
- మహబూబాబాద్ జిల్లాలో మాజీ సర్పంచులకు అపరిచిత వ్యక్తి ఫోన్
గూడూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో మాజీ సర్పంచులకు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తూ..‘ ఫోన్ పే ద్వారా రూ. 4 వేలు చెల్లిస్తే.. వెంటనే జీపీ పెండింగ్ బిల్లు క్లియర్ చేయిస్తా’ అని నమ్మిస్తున్నాడు. అయితే.. ఫోన్ చేసేది సైబర్ నేరగాళ్లా..? ప్రభుత్వ అధికారినా..? అని ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గూడూరు మండలంలో 39 జీపీలు ఉన్నాయి. సర్పంచులు తమ ఐదేండ్ల కాలంలో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశారు. రూ. లక్షల్లో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.
వారం రోజులుగా మండలంలోని పలువురు మాజీ సర్పంచులకు ఓ అపరిచి వ్యక్తి ఫోన్ కాల్స్ చేస్తూ..‘ మీ జీపీకి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పిస్తా.. మీ ఫోన్ పే వివరాలు చెప్పండి’ అని ఆరాతీశాడు. దీంతో అనుమానించిన కొందరు జీపీ బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని సూచించారు. రెండు రోజుల అనంతరం మళ్లీ ఫోన్ చేసి హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి మాట్లాడుతున్నానని, జీపీ పెండింగ్ బిల్లు వివరాలు కూడా చెప్పడంతో.. ఫోన్ చేస్తున్న వ్యక్తి సైబర్ నేరగాడా..? ప్రభుత్వ అధికారినా..? అనేది తేల్చుకోలేక అయోమయంలో పడ్డారు.
ఒకే నంబర్ నుంచి..
8247462257 నంబర్ నుంచి మాజీ సర్పంచులకు ఫోన్లు వెళ్లాయి. కాగా.. వచ్చిన నంబర్ ను ట్రూ కాలర్ లో చెక్ చేయగా ఎల్. వెంకట్ రెడ్డి అని పేరు చూపిస్తుంది. తనకు రావాల్సిన బిల్లు కూడా చెబుతుండడంతో నమ్మాల్సిన పరిస్థితి వస్తుందని, దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వాలని జగన్నాయకులగూడెం మాజీ సర్పంచ్ రాంమూర్తి తెలిపారు.