జీ 20 సమిట్​కు అంతా రెడీ..సెక్యూరిటీ ఫుల్ టైట్

జీ 20 సమిట్​కు అంతా రెడీ..సెక్యూరిటీ ఫుల్ టైట్
  • ఇయ్యాల, రేపు ఢిల్లీలో సమావేశాలు 
  • తరలివచ్చిన వివిధ దేశాల అధినేతలు
  • బైడెన్, సునాక్, అల్బనీస్, కిషిడ తదితరులకు గ్రాండ్ వెల్​కమ్ 
  • భద్రత కట్టుదిట్టం.. భారత్ మండపంలో ప్రత్యేక స్టాల్స్, క్రాఫ్ట్ బజార్   
  • జీ20 సమిట్.. అభివృద్ధికి కొత్త తొవ్వ చూపుతది: మోదీ
  • రెండ్రోజులు ప్రధాని బిజీ బిజీ.. 15కు పైగా మీటింగ్స్

న్యూఢిల్లీ:  జీ20 సమిట్​ కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో రెండ్రోజుల జీ20 సమిట్ వార్షిక సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ప్రపంచ దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. దేశ రాజధాని అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సమిట్ కు వేదికైన భారత్ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సమిట్ లో పాల్గొనేందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడ, ఇటలీ పీఎం జార్జియా మెలోనీ, ఇతర దేశాల అధినేతలు..

ఐఎంఎఫ్, ఓసీఈడీ, వరల్డ్ బ్యాంక్, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల అధిపతులు శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్నారు. విదేశీ గెస్ట్ లకు ఎయిర్ పోర్టు వద్ద సంప్రదాయ నృత్యం, ఆటపాటలతో ఘనంగా స్వాగతం పలికారు. జీ20 దేశాల అధినేతలు, ప్రతినిధులను కేంద్ర మంత్రులు రిసీవ్ చేసుకున్నారు. జీ20 సమిట్ సందర్భంగా ఢిల్లీ అంతటా పండుగ వాతావరణం నెలకొంది. భారత్ మండపానికి దారితీసే రోడ్లన్నింటికీ ఇరువైపులా మొక్కలు, పూలతో అలంకరించారు.రోడ్ల వెంబడి చెట్లను బంతిపూలు, రకరకాల పూలమాలలతో అందంగా అలంకరించారు. పాలెం ఏరియా, సర్దార్ పటేల్ మార్గ్, రాజ్ ఘాట్ ఇతర కూడళ్లను అందంగా ముస్తాబు చేశారు.    

పర్మిషన్ ఉంటేనే ఎంట్రీ 

సమిట్ సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం ఉదయం నుంచే కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. సమిట్ జరిగే ప్రగతి మైదాన్, ప్రతినిధులు బస చేసే హోటళ్ల రూట్​లలో ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. ఆ ప్రాంతాల్లోకి వచ్చే ప్రతీ వెహికల్​ను చెక్ చేస్తున్నారు. ఐడీ కార్డులుంటేనే అనుమతిస్తున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఆదివారం రాత్రి 12 గంటలదాకా స్ట్రిక్ట్​గా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. హై సెక్యూరిటీలో ఉన్న ప్రాంతాలను జోన్​1గా, ప్రయాణాలకు పరిమితులతో అనుమతిస్తున్న ప్రాంతాలను జోన్​2గా డివైడ్ చేశారు. దీంతో రద్దీగా ఉండే పటేల్ చౌక్, హనుమాన్ మందిర్ వంటి ప్రాంతాల్లోనూ జనాలు కనిపించలేదు. లోకల్స్​ను కూడా సరైన కారణం ఉంటేనే ఆ వైపు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఇండియా గేట్, కర్తవ్య్ ఫథ్ వంటి ప్రాంతాలు చూసేందుకు అనుమతి లేదని, వాకింగ్, సైక్లింగ్​కు ఎవరూ బయటికి రావొద్దని పోలీసులు కోరారు. అంబులెన్స్​లు, లోకల్స్​కు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న టూరిస్టులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రయాణించేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. గూడ్స్ వెహికల్స్, బస్సులు, ఆటోలు, టాక్సీలకు లిమిట్స్ పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలను జోన్​2 కే పరిమితం చేశారు.

విల్కోమెన్.. బీన్ వెన్యూ!

సమిట్ సందర్భంగా భారత్ మండపానికి విచ్చేసే విదేశీ గెస్ట్ లకు వారి వారి దేశాల సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్రెంచ్ లో బీన్ వెన్యూ, టర్కిష్ లో హోస్గెల్డినిజ్ అంటూ విష్ చేయనున్నారు. భారత్ మండపం కాంప్లెక్స్ లో ఈ మేరకు అన్ని దేశాల భాషల్లో ప్రతినిధులకు స్వాగతం చెప్తూ సందేశాలు డిస్ ప్లే చేయనున్నారు. జర్మన్ లో విల్కోమెన్, ఇండోనేసియన్ లో సెలామత్ దటాంగ్, స్పానిష్ లో బీన్ వెనిడో అంటూ కలర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ తో ఆహ్వానం పలకనున్నారు. భారత్ మండపంలో విదేశీ ప్రతినిధుల కోసం ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ పెవిలియన్, డిజిటల్ ఇండియా ఎక్స్ పీరియెన్స్ జోన్ ను కూడా ఏర్పాటు చేశారు.

అతిథులకు సంప్రదాయ స్వాగతం  

జీ20 సమిట్​లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల అధినేతలు శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్నారు. వీరికి కేంద్ర మంత్రులు గ్రాండ్ వెల్​కమ్ చెప్పారు. కళాకారుల సంప్రదాయబద్ధమైన డ్యాన్స్, డప్పు వాయిద్యాలతో ఆయా దేశాల అధ్యక్షులు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రతినిధి బృందాలకు స్వాగతం పలికారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే రిసీవ్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాకు దర్శనా జర్దోష్ వెల్​కమ్ చెప్పారు. హసీనా వెంట ఆమె కూతురు సైమా వాజెద్ కూడా ఉన్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండేజ్​కు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వాగతం పలికారు. ఆఫ్రికన్ యూనియన్ చైర్​పర్సన్, కామోర్స్ అధ్యక్షుడు అజాలి అసోమాని ఢిల్లీ చేరుకున్నారు. రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్, ఒమన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సయ్యద్ ఫవ్హాద్ బిన్ మహమూద్ అల్​కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే ఘనంగా స్వాగతం పలికారు. 

సెక్యూరిటీ ఫుల్ టైట్

జీ20 సమావేశాలు ప్రారంభమవుతుండటంతో ఢిల్లీ అంతటా సెక్యూరిటీ ఫుల్ టైట్ చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ ఇతర ఏజెన్సీలకు చెందిన 50 వేల మంది సెక్యూరిటీ సిబ్బంది రాజధాని అంతటా మోహరించారు. ఎయిర్​పోర్టు నుంచి మొదలు, ప్రతినిధులు ఉండే హోటళ్ల దాకా పోలీసులు, ఎయిర్​ఫోర్స్, ఎన్ఎస్​జీ బృందాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. ఢిల్లీకి ఎంటర్ అయ్యే అన్ని రూట్​లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నిఘా కోసం డ్రోన్ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో పికెట్ చెకింగ్, ఫ్లాగ్ మార్చ్, పెట్రోలింగ్​ను పెంచారు. కె9 డాగ్ స్క్వాడ్​ బృందాలను మోహరించారు. గెస్ట్​లందరికీ ఫూల్ ప్రూఫ్ భద్రత కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న 19 మందితో కూడిన ఐటీబీపీ విమెన్ వింగ్ సమిట్ జరిగే ప్రదేశంలో సెక్యూరిటీ కల్పిస్తోంది. సదస్సు సందర్భంగా ఎలాంటి చొరబాట్లు, టెర్రరిస్ట్ యాక్టివిటీలు, గొడవలు జరగకుండా సెక్యూరిటీ ఫోర్సెస్ ను ఏర్పాటు చేశారు. 

ఈ సమిట్.. నాకు స్పెషల్..

ఈ సమిట్ ​నాకు కచ్చితంగా ప్రత్యేకమే. నన్ను ‘ఇండియాకు అల్లుడు’ అని అంటున్నట్లు తెలిసింది. నాపై ఆప్యాయతతోనే అట్ల పిలుస్తున్నారని అనుకుంటున్నా. భారతదేశం నా మనసుకు చాలా దగ్గరైన దేశం. 

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్