బడ్జెట్ 2020… కొత్త ఉద్యోగాలు రానున్నాయ్

బడ్జెట్ 2020… కొత్త ఉద్యోగాలు రానున్నాయ్

    విజన్​, యాక్షన్​ కలగలిసింది  బడ్జెట్​పై ప్రధాని మోడీ

కేంద్ర బడ్జెట్​లో దేశాన్ని, ప్రజల్ని సంపన్నవంతం చేయడానికి కావలసిన అన్ని వనరులు ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ‘ప్రతి ఒక్కరికీ సంపద సృష్టిస్తుంది. వచ్చే పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పునాదుల్ని పటిష్టపరచడానికి అవసరమైన విజన్,​ యాక్షన్​ రెండూ ఉన్నాయి’ అని మోడీ చెప్పారు.  శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ 2020–21 బడ్జెట్​ని ప్రతిపాదించిన తర్వాత… ప్రధానమంత్రి మోడీ మీడియా ద్వారా తన ఒపీనియన్​ తెలిపారు.

న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో, నిర్మాణ రంగంలో, మెడికల్​ విభాగంలో, విద్యా విధానంలో, వ్యవసాయం, బ్లూ ఎకానమీ, టెక్నాలజీ తదితర రంగాల్లో జరిపిన కేటాయింపులతో… దేశంలో నిరుద్యోగ సమస్య చాలామటుకు తీరుతుందన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.  ఆయా రంగాలన్నింటిలోనూ యువతకు ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు.

ప్రధాని తన ప్రసంగంలో…. ఆర్థిక వ్యవస్థలో తెచ్చిన కొత్త మార్పులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. డైరెక్ట్​ ట్యాక్స్​ సిస్టమ్​ సరళీకరణ, గందరగోళం లేని పద్ధతిలో నిధుల సేకరణ, వేగంగా పెట్టుబడుల ఉపసంహరణ వంటి కొన్ని చర్యల ద్వారా ప్రభుత్వం తన పాత్రను తగ్గించుకుంటుందన్నారు. ‘వీటివల్ల ప్రజల తమ లైఫ్​స్టయిల్​ని తాము కోరుకున్నట్లుగా అనుభవించే స్థితి ఏర్పడుతుంది. ఈ బడ్జెట్​ని చూశాక రాబడిని, పెట్టుబడిని, డిమాండ్​ని, వస్తు వాడకాన్ని పెంచుతుందన్న నమ్మకం నాకు ఏర్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థలోనూ, రుణ పరపతిలోనూ నూతన ఉత్తేజం తెస్తుంది. ప్రస్తుత అవసరాలను తీర్చడమే కాకుండా, రేపటి అంచనాల్నికూడా ఈ బడ్జెట్​ తీర్చగలుగుతుంది’ అని భరోసా వ్యక్తం చేశారు.

టెక్స్​టైల్​ రంగానికి అవసరమైన ముడిసరుకు ఉత్పత్తిని మన దేశంలోనే పెంచాలని దాదాపు 30 ఏళ్లుగా డిమాండ్​ ఉందని, దానిని ఈ బడ్జెట్​ తీరుస్తోందని చెప్పారు మోడీ. ఆయుష్మాన్​ భారత్​ స్కీమ్​ దేశంలో ఆరోగ్య మెరుగుదల సాధించిందని చెప్పారు. డాక్టర్లు, నర్సులు, అటెండెంట్లు తదితర ఉద్యోగాలు పెరిగాయని, మెడికల్​ డివైజుల తయారీకూడా ఎక్కువైందని తెలిపారు.  ఇంకా… కొత్త స్మార్ట్​ సిటీల ప్రతిపాదన, ఎలక్ట్రానిక్​ వస్తువుల తయారీ, డేటా సెంటర్​ పార్కులు, బయోటెక్నాలజీ, క్వాంటమ్​ టెక్నాలజీ రంగాల్లో పాలసీపరమైన మార్పులను ఈ బడ్జెట్​ ప్రతిపాదించిందన్నారు.

విద్యా విధానంలో తెచ్చిన సంస్కరణలు విదేశీ ఉద్యోగాలకు వెళ్లాలనుకునే యువతకు చాలా సాయపడతాయన్నారు ప్రధాన మంత్రి. ఆధునిక ఇండియా రూపకల్పనకు మోడర్న్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఎంతో అవసరమని, ఈ రంగంలో  పెద్ద సంఖ్యలో కొలువులు లభిస్తాయని చెప్పారు. నిర్మాణ రంగానికిచ్చిన 100 లక్షల కోట్ల రూపాయలతో 6,500 ప్రాజెక్టులు చేపట్టడంద్వారా నిరుద్యోగ సమస్య చాలామటుకు
తీరుతుందన్నారు.

నాలుగు ప్రధాన రంగాలకూ మంచి సపోర్ట్

వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, టెక్స్​టైల్​, టెక్నాలజీ వంటి నాలుగు ప్రధాన రంగాలకూ బడ్జెట్​లో మంచి సపోర్ట్​ ఇచ్చారని, ఈ నాలుగింటిలోనూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మోడీ తెలిపారు. రైతుకు రెట్టింపు రాబడి వచ్చేలా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి మెరుగుపడేలా 16 సూత్రాల యాక్షన్​ ప్లాన్​ ఉందన్నారు.
వ్యవసాయ రంగంలో సంప్రదాయ పద్ధతులతోపాటుగా అదనపు రాబడికోసం హార్టికల్చర్​, ఫిషరీస్​, పశు పోషణ రంగాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. సముద్ర వనరుల వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఎకానమీ​) ద్వారా యువతకు ఫిష్​ ప్రాసెసింగ్​, మార్కెటింగ్​ల్లో మంచి అవకాశాలు ఏర్పడతాయన్నారు. ప్రపంచ బ్యాంక్​ కూడా బ్లూ ఎకానమీవల్ల ఆర్థిక వృద్ధి, మంచి బతుకుదెరువు, ఉద్యోగాలు వస్తాయని సూచించిందని ప్రధాని గుర్తు చేశారు.

మరిన్ని వెలుగు వార్తలు కోసం క్లిక్ చేయండి