదైనా స్టార్టప్ పెడితే బాగుంటుంది అనుకున్నాడు. తన ఆలోచనని బంధువులు, ఫ్రెండ్స్‌తో లెక్కలేనన్ని సార్లు చర్చించాడు. చివరకు ఢిల్లీలో రోడ్డు పక్కన ఉండే తోపుడు బండి మీద అమ్మే చోలే కుల్చే రుచిని రీక్రియేట్ చేయగలిగే ఒక మెషిన్‌ను తయారుచేయాలి అని నిర్ణయించుకున్నాడు.
అమ్మ వల్లే సక్సెస్
ఈ వెంచర్ సక్సెస్‌కు తన కుటుంబం ముఖ్యంగా తల్లి స్నేహ్ మల్హోత్రా చాలా సపోర్ట్ చేసిందంటున్నాడు సాగర్. ‘‘నా ఆలోచనను ఎంతమంది విమర్శించినా నా ఫ్యామిలీ మాత్రం ఎప్పుడూ నాకు తోడుగా నిలిచింది. ముఖ్యంగా మా అమ్మ నన్ను బాగా ఎంకరేజ్ చేసింది. ఉద్యోగాన్ని వదిలేస్తానని చెప్పినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒప్పుకుంది. అంతెందుకు మెషిన్ తయారీ నుంచి అవుట్‌లెట్లు పెట్టేవరకు మా అమ్మ నా టీంతో కలిసి పనిచేసింది.
టెస్టింగ్ చేసే టైంలో వందల కిలోల కాబులీని ఉడికించి రెడీ చేసింది. కంపెనీలో ప్రస్తుతం నాతోపాటు మరో ఐదుగురు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు రూ. 10 లక్షల ఆదాయం వచ్చింది. దేశంలోని ఏ ప్రాంతం వాళ్లకైనా రుచికరమైన చోలే కుల్చేని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం” అన్నాడు సాగర్.
అనుభవం లేదు
సాగర్ ఒక సక్సెస్ఫుల్ బ్యాంకర్. కానీ.. ఇంజనీరింగ్‌లో పెద్దగా అనుభవం లేదు. పైగా టెక్నాలజీ మీద కూడా అవగాహన లేదు. అలాంటప్పుడు చోలే కుల్చే వెండింగ్ మెషిన్ని తయారుచేయడం చాలా కష్టమైన పనిగా అనిపించింది. చుట్టూ ఉన్నవాళ్లు కూడా తన ఆలోచనని వ్యతిరేకించారు. ‘‘నీకు కనీసం ఎలక్ట్రానిక్స్ ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు. అలాంటిది చోలే కుల్చే మెషిన్ ఎలా తయారుచేస్తావు” అన్నారు. ఎంతమంది నిరుత్సాహపరిచినా సాగర్ మాత్రం తన ఆలోచనని మార్చుకోలేదు.
మెషిన్ మీద పరిశోధన చేస్తూనే ఉన్నాడు. అలా 2024 మార్చి నాటికి సాగర్ ఒక నమూనా తయారుచేశాడు. ‘‘మొదట్లో మోటార్లు ఎలా పనిచేస్తాయి? మెషిన్ వైరింగ్ ఎలా చేయాలి? ఫుడ్-గ్రేడ్ మెషిన్ల తయారీలో ఎలాంటి మెటీరియల్ వాడాలి?.... ఇలాంటి బేసిక్ విషయాలు కూడా నాకు తెలియవు. అందుకే వాటి గురించి నేర్చుకోవడానికి చాలా సమయం కేటాయించా. ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు చదివా. ఇంజనీర్లతో మాట్లాడా. మెషిన్ల మాన్యుఫాక్చరింగ్ సెంటర్లకు వెళ్లా. సాధ్యమైనంతవరకు ప్రతిదీ నేర్చుకున్నా. వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారాలను కనుగొన్నా”అన్నాడు సాగర్.
మెషిన్ రెడీ..
ఎన్నో విషయాలు తెలుసుకున్న తర్వాత చివరికి ఒక నమూనా మెషిన్ తయారుచేశాడు. అది ఒకసారి 30 నుంచి 40 చోలే కుల్చేలను మాత్రమే తయారుచేయగలదు. ఆ తర్వాత మళ్లీ మెషిన్ని రీసెట్ చేయాల్సి ఉంటుంది. కానీ.. మనిషి అవసరమే లేకుండానే వందలాది చోలే కుల్చేలు తయారుచేసే మెషిన్ తయారుచేయాలి అనుకున్నాడు సాగర్. అందుకే మళ్లీ మెషిన్ని సరిచేయడం, మెరుగుపరచడం మెదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత 2024 నవంబర్‌లో పూర్తిస్థాయి ఆటోమెటిక్ మెషిన్ని తయారుచేశాడు. అప్పుడే ‘చఖ్ దే చోలే’ అనే స్టార్టప్ పుట్టింది. ఇది ఈ వెండింగ్ మెషిన్‌తో నడిపించే ఫుడ్ కార్ట్ వెంచర్.
మెషిన్ల మాన్యుఫాక్చరింగ్ మొదలైన వెంటనే 2024 డిసెంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు సాగర్. స్టార్టప్ పెట్టినా వెంటనే సక్సెస్ రాలేదు. వెండింగ్ మెషీన్ కూడా స్ట్రీట్ వెండర్ లాగే ఫ్రెష్, టేస్టీ చోలే కుల్చేని తయారుచేయగలదని అందర్నీ నమ్మించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే మొదట్లో మెషిన్‌తో తయారుచేస్తారనే విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. తిన్నవాళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాడు. అందరికీ ఫుడ్ నచ్చిందని తెలుసుకున్నాక నెల తర్వాత మెషిన్ తయారుచేస్తుందనే విషయం బయటపెట్టాడు.
నార్త్ నుంచి సౌత్‌కు..
పోయినేడు డిసెంబర్‌లో ఢిల్లీలో రెండు చఖ్ దే చోలే అవుట్‌లెట్లు పెట్టాడు. ఒకటి వికాస్‌పురిలో, మరొకటి రాజౌరి గార్డెన్‌లో ఉన్నాయి. ఆ రెండు చాలా తక్కువ టైంలోనే ఫేమస్ అయ్యాయి. దాంతో ఇప్పుడు జైపూర్, బెంగళూరు లాంటి సిటీల్లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడ కూడా సక్సెస్ అయితే.. సౌత్‌లో మరిన్ని సిటీల్లో పెట్టే ప్లాన్‌లో ఉన్నాడు. ‘‘నార్వే, కెనడా, దుబాయ్ లాంటి దేశాల నుంచి కూడా ఫ్రాంచైజీల కోసం ఫోన్లు చేస్తున్నారు. కానీ.. ప్రస్తుతానికి మా బ్రాండ్‌ని ఇండియాలో మాత్రమే విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నాం.” అంటున్నాడు సాగర్.
ఎవరైనా వాడొచ్చు!
చఖ్ దే చోలే వెండింగ్ మెషిన్ని పెద్దగా చదువుకోని వాళ్లు కూడా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. టేస్ట్ అచ్చం ఒక స్ట్రీట్ వెండర్ చేసినట్టే ఉంటుంది. కాబులీ శనగలు, మసాలాలు, ఉల్లిపాయలు అన్నింటినీ మెషినే మిక్స్ చేస్తుంది. పైగా ఇది పూర్తిగా ఆటోమేటెడ్. లెస్ స్పైసీ, మీడియం స్పైసీ, స్పైసీ అనే మూడు బటన్స్ ఉంటాయి. కస్టమర్ టేస్ట్‌కి తగ్గట్టు వాటిని సెలక్ట్ చేసుకోవాలి. 60 సెకన్లలో చోలే కుల్చే ప్లేట్‌ని రెడీ చేస్తుంది.
చఖ్ దే చోలేలో ఫ్రెష్ వెజిటబుల్స్, ఇంగ్రెడియెంట్స్నే వాడతారు. ప్రతి రోజూ ఉదయం కాబులీ శనగలను ఉడికిస్తారు. మెషిన్ని రోజూ శుభ్రం చేస్తారు. అందుకే టేస్ట్‌లో మార్పు ఉండదు. ప్రతిరోజూ ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం కుల్చాలను మాన్యువల్‌గా గ్రిల్ చేస్తున్నారు. కానీ.. సాగర్ ఇప్పుడున్న మెషిన్ని అప్డేట్ చేసి మరో వెర్షన్‌ని తయారుచేసే పనిలో ఉన్నాడు. అది పూర్తైతే కుల్చాలను ఆటోమెటిక్‌గా బేక్, గ్రిల్ చేసేస్తుంది. చోలే, కుల్చా రెండూ మెషిన్ నుంచే వస్తాయి.