కర్బన ఉద్గారాలను తగ్గిద్దాం ..ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

కర్బన ఉద్గారాలను తగ్గిద్దాం ..ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
  •     ‘గ్రీన్ క్రెడిట్’ ఇనిషియేటివ్‌‌ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన
  •     2028 క్లైమేట్ కాన్ఫరెన్స్‌‌ను ఇండియాలో నిర్వహిస్తామని ప్రతిపాదన చేసిన పీఎం 

దుబాయ్ :  ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలను భారీగా తగ్గించేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించేందుకు ‘గ్రీన్ క్రెడిట్’ ఇనిషియేటివ్‌‌ను ఆయన ప్రకటించారు. దుబయ్‌‌లో జరుగుతున్న కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) 28 క్లైమేట్ సమిట్‌‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. అంతకుముందు దుబాయ్ ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. సదస్సులో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ జనాభాలో 17 శాతం వాటా ఇండియాది. ఇదే సమయంలో గ్లోబల్ కార్బన్ ఎమిషన్ల విషయానికి వస్తే.. ఇండియా వాటా 4 శాతం మాత్రమే. క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అయిన ‘నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ (ఎన్‌‌డీసీ)’ టార్గెట్లను అందుకునేందుకు వేగంగా ముందుకు సాగుతున్నాం. శిలాజ రహిత ఇంధన టార్గెట్లను డెడ్‌‌లైన్‌‌కు 9 ఏండ్ల ముందే అందుకున్నాం” అని వివరించారు. గత శతాబ్దపు తప్పులను సరిచేసేందుకు మనకు పెద్దగా సమయం లేదన్నారు. ఎన్‌‌డీసీ టార్గెట్లను అందుకునేందుకు అన్ని దేశాలు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. మిటిగేషన్, అడాప్షన్ మధ్య బ్యాలెన్స్‌‌ కొనసాగించాలని సూచించారు. క్లైమేట్‌‌ చేంజ్‌‌పై పోరాడేందుకు వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు తమ టెక్నాలజీని ట్రాన్స్‌‌ఫర్ చేయాలని కోరారు.

ఇండియా గొప్ప ఉదాహరణ

యూఎన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ (కాప్ 33)ను 2028లో తాము నిర్వహిస్తామని ప్రధాని ప్రతిపాదించారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్‌‌’ను ప్రకటించారు. ‘‘అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకం పాటించడంలో ప్రపంచానికి గొప్ప ఉదాహరణగా భారతదేశం నిలిచింది. గ్లోబల్ వార్మింగ్‌‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌‌కు పరిమితం చేసే ఎన్‌‌డీసీ టార్గెట్లను సాధించే మార్గంలో ఉన్న కొన్ని దేశాల్లో ఇండియా ఒకటి” అని వివరించారు. 

ఏడు సమావేశాలు..

21 గంటలపాటు దుబాయ్ పర్యటనలో ఉండనున్న ప్రధాని మోదీ.. 7 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. నాలుగు చోట్ల ప్రసంగించనున్నారని, 2 స్పెషల్ మీటింగ్స్‌‌లోనూ ప్రధాని పాల్గొంటారని వివరించారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడితో భేటీ అయిన ప్రధాని.. మరికొందరు ప్రపంచ నేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందన్నారు. కాప్ 28లో భాగంగా వరల్డ్‌‌ క్లైమేట్ యాక్షన్ సమిట్‌‌కు హాజరవుతారని పేర్కొన్నారు. యూఏఈ ప్రెసిడెన్సీలో కాప్ 28 సమిట్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 దాకా కొనసాగనుంది.