మనకు కావాల్సిన ఆయుధాలు మనమే తయారుచేసుకోవాలి

మనకు కావాల్సిన ఆయుధాలు మనమే తయారుచేసుకోవాలి
  • 75కు పైగా దేశాలకు ఆయుధాల ఎగుమతి
  • దేశీయంగానే తయారు చేస్తున్నం
  • రక్షణ శాఖ వెబినార్ లో ప్రధాని మోడీ 

న్యూఢిల్లీ:  రక్షణ రంగంలో మనకు కావాల్సిన ఆయుధాలు, పరికరాలను మనమే దేశీయంగా అభివృద్ధి చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ రంగంలోనూ దేశీయ అభివృద్ధి కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించామని ఆయన వెల్లడించారు. శుక్రవారం రక్షణ శాఖ నిర్వహించిన ‘పోస్ట్ బడ్జెట్ వెబినార్’లో ప్రధాని మోడీ మాట్లాడారు. రక్షణ రంగంలో దిగుమతులను తగ్గిస్తూ, ఎగుమతులు పెంచుతున్నామని చెప్పారు. గత ఐదారేండ్లలో మన దేశం నుంచి రక్షణ ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయన్నారు. ప్రస్తుతం 75కుపైగా దేశాలకు మన దేశం నుంచి రక్షణ ఆయుధాలు, పరికరాలను ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. మేక్​ఇన్​ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని తెలిపారు. రక్షణ రంగంలో గత ఏడేండ్లలో 350కి పైగా కొత్త పరిశ్రమలకు లైసెన్స్​లు వచ్చాయన్నారు. ‘‘పది దేశాలు ఒకే రకమైన ఆయుధాలు, రక్షణ పరికరాలను కలిగి ఉంటే మన మిలిటరీకి ప్రత్యేకత ఏముంటుంది? మన దేశంలో సొంతంగా రక్షణ ఆయుధాలు, పరికరాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే ప్రత్యేకతను చాటుకోగలం. అందుకే ఈసారి రక్షణ శాఖకు బడ్జెట్ లో దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించేందుకే 70% నిధులను కేటాయించాం” అని మోడీ వెల్లడించారు. జాతీయ భద్రతకు సైబర్ సెక్యూరిటీ కూడా కీలకంగా మారిందన్నారు. మన అవసరాలకు తగ్గట్లుగా ప్రత్యేక భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. రక్షణ రంగంలో ఐటీ సేవలను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే.. భద్రతపై మనకు అంతగా నమ్మకం పెరుగుతుందన్నారు.