బిహార్ లో అన్ని సీట్లూ గెలుస్తం: మోదీ

బిహార్ లో అన్ని సీట్లూ గెలుస్తం: మోదీ
  •     అవినీతిపరులంతా ఒకే గొడుగు కిందకు వెళ్లారు
  •     ఇండియా కూటమి నేతలవి చీటింగ్ పాలిటిక్స్ 
  •     సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోదీ ఫైర్

పాట్నా:  బీహార్‌లో ఉన్న మొత్తం 40 ఎంపీ సీట్లలోనూ ఎన్డీఏ గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గురువారం బీహార్​లోని జముయిలో ఎన్నికల ప్రచారాన్ని మోదీ ప్రారంభించారు. ఈ మధ్యే ఎన్డీఏలో చేరిన లోక్​ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తరఫున ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 40 ఎంపీ సెగ్మెంట్లను, దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని చెప్పారు. పాశ్వాన్ ను తమ్ముడు అని సంబోధించిన మోదీ.. ఆయన ఎన్డీఏ కూటమిలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి కళంకం తెచ్చిందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకున్న ఆమ్​ఆద్మీ పార్టీపైనా మోదీ విమర్శలు చేశారు. అవినీతికి పాల్పడ్డారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నోళ్లంతా ఇప్పుడు ఒకే గొడుగు కిందకు చేరారని కామెంట్ చేశారు. కాంగ్రెస్ హయాంలో టెర్రరిస్టుల దాడులు ఉండేవని, జాగాలిచ్చినోళ్లకే ఉద్యోగాలంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బేరం పెట్టారని అన్నారు. ఇన్ని అవినీతి ఆరోపణలున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల నేతలు రామమందిరంపై నిందలేస్తున్నారని, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఎన్నికను కూడా వారు వ్యతిరేకించారని మోదీ మండిపడ్డారు. 

అవినీతిపరులను కాపాడటమే వాళ్ల పని.. 

సిటిజన్​షిప్ అమెండ్​మెంట్ యాక్ట్(సీఏఏ) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇండియా కూటమి నేతలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. మోసపూరిత రాజకీయాలు చేయడంలో వారంతా బిజీగా ఉన్నారని కామెంట్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సిటిజన్​షిప్ అందించడం మోదీ గ్యారంటీ అని చెప్పారు. గురువారం బెంగాల్​లోని కూచ్​ బెహార్​లో జరిగి ర్యాలీలోనూ ఆయన మాట్లాడారు. సందేశ్​ఖాళీలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలను ప్రస్తావిస్తూ.. దోషులు జీవితకాలం జైల్లోనే గడుపుతారని హెచ్చరించారు. రాష్ట్ర సర్కారు దోషులను కాపాడాలని చూస్తోందని ఆరోపించారు. అవినీతిపరులను కాపాడేందుకు అపొజిషన్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. 

తప్పు చేసినోళ్లకు శిక్షలు తప్పవని, వచ్చే ఐదేండ్లలో అక్రమార్కుల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. ‘‘అవినీతి లేకుండా చేయాలని నేను చెప్తున్నా. అవినీతిపరులను కాపాడండి అని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ, అక్రమాలకు పాల్పడినోళ్లకు శిక్ష పడేలా చేయడం, పేద ప్రజలకు న్యాయం చేయడం నా బాధ్యత” అని మోదీ అన్నారు. గడిచిన పదేండ్లలో చూసింది ట్రైలర్ మాత్రమేనని, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాము చేయాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు.