
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో పేదల సంక్షేమానికే పెద్దపీట వేశామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ బడ్జెట్ ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుందన్నారు. అధిక పెట్టుబడులు, సౌలతులు, ఉద్యోగాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ కూర్పు జరిగిందని ఆయన తెలిపారు. ‘‘ఇది పీపుల్ ఫ్రెండ్లీ, ప్రోగ్రెసివ్ బడ్జెట్. కరోనా రూపంలో వందేండ్లలోనే అతిపెద్ద విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో అభివృద్ధి దిశగా కొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చేలా బడ్జెట్ రూపొందింది. ఇది ఎకానమీని బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు అనేక అవకాశాలను కల్పిస్తుంది. ప్రస్తుత సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, అధిక పెట్టుబడులు, మరింత గ్రోత్, అధిక ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుంది. యువతకు బ్రైట్ ఫ్యూచర్ అందించేలా ఉంది” అని మోడీ చెప్పారు. పర్వతమాల స్కీంతో హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు.
అన్ని వర్గాలకు మేలు..
డ్రోన్లు, వందే భారత్ ట్రెయిన్లు, డిజిటల్ కరెన్సీ, 5జీ సర్వీసులు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టం వంటివి రైతులు, యువత, మిడిల్ క్లాస్, పేదలు, దళితులు, బీసీ వర్గాలకు మేలు చేస్తాయని ప్రధాని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికీ పక్కా ఇల్లు, నల్లా నీళ్లు, గ్యాస్ కనెక్షన్ అందించడమే లక్ష్యంగా బడ్జెట్లో ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ‘‘వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, అనేక అవకాశాలను అందించేందుకు బడ్జెట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ స్టార్టప్‌లు, ప్యాకేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రైతుల ఆదాయం పెరిగేందుకు సాయపడతాయి. కనీస మద్దతు ధరతో పంటల కొనుగోలుతో రైతులకు రూ. 2.25 లక్షల కోట్లు ట్రాన్స్ ఫర్ అవుతున్నాయి. బడ్జెట్ లో క్రెడిట్ గ్యారంటీతో పాటు రైతులకు అనేక స్కీంలు ఉన్నాయి” అని మోడీ వివరించారు. గంగా నదిని క్లీన్ చేయడంతోపాటు గంగా తీరం వెంబడి 5 రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. ప్రభుత్వ పెట్టుబడులను రూ. 7.5 లక్షల కోట్లకు పెంచడంతో ఎకానమీ కొత్త పుంతలు తొక్కుతుందని పేర్కొన్నారు.