
దశాబ్దాలుగా నీటికి సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అటల్ భూజల్ యోజనను మోడీ ప్రారంభించారు. 6వేల కోట్ల రూపాయలతో 7 రాష్ట్రాల్లోని 8వేల 350 గ్రామాల్లో భూజల్ యోజనను అమలు చేయనున్నారు. తాను నీటి కొరత ఉన్న రాష్ట్రం నుంచే వచ్చానన్న మోడీ… నీటిపైనే వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య నీటి గురించి విభేధాలున్నాయని చెప్పారు. నీటి కొరతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని 8,350 గ్రామాల్లో ఈ పథకం 5 సంవత్సరాల వ్యవధిలో అమలు చేయబడుతుంది. భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు 50:50 నిష్పత్తిలో దీనికి నిధులు సమకూరుస్తాయి. ఈ పథకం కింద వాటర్ యూజర్ అసోసియేషన్ల ఏర్పాటు, భూగర్భజల డేటాను పర్యవేక్షించడం, వ్యాప్తి చేయడం, నీటి బడ్జెట్, గ్రామ పంచాయతీల వారీగా నీటి భద్రతా ప్రణాళికలు, విద్య, కమ్యూనికేషన్ (ఐఇసి) కార్యకలాపాలు ఉంటాయి.