అకాల వర్షాలకు నష్టపోకుండా వ్యవసాయ శాఖ ప్లాన్​

అకాల వర్షాలకు నష్టపోకుండా వ్యవసాయ శాఖ ప్లాన్​
  • మార్చి నాటికి యాసంగి, అక్టోబర్ నాటికి వానాకాలం పూర్తి 
  • ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయం

హైదరాబాద్‌‌, వెలుగు: అకాల వర్షాల కారణంగా ఏటా వందల ఎకరాల్లో వరి పంటలను రైతులు నష్టపోతున్నారు. తీరా కోతకొచ్చే టైమ్​లో వడగండ్లు, వర్షాలు పడుతుండడంతో పంటలను కాపాడుకోలేకపోతున్నారు. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. యాసంగి, వానాకాలం సీజన్లను నెల రోజులు ముందుకు జరిపితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చని రైతులకు సూచిస్తోంది. యాసంగి సీజన్​ను మార్చినాటికి, వానాకాలం సీజన్​ను అక్టోబర్ నాటికి పూర్తిచేయించాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. నెల రోజుల ముందే వరి నార్లు పోసుకుని, వెంటనే నాట్లు ప్రారంభిస్తే నెల రోజులు కలిసి వస్తాయని సూచిస్తోంది.  

నీటి లభ్యత పెరిగింది..

రాష్ట్రంలో గతంతో కంటే నీటి వనరులు, భూగర్భ జలాలు పెరిగాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది. దీంతో వర్షాలకు ఎదురు చూడకుండానే ఏటా మే నెలాఖరు, జూన్‌‌‌‌‌‌‌‌ మొదటి వారంలోనే వానాకాలం సాగు ప్రారంభించుకునేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. ఫలితంగా సెప్టెంబరు నెలాఖరు, అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నెల ప్రారంభానికే పంట చేతికి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. దీంతో అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నెలలో వచ్చే అకాల వర్షాల నుంచి బయట పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఆ పంట కోత పూర్తికాగానే అక్టోబర్‌‌‌‌‌‌‌‌ మొదటి వారంలోనే యాసంగి వరి సాగు ప్రారంభిస్తే ఫిబ్రవరి నెలాఖరు, మార్చి ప్రారంభం నాటికే పంట చేతికి వచ్చే అవకాశముందంటున్నారు. దీంతో మార్చి మూడో వారం నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలలో పడే అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగదని చెబుతున్నారు.  

నారు మడి ముందే వదులు కోవాలి

యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో సాగు ఆలస్యం కాకుండా ఉండేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. యాసంగి వరి నారు పెంచడం కోసం వానాకాలంలోనే ఒక మడిని  వదిలేయాలని రైతులకు సూచించాలని నిర్ణయించారు. ఇది సాధ్యం కాని పక్షంలో నేరుగా వడ్లను వెదజల్లే పద్ధతిలో సాగు చేయించేలా క్షేత్రస్థాయి అధికారులు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ ఆదేశాలు ఇస్తోంది.