పెట్రోల్ రేటు తగ్గించవచ్చు

పెట్రోల్ రేటు తగ్గించవచ్చు

న్యూఢిల్లీ: ప్రభుత్వం తలుచుకుంటే పెట్రోల్​ ధరలను తగ్గించవచ్చని తాజా స్టడీ ఒకటి   పేర్కొంది. పెట్రోలు రిటైల్ ధరల ప్రకారం 106 దేశాల గ్రూపులో భారతదేశం 42వ స్థానంలో ఉంది.  మనకన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాల్లో  ధరలు తక్కువగా ఉన్నాయి. వీటి కంటే మనదేశ ధరలు ఎక్కువ! ఉదాహరణకు వియత్నాం, కెన్యా, ఉక్రెయిన్​, బంగ్లాదేశ్, నేపాల్​, పాక్​, వెనెజులాలో పెట్రోల్​ ధరలు ఇండియాలో కంటే తక్కువ. దీనిని బట్టి చూస్తే మన దగ్గర కూడా పెట్రోల్​పై పన్నులను తగ్గించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా శుక్రవారం విడుదల చేసిన రీసెర్చ్​ రిపోర్టులో పేర్కొంది. ఈ విషయమై బ్యాంకు ఎకనమిస్ట్​ సోనాల్​ బంధన్​ మాట్లాడుతూ మనదేశంలో లీటరు పెట్రోల్ ధర 1.35 డాలర్ల వరకు ఉందని, దాదాపు 50 దేశాల్లో ఇంతకంటే తక్కువ ధరలు ఉన్నాయని వివరించారు. మొత్తం 106 దేశాల్లో మధ్యస్థ ధర రూ.1.22 డాలర్లని పేర్కొన్నారు. భారతదేశంలో ఇంధన ధరలు ఆస్ట్రేలియా, టర్కీ  దక్షిణ కొరియాతో సమానంగా ఉన్నాయి.  వియత్నాం, కెన్యా, ఉక్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్,  వెనిజులా దేశాలతో పోలిస్తే ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి.  జనం ప్రయోజనాలను కాపాడటానికి ఇంధనంపై పన్నులను తగ్గించే ప్రపోజల్​ను ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ రిపోర్టు వివరించింది.