
పొరుగు దేశం పాకిస్తాన్‌లో నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు భారీగా పెరిగాయి. పాలు, వంట నూనె, గోధుమలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. లీటర్ పాల ధర రూ.210 ఉంది. వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీ కనీవినీ ఎరగనంతగా పెరిగి జనానికి చుక్కలు చూపుతున్నాయి.
పాక్ ప్రజలపై షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. తాజాగా పెట్రోల్‌పై రూ.22.20, హై స్పీడ్ డీజిల్‌పై రూ.17.20, కిరోసిన్‌పై రూ.12.90 చొప్పున వడ్డించింది. లీటర్ పెట్రోల్‌పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు(పాక్ కరెన్సీలో) చేరింది. డీజిల్‌పైనా 17.20 రూపాయలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.280కి పెరిగింది. పెరిగిన ధరలు ఇవాళ తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చాయి. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజలపై మరింత భారాన్ని మోపింది ప్రభుత్వం.
కొండెక్కిన చికెన్ ధరలు
పాకిస్తాన్‌లో కిలో కోడి మాంసం ఏకంగా 780 రూపాయలుగా ఉంది. బోన్‌లెస్ అయితే రూ.1,100కు చేరుకుంది. కిలో కోడి ధర రూ. 490గా ఉంది. దేశ చరిత్రలోనే చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడతోంది. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.