టీఆర్​ఎస్​ పెద్దలతో పీకే టీం భేటీ?

టీఆర్​ఎస్​ పెద్దలతో పీకే టీం భేటీ?
  • కేసీఆర్​, ప్రశాంత్​ కిశోర్​ చర్చలు
  • ఢిల్లీ, హైదరాబాద్​లో టీఆర్​ఎస్​ పెద్దలతో పీకే టీం భేటీ?
  • హుజూరాబాద్​ ఓటమిపైనా డిస్కషన్​
  • పబ్లిక్​ మూడ్​పై సర్వే చేయాలని కోరిన టీఆర్​ఎస్

హైదరాబాద్​, వెలుగు: జాతీయ రాజకీయాల్లో థర్డ్​ ఫ్రంట్​ ఏర్పాటు కోసం  ప్రయత్నాలు జరుగుతుండగా.. టీఆర్​ఎస్​ కూడా అటువైపే అడుగులేస్తున్నది. వచ్చే లోక్​సభ ఎన్నికల నాటికి రీజినల్​ పార్టీలను ఒక్కటి చేసేందుకు ఎలక్షన్​ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్​ కిషోర్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు తెలంగాణలోనూ హాట్​ టాపిక్​ అయ్యాయి. ఇన్నాళ్లూ ఉత్తరాది రాష్ట్రాల నేతలను కలిసిన పీకే.. ఇప్పుడు టీఆర్​ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్​తోనూ సంప్రదింపులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇటీవల పీకే టీం టీఆర్​ఎస్​ పెద్దలతో భేటీ అయినట్లు తెలుస్తున్నది. ఢిల్లీతో పాటు హైదరాబాద్​లోని క్యాంప్​ ఆఫీసులో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, హుజూరాబాద్​ బై ఎలక్షన్​లో టీఆర్​ఎస్​ ఓటమిపై చర్చించినట్లు తెలిసింది. ఇంటింటికీ లబ్ధి చేకూర్చే స్కీమ్​లు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు పెరిగిందనే కారణాలను తెలుసుకోవాలని టీఆర్​ఎస్​ భావిస్తున్నది. రాష్ట్రమంతటా పబ్లిక్​ మూడ్​ను రాబట్టేందుకు సర్వే  చేయించాలని, ఈ సర్వే టాస్క్​ను అప్పగించటంతో పాటు తగిన సలహాలు, సూచనలు తీసుకునేందుకే పీకే టీం  మెంబర్లతో టీఆర్​ఎస్​ పెద్దలు చర్చలు జరిపినట్లు కూడా ప్రచారంలో ఉంది. ఇదే టైంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కొత్త చర్చకు తెర లేపాయి. 

దేశ రాజకీయాలపై కేసీఆర్ నజర్
వడ్ల కొనుగోళ్ల పంచాయతీపై దాదాపు నెల రోజులుగా సీఎం కేసీఆర్ కేంద్రంపై మండి పడుతున్నారు. బియ్యం సేకరణకు వార్షిక​ పాలసీని ప్రకటించాలని, కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలని డిమాండ్​ చేస్తున్నారు. కేసీఆర్​ సూచనలతో టీఆర్​ఎస్​ ఎంపీలు వరుసగా పార్లమెంట్​ సమావేశాలను అడ్డుకుంటున్నారు. ఇదే సరైన సందర్భమని భావించిన ప్రశాంత్​ కిశోర్‌​ టీఆర్​ఎస్​ బాస్  టచ్​లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో జాతీయ రాజకీయాలపై వీళ్ల మధ్య సంప్రదింపులు మొదలయ్యాయన్న  అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలతో ఫెడరేషన్​ ఫ్రంట్​ ఏర్పాటు చేస్తామని మూడేండ్ల కిందట చెప్పారు. ఇందులో భాగంగానే కేసీఆర్​ సరైన టైం కోసం వెయిట్​ చేస్తున్న తెలుస్తోంది.

పీకే  టాస్క్​లో ఇదొక భాగం
ఎన్​డీఏ, యూపీఏకు ప్రత్యామ్నాయ ఫోర్స్​ ఏర్పాటు కోసం కొన్నాళ్లుగా ప్రశాంత్​ కిషోర్​ రీజినల్​ పార్టీల లీడర్లను కలుస్తున్నారు. బెంగాల్​ సీఎం మమతా బెనర్జీకి, మహారాష్ట్రలోని శరద్​పవార్​కు, ఏపీ సీఎం జగన్​కు స్ట్రాటజిస్ట్ గా వ్యవహరి స్తున్నారు. మమత, శరద్​ పవార్​, కేజ్రీవాల్​తో పాటు కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వస్తేనే ఎన్​డీఏను ఢీ కొట్టడం సాధ్యమవు తుందనేది పీకే ఆలోచనగా కనిపిస్తు న్నది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే పీకే టీం దక్షిణాది రాష్ట్రాల ముఖ్య నేతలతో చర్చల కోసం రంగంలోకి దిగినట్లు ప్రచారంలో ఉంది. ఇదే టైంలో కాంగ్రెస్​ పని అయిపోయిందని, ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలని ప్రశాంత్​ కిషోర్​ చేసిన ట్వీట్​ హాట్​ టాపిక్​గా మారింది. అయితే, అటు పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్​తో కలిసి నిరసనలు చేస్తున్న టీఆర్​ఎస్​.. ఇటు ప్రత్యామ్నాయ ప్రాంతీయ కూటమి ఏర్పాటు దిశగా చర్చలు జరుపుతుందా..? అనేది ఆసక్తి రేపుతున్నది.