సీసీ కెమెరాలతో ఫొటోలు కమాండ్​ కంట్రోల్​నుంచి చలాన్లు

సీసీ కెమెరాలతో ఫొటోలు కమాండ్​ కంట్రోల్​నుంచి చలాన్లు
  • రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ రూల్స్​బ్రేక్​చేసినా దొరికిపోతారు
  • 24 గంటలూ పని చేయనున్న సీసీ కెమెరాలు 
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్
  • హైదరాబాద్ సహా అన్ని నగరాలు, పట్టణాల్లో అమలు

బండిపై హెల్మెట్ ​పెట్టుకోకుండా వెళ్తూనో..రాంగ్​రూట్​లో డ్రైవ్​ చేస్తున్నప్పుడో ట్రాఫిక్​పోలీసులు ఉన్నారా లేదా అని గమనిస్తూ పోతుంటారు చాలామంది. ఎందుకంటే ఎక్కడ ఫొటో తీసి చలానా​ పంపిస్తాడో అన్న భయం వారిలో ఉంటుంది. ఇదంతా నగరాల్లో ఎక్కువగా జరుగుతుంది. పట్టణాల విషయానికి వస్తే హెల్మెట్​, ఇతర రూల్స్ విషయంలో ట్రాఫిక్​ పోలీసులు పెద్దగా పట్టించుకోరని విచ్చలవిడిగా రూల్స్​ బ్రేక్ ​చేస్తూ ఉంటారు. ఇక వీరి ఆటలు సాగవు. ఇలాంటి వారికి చెక్​పెట్టేందుకు పోలీసు శాఖ కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. అదే  ‘డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్​ఫోర్స్​మెంట్ ​సిస్టం’. ఈ టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడైనా ట్రాఫిక్ ​నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమెటిక్​గా అక్కడున్న సీసీ కెమెరాలు ఫొటో తీసి కమాండ్​ కంట్రోల్ ​సెంటర్​కు పంపిస్తాయి. ఇక్కడి నుంచే చలాన్లు కూడా పంపిస్తారు.  

రామగుండం కమిషనరేట్​లో... 

సీసీ కెమెరాల ద్వారా ఈ–చలాన్​విధానాన్ని రామగుండం కమిషనరేట్​లో త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. దీనికోసం కమిషనరేట్ ఆఫీస్​లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 205, పెద్దపల్లిలో 64, గోదావరిఖనిలో 32 సీసీ కెమెరాలను అమర్చారు. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్​తో అనుసంధానించారు. సీసీ కెమెరాల పనితీరును పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్​రెడ్డి, అడ్మిన్ డీసీపీ అఖిల్ మహాజన్​తో కలిసి బుధవారం పరిశీలించారు. సీసీ కెమెరాలను ‘డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ ఎన్​ఫోర్స్​మెంట్​సిస్టమ్’తో కనెక్ట్ చేశామని, వచ్చే సోమవారం నుంచి ఈ పద్ధతి అమలు చేస్తామని సీపీ తెలిపారు. హెల్మెట్ ధరించకున్నా, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంప్ చేసినా, సెల్​ఫోన్ ​మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఆటోమెటిక్​గా సీసీ కెమెరాల ద్వారా ఈ చలాన్​ జనరేట్​ అవుతుందన్నారు.