భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు : మోదీ

భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు : మోదీ

జమలీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. దీంతో పాటుగా దేశం మొత్తం యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తామని  చెప్పారు.   2024 ఏప్రిల్ 14న బీజేపీ పార్టీ కార్యాలయంలో  లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు మోదీ. అనంతరం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని మోదీ అన్నారు. 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యువత కలలను సాకారం చేసేలా మేనిఫెస్టో ఉంటుందన్నారు. 

బీజేపీ ఈ మేనిఫెస్టోలో 2036లో ఒలింపిక్స్ నిర్వహణ, జాతీయ విద్యా విధానం అమలు, పేపర్ లీకేజీకి సంబంధించి కఠిన చట్టాల ప్రస్తావన కూడా ఉంది. తమిళ భాష దేశానికే గర్వకారణమని, దానిని ప్రోత్సహిస్తానని ప్రధాని మోదీ అన్నారు. ట్రాన్స్‌జెండర్‌లను కూడా ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. 

వచ్చే ఐదేళ్లలో అన్ని రంగాల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేలా శిక్షణ ఇస్తామన్నారు. 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడిని ఆయుష్మాన్ యోజన పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు.  అంతేకాకుండా దక్షిణ భారతదేశానికి కూడా బుల్లెట్ రైలును తీసుకువస్తామని మోడీ ప్రకటించారు. 21వ శతాబ్దానికి సంబంధించి భారత్‌ను బీజేపీ బలోపేతం చేస్తుందని అన్నారు.