గ్లోబల్​ ఎకానమీకి ఇండియా నుంచి... 30 ట్రిలియన్​ డాలర్లు: పీయుష్ ​గోయల్​​

గ్లోబల్​ ఎకానమీకి ఇండియా నుంచి...  30 ట్రిలియన్​ డాలర్లు: పీయుష్ ​గోయల్​​
  • రాబోయే 25 ఏండ్లలో వస్తాయి
  • 2047 నాటికి మనది ధనికదేశం

న్యూఢిల్లీ: రాబోయే 25 ఏళ్లలో ఇండియా ఎకానమీ 3.5 ట్రిలియన్​ డాలర్ల నుంచి 35 ట్రిలియన్​ డాలర్లకు చేరుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయుష్​ గోయల్​అన్నారు. దీనివల్ల గ్లోబల్​ ఎకానమీకి ఇండియా నుంచి 30 ట్రిలియన్​ డాలర్లు యాడ్‌ అవుతాయని చెప్పారు. 2047 నాటికి మనది ధనికదేశంగా మారుతుందని, 140 కోట్ల జనాభాకు అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. ఢిల్లీలో ‘డీకోడింగ్​ జీ20 కాన్​క్లేవ్​’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్​ సక్సెస్​తో ఇండియా సత్తా ఏంటో ప్రపంచమంతా చూసిందని అన్నారు. ఇండియా నాయకత్వ లక్షణాలకు ప్రపంచ నాయకులంతా ఆకర్షితులు అవుతున్నారని కామెంట్​ చేశారు. బీ20 గ్రూపులోని 55 దేశాల జీడీపీ గ్లోబల్ ​జీడీపీలో 85 శాతానికి సమానమని అన్నారు. ల్యాప్​టాప్​ల దిగుమతులపై ఆంక్షలు విధించడంపై మాట్లాడుతూ ‘‘భద్రతా సమస్యలు, వ్యాపారంలో సమానత్వం ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇండియా రక్షణవాద (ప్రొటెక్షనిస్ట్​) విధానాలు ఉన్న దేశం కాదు. వాణిజ్య నిబంధనల్లో పారదర్శకత ఉండాలని మేం కోరుకుంటున్నాం”అని మంత్రి అన్నారు. 

ల్యాప్​టాప్​లతో పాటు ట్యాబ్లెట్లు, మరికొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ఈ నెల మూడున కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భద్రతా సమస్యలతోపాటు స్థానికంగా తయారీని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఇక నుంచి దిగుమతి చేసుకోవాలని కోరుకునే కంపెనీలు ప్రత్యేకంగా లైసెన్సులు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే హడావుడిగా దిగుమతులపై ఆంక్షలు విధించారంటూ కంపెనీలు విమర్శించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆంక్షలు ఈ ఏడాది నవంబరు నుంచి అమల్లోకి వస్తాయని వివరణ ఇచ్చింది. 

2030 నాటికి పనిచేసే   జనాభా ఇండియాలోనే ఎక్కువ

2030 నాటికి అతిపెద్ద శ్రామిక -వయస్సు జనాభా కలిగిన ఐదు ఆర్థిక వ్యవస్థలలో (జీ20 దేశాలలో) భారతదేశం, చైనా,  ఇండోనేషియా   టాప్​–3లో ఉంటాయని వెల్లడయింది. మెకిన్సే  ‘డ్రైవింగ్ సస్టైనబుల్  అండ్​ ఇన్​క్లూజివ్​ గ్రోత్​ ఇన్​ జీ20 ఎకానమీస్​’ పేరుతో విడుదల చేసిన రిపోర్టు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ రిపోర్టు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  

ప్రపంచమంతా పరస్పర ఆధారితంగా ఉంది.  డిజిటల్,  డేటా వల్ల కమ్యూనికేషన్,  విజ్ఞానం ఇచ్చిపుచ్చుకోవడం ఎక్కువయింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దేశాల అప్పులు ఇప్పుడు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. జీ20 దేశాల అప్పు ‘డెట్​ టూ జీడీపీ’ జీడీపీలో  300శాతం కంటే ఎక్కువగా ఉంది.  చైనా,  భారతదేశం జీ20కి ప్రధాన గ్రోత్​ ఇంజిన్‌‌‌‌లుగా కొనసాగుతున్నాయి. ఇతర దేశాలు కూడా ఇన్​క్లూజన్​, సస్టెయినబిలిటీ విషయంలో మెరుగైన స్కోర్‌‌‌‌ను సాధించాయి.