కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటిలేటర్లపై ఆడిట్ చేయండి

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటిలేటర్లపై ఆడిట్ చేయండి

కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన వెంటిలేటర్లు సరిగ్గా లేవని..లోపాలున్నాయనే ఆరోపణలకు సంబంధించి వెంటనే ఆడిట్‌ నిర్వహించాలని ప్రధాని మోడీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మార్చి ప్రారంభంలో వారానికి 50 లక్షల పరీక్షలు జరిగేవని.. ఇప్పుడు వారానికి 1.3 కోట్ల పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివిటీ రేటు (TPR) అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేక కంటైనర్‌ వ్యూహాలుండాలని మోడీ అన్నారు. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువమందికి కరోనా పరీక్షలను నిర్వహించాలని  అధికారులను ఆదేశించారు. 

ఇంటింటికీ పరీక్షలు, నిఘాపై దృష్టి పెట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ వనరులను పెంచాలని సూచించారు మోడీ. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లతో సహా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. వైద్య పరికరాలు సజావుగా పనిచేయడానికి విద్యుత్‌ సరఫరా ఉండేలా చూడాలన్నారు.

 శాస్త్రవేత్తలు, నిపుణులు సూచించిన దిశలోనే కరోనాపై పోరాడుతున్నామని అన్నారు మోడీ. ప్రజలకు టీకాలు మరింత ఎక్కువగా ఇచ్చేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.