
- అంతర్గత విచారణ రిపోర్టుపై సవాల్ పిటిషన్ కొట్టివేత
- పార్లమెంట్‌లో అభిశంసనకు మార్గం సుగమం
న్యూఢిల్లీ: ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడిన కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నిర్వహించిన అంతర్గత విచారణ నివేదికను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ తీర్పుతో జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్‌లో అభిశంసనకు మార్గం సుగమమైంది. ఈ వ్యవహారంలో ముగ్గురు జడ్జిల కమిటీ రిపోర్ట్ ఆధారంగా జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని నాటి సీజీఐ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతికి, ప్రధానికి సిఫారసు చేశారు. జస్టిస్ వర్మ ఆ రిపోర్టును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. గురువారం వర్మ పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్ తో కూడిన బెంచ్ విచారించింది.
ఈ పిటిషన్ విచారణకు అనర్హమని తెలిపింది. కమిటీ తన విచారణలో వీడియోలు, ఫొటోలు అప్‌లోడ్ చేయడంలో చిన్న తప్పిదం చేసినప్పటికీ.. మిగిలిన అంశాల్లో చట్టబద్ధ విధానం పాటించినట్లు కోర్టు పేర్కొంది. జస్టిస్ వర్మ ఈ అప్‌లోడ్ విషయంపై అభ్యంతరం చెప్పలేదని, అందుకే దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే, జస్టిస్ వర్మపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది మాథ్యూ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరగగా.. ఈ ఘటనలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిలతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది.