- మొదటి జాబ్‌లోనే రూ.25 వేల వరకు బేసిక్ శాలరీ ఉన్నా, ఈపీఎస్‌కు అర్హులే
న్యూఢిల్లీ: ప్రభుత్వం పీఎఫ్ లెక్కించే గరిష్ట బేసిక్ శాలరీని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచడంతో లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు అందనున్నాయి. పాత రూల్ ప్రకారం, సెప్టెంబర్ 2014 తర్వాత మొదటి ఉద్యోగంలోనే బేసిక్ శాలరీ రూ.15 వేలు కంటే ఎక్కువ పొందినవారు ఈపీఎస్‌కు అర్హులు కారు. తాజా రూల్‌తో మొదటి జాబ్‌లోనే రూ.25 వేల వరకు బేసిక్ శాలరీ పొందుతున్న ఉద్యోగులు ఇకనుంచి ఈపీఎస్‌కు అర్హత పొందారు. ఇప్పటికే ఈ స్కీమ్‌లో చేరిన వారి బేసిక్ శాలరీ రూ.25 వేల లిమిట్‌ను దాటినా, వారి ఈపీఎస్ అకౌంట్‌లో కంపెనీలు కచ్చితంగా తమ వాటా కింద డబ్బులు జమ చేస్తాయి.
తాజాగా ఈ అమౌంట్ కూడా పెరిగింది. కంపెనీలు ఇచ్చే పెన్షన్ వాటా గరిష్ట పరిమితి గతంలో రూ.1,250 ఉండేది, ఇప్పుడు రూ.2,083 వరకు చేరింది. ఒకవేళ మొదటి ఉద్యోగంలోనే బేసిక్ రూ.25 వేల కంటే ఎక్కువ ఉంటే, ఆ ఉద్యోగికి ఈపీఎస్ ఇవ్వడం కంపెనీకి తప్పనిసరి కాదు. అప్పుడు సంస్థ వాటా మొత్తం కేవలం ఉద్యోగి ఈపీఎఫ్‌కే జమ అవుతుంది.
సెప్టెంబర్ నెల జీతం లెక్కలు ఇలా..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌ఓ) తెచ్చిన ఈ కొత్త రూల్ సెప్టెంబర్ నెల మధ్యలో అమల్లోకి వచ్చింది. ఈ ఒక్క నెల జీతాన్ని రెండు భాగాలుగా లెక్కిస్తారు. మొదటి 16 రోజులు (సెప్టెంబర్ 1–16) వరకు పాత పద్ధతి ప్రకారమే లెక్కిస్తారు. చివరి 14 రోజులను (సెప్టెంబర్ 17–30) కొత్తగా మారిన రూ.25 వేల పరిమితి ప్రకారం లెక్కిస్తారు.
బేసిక్ శాలరీ రూ.25 వేల కంటే ఎక్కువుంటే?
ఉద్యోగి ఇప్పటికే ఈపీఎస్‌లోకి చేరితే అతని బేసిక్ శాలరీ నెలకు రూ.30 వేలు, రూ.50 వేలు లేదా రూ. లక్ష ఉన్నా సరే.. గరిష్ట సీలింగ్ అయిన రూ.25 వేలపై కంపెనీ వాటా అయిన 2,083 రూపాయలు ఉద్యోగి ఈపీఎస్ అకౌంట్‌లో జమ అవుతాయి. రూ.25,000 దాటిన మిగిలిన మొత్తంపై కంపెనీ చెల్లించాల్సిన వాటా ఆటోమేటిక్‌గా పీఎఫ్ (ఈపీఎఫ్) ఖాతాకే మళ్లుతుంది. కాబట్టి బేసిక్ రూ.25 వేలు దాటినంత మాత్రాన కంపెనీ నుంచి ఈపీఎస్ జమ ఆగిపోదు. గరిష్ట పరిమితి అయిన రూ.2,083 తప్పనిసరిగా జమ అవుతుంది.
