
భవిష్యత్ లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ స్టేట్ గా మారుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లక్నోలో డిఫెన్స్ ఎక్స్ పోను మోడీ ప్రారంభించారు. కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను దృష్టిలో పెట్టుకుని భద్రతా బలగాలు టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాయని మోడీ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 25 రకాల ఉత్పత్తులను అభివృద్ధి చేయాలనేది తమ లక్ష్యమన్నారు మోడీ. ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్లల రక్షణ ఎగుమతులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు డిఫెన్స్ కారిడార్లుగా మారుతాయని మోడీ చెప్పారు.
భారత్ ను రక్షణ రంగ ఉత్పత్తులకు కేంద్రంగా మారాలని కోరుకుంటున్నామన్నారు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రక్షణ రంగంలో అమెరికా-భారత్ మధ్య సహకారంలో వేగం పెరిగిందన్నారు అమెరికా అంబాసిడర్ కెన్నెత్ జస్టర్. రక్షణ సంబంధాల్లో అభివృద్ధి మొదలైందన్నారు.
డిఫెన్స్ ఎక్స్ పోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తో పాటు ఇతర దేశాల రక్షణ మంత్రులు, డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎక్స్ పోను ప్రారంభించిన తర్వాత ఎగ్జిబిషన్ ను సందర్శించారు మోడీ. రోబో తో హ్యాండ్ షేక్ చేశారు. వర్చువల్ షూటింగ్ రేంజ్ ను పరిశీలించారు. తర్వాత సైన్యం విన్యాసాలను తిలకించారు.
ఎక్స్ పో ప్రారంభానికి ముందు… UAE రక్షణ శాఖ సహాయమంత్రి మొహమ్మద్ అల్ బొవార్డీ, యునైటెడ్ కింగ్ డమ్ రక్షణ మంత్రి జేమ్స్ హెప్పీ, మాల్దీవ్స్ రక్షణ మంత్రి మరియా అహ్మద్, ఒమన్ రక్షణ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు రాజ్ నాథ్ సింగ్.