
కోమటి కుంట చెరువులో ఫామ్ ల్యాండ్స్!
కబ్జా చేసి మట్టితో నింపిన రియల్ వ్యాపారులు
ఇప్పటికే దాదాపు సగం వరకు చదును చేసిన్రు
ఎకరం భూమి విలువ రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్లు
చోద్యం చూస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు
సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు : చెరువులో పూడిక తీసి మట్టిని పొలాలకు తరలించడం తెలుసు. కానీ, చెరువులోనే మట్టిని పోయడం చూశారా..? అట్లుంటది మన రియల్ ఎస్టేట్ వ్యాపారులతోని! డిమాండ్ ఉన్న ఏరియాల్లో చెరువులు, శిఖం భూములు ఆక్రమించి ప్లాట్లు, ఫామ్ లాండ్స్ చేస్తున్నారు. ముంబాయి హైవేకు దగ్గరగా ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారంలో సర్వే నెంబర్ 134లో ఉన్న కోమటి కుంట చెరువును రాత్రికి రాత్రే కబ్జా చేశారు. టిప్పర్లతో మట్టి పోయించి జేసీబీలు, డోజర్లతో చదును చేయిస్తున్నారు. ఇప్పటికే సగం చెరువును సాఫ్ చేసి ఫామ్ ల్యాండ్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు.
13 ఎకరాల్లో మట్టి నింపిన్రు
నేషనల్ హైవే 65కి దగ్గరగా ఉండే కోమటి చెరువు 30.629 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఏరియాలో ఎకరా భూమి బహిరంగ మార్కెట్‌లో రూ.7 నుంచి రూ.10 కోట్లు పలుకుతోంది. దీంతో ఈ చెరువుపై కన్నేసిన అక్రమార్కులు గట్టుచప్పుడు కాకుండా కబ్జా చేసేశారు. ఇప్పటికే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో 13 ఎకరాల వరకు మట్టిని నింపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి వేళల్లో డోజర్లతో లెవలింగ్ చేయిస్తున్నారు.
3 వేల ఎకరాల ఆయకట్టు
రుద్రారం కోమటి కుంట చెరువు కింద లక్డారం, బ్యాతోల్, ఆరుట్ల గ్రామాల్లో 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎగువన ఉన్న ఇస్నాపూర్, రుద్రారం చెరువులు నిండి ఈ చెరువులోకి నీరు వస్తుందని, ప్రస్తుతం 3.779 ఎకరాల్లో నీరు నిల్వ ఉన్నట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కానీ, కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని, ఆయకట్టు నీరందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. గతంలో కొందరు చెరువును ఆక్రమించుకోవాలని చూడగా.. రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఎ అధికారులు అడ్డుకొని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లును నోటిఫై చేశారని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని మండిపడుతున్నారు. కబ్జాను అడ్డుకోకుంటే కోమటి చెరువు పైభాగంలో ఉన్న ఇస్నాపూర్, రుద్రారం చెరువులు నిండి వరద నీరంతా ఇళ్లల్లోకి చేరే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
చెరువును కాపాడండి
ప్రభుత్వం రుద్రారం కోమటి చెరువును కాపాడాలి. రెవెన్యూ రికార్డులు, ఫీల్ట్‌లో చూస్తే కబ్జాకు గురైన విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకుంటలేరు. కలెక్టర్ స్పందించి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలి.
- గడీల శ్రీకాంత్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చర్యలు తీసుకుంటం
కోమటి చెరువు కబ్జా విషయలో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. చెరువులు, కుంటలను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టినా కూల్చేస్తాం. విచారణ చేపట్టి కబ్జాదారులపై చర్యలు తీసుకుంటం.
- పరమేశ్వర్, పటాన్ చెరు తహసీల్దార్