ముస్లిం దేశంలో మొదటి హిందూ దేవాలయం

ముస్లిం దేశంలో మొదటి హిందూ దేవాలయం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌-(యూఏఈ)  (UAE)లో అతిపెద్ద హిందూ దేవాలయం ఈ నెల 14 వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ (BAPS) పేరుతో నిర్మించిన ఈ ఆలయం అబుదాబిలో ఉంది. మిడిల్ ఈస్ట్‌ దేశాల్లోనే అతిపెద్ద హిందూ ఆలయంగా నిలిచింది. 

అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభం అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది. మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందుతున్న బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్(BAPS) ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) అబుదాబి నగరంలో నిర్మితమవుతున్న ఈ ఆలయం ఫిబ్రవరి 14, 2024న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. అబుదాబి ఆలయం అరబ్ దేశాల్లో అతిపెద్ద మందిరంగా....   మిడిల్ ఈస్ట్‌లోనే అతిపెద్ద ఆలయంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆలయ ప్రారంభానికి ఒక రోజు  ముందు ( ఫిబ్రవరి 13)  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(UAE)లోని   భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ భారీ సమావేశానికి అహ్లాన్ మోదీ (హలో మోదీ) అని పేరు పెట్టారు. 

ఇస్లామిక్ దేశంగా ఉన్న యూఏఈ(UAE)లో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆ సమయంలో మంత్రితో పాటు పలువురు అరబ్ ప్రముఖులు పాల్గొన్నారు. 2024  జనవరి 29 న 42 దేశాల రాయబారులు, దౌత్యవేత్తల టీం ఆలయాన్ని సందర్శించింది. యూఏఈ(UAE)లోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ఈ పర్యటనకు నాయకత్వం వహించారు. 

ఈ ఆలయాన్ని  27 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 7 శిఖరాలు.. UAE లోని 7 ఏమిరేట్స్‌ని సూచిస్తాయి.అబుధాబి, యూఏఈ, దుబాయ్‌, షార్జా.. ఇలా మొత్తం ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఏడు గోపురాలను నిర్మించారు.  ఆలయంలో 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి.  ఈ ఆలయాన్ని రూ. 700 కోట్లతో నిర్మించారు. ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్యాంసులు.. ఇలా అనేక శిల్పాలను చెక్కారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద 3డీ విధానంలో ఏక శిలపై అయోధ్య రామమందిర నమూనాను రూపొందించారు. ఆ అద్భుతాన్ని వీక్షిస్తే.. సాక్షాత్తూ అయోధ్య రాముణ్ని దర్శించుకున్న భావన కలగనుంది. 

పవిత్ర గంగా యమున నదీ జలాల ప్రవాహాన్ని మరపించేలా దేవాలయం దిగువ భాగంలో కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్‌ లైట్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా రాజస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న 20 వేల టన్నులకు పైగా పాలరాయి (పింక్‌ శాండ్‌ స్టోన్‌)తో.. రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన 2 వేల మందికి పైగా శిల్పులు, కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు. 

ఆలయ ఎత్తు 108 అడుగులు కాగా.. 40 వేల క్యూబిక్ ఫీట్ల పాల రాయి.. 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకలను కూడా వాడారు. 6.90 లక్షల గంటలు పని చేసి ఆలయాన్ని నిర్మించారు. యూఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని తీసుకెళ్లి నిర్మాణంలో ఉపయోగించారు. అత్యాధునిక టెక్నాలజీ, ఫీచర్లు, సెన్సార్లు ఏర్పాటు చేశారు.

 2015 లో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా ఈ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించింది. ఇప్పటి వరకు అబుదాబిలో హిందూ దేవాలయం లేదు. హిందువులు పూజలు, ప్రార్థనల కోసం దుబాయ్‌కు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ రెండు ఆలయాలు, గురుద్వార ఉన్నాయి. కర్ణాటకలోని ఉడిపికి చెందిన బి.ఆర్‌.శెట్టి అబుదాబిలో ప్రముఖ వ్యాపారవేత్త... 1968లో ఆయన ఉడిపి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. మోదీ యూఏఈ పర్యటనలో బి.ఆర్‌.శెట్టి కీలక పాత్ర పోషించారు.