
దేశ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే ఈద్గాలు, మసీదులలో పవిత్ర ప్రార్థనలు చేస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదులో పెద్ద ఎత్తున ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
బక్రీద్ పండగను పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సేవ, మానవత్వం, సోదరభావం, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు రాష్ట్రపతి. ఈ బక్రీద్ మన సమాజంలో శాంతి, సంతోషాన్ని మరింత పెంచుతుందని ప్రధాని మోడీ అన్నారు.
ఢిల్లీలోని కశ్మీర్ గేట్ పంజా షరీఫ్ దర్గాలో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశ ప్రజలందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ ప్రజలకు ఈ బక్రీద్ చాలా ప్రత్యేకమైందన్నారు నఖ్వీ. 370 రద్దుతో జమ్ముకశ్మీర్ కు స్వాతంత్రం వచ్చిందన్నారు. ఉగ్రవాదం, అవినీతి, వేర్పాటువాదం నుంచి కశ్మిరీలకు విముక్తి లభించిందన్నారు.బక్రీద్ పండగ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.