ఫోన్ ట్యాపింగ్ : రేవంత్ రెడ్డి ఇంటికి 2 కి.మీ దూరంలోనే ఆఫీస్ పెట్టిన్రు..

ఫోన్ ట్యాపింగ్ : రేవంత్ రెడ్డి ఇంటికి 2 కి.మీ దూరంలోనే ఆఫీస్ పెట్టిన్రు..

బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌‌ రెడ్డి, ఆయన సోదరుల ఇండ్ల పరిసర ప్రాంతాల్లో ప్రణీత్‌‌రావు ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. సుమారు 2 కి.మీ. పరిధిలోని ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్స్‌‌లో అత్యాధునిక టెక్నాలజీతో ట్యాంపింగ్ పరికరాలు అమర్చినట్లు స్పెషల్‌‌ టీమ్‌‌ గుర్తించినట్టు తెలిసింది. బై ఎలక్షన్స్‌‌లో ఇంటెలిజెన్స్‌‌ వాహనాల్లోనే డబ్బు సైతం తరలించినట్లు సమాచారం. 

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి శనివారం భుజంగరావుతోపాటు తిరుపతన్నను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దాదాపు 7 గంటలపాటు విచారించారు. ఆ తర్వాత రాత్రి అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. వీరిద్దరితోపాటు అప్పటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌‌ ప్రభాకరావు సహా మరో 8 మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. విచారణలో ప్రణీత్‌‌రావు వెల్లడించిన వివరాల ఆధారంగా ఇంటెలిజెన్స్‌‌ మాజీ చీఫ్‌‌ ప్రభాకర్‌‌‌‌రావు, అప్పటి డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు ఫోన్‌‌ ట్యాపింగ్‌‌, సాక్ష్యాల ధ్వంసంలో పాత్ర ఉన్నట్లు గుర్తించారు.

 శుక్రవారం ఈ ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రభాకర్‌‌‌‌రావు విదేశాల్లో ఉండడంతో భుజంగరావు, తిరుపతన్నకు నోటీసులు అందించారు. స్పెషల్‌‌ టీమ్‌‌ నోటీసులతో భుజంగరావు, తిరుపతన్న శనివారం ఉదయం బంజారాహిల్స్‌‌ పీఎస్‌‌లో విచారణకు హాజరయ్యారు. వెస్ట్‌‌జోన్‌‌ డీసీపీ విజయ్‌‌కుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్‌‌ ఆఫీసర్‌‌‌‌ వెంకటగిరి వీరిని ప్రశ్నించారు.