నేడు (నవంబర్ 7న) ఎల్బీ స్టేడియంలో మోదీ సభ

నేడు (నవంబర్ 7న) ఎల్బీ స్టేడియంలో మోదీ సభ

హైదరాబాద్, వెలుగు :  బీజేపీ ఆధ్వర్యంలో ‘బీసీ ఆత్మగౌరవ సభ’ పేరుతో మంగళవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా రానున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను పార్టీ నేతలు కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, లక్ష్మణ్ సోమవారం పరిశీలించారు. 

గత నెలలో సూర్యాపేటలో జరిగిన సభలో తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పేందుకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ ఈ సభ ఏర్పాటు చేసింది. ఇందులో బీసీ సీఎంపై మోదీ ఏమైనా ప్రకటన చేస్తారా? అనే ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది. 

కాగా, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మోదీ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ఆయన గత నెలలో మహబూబ్ నగర్,  నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. మళ్లీ ఈ నెల 11న కూడా రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న ఎస్సీ సామాజిక వర్గాల సమావేశానికి హాజరవుతారు. 

ఇదీ మోదీ టూర్ షెడ్యూల్.. 

మోదీ మంగళవారం సాయంత్రం 5:05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 5:30 నుంచి 6:10 గంటల వరకు సభలో ఉంటారు. తిరిగి 6:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి వెళ్తారు.