సొంత ఎమ్మెల్యేలనూ గెహ్లాట్ నమ్మట్లే!.. ప్రధాని మోడీ విమర్శలు

సొంత ఎమ్మెల్యేలనూ గెహ్లాట్ నమ్మట్లే!.. ప్రధాని మోడీ విమర్శలు
  • రాజస్థాన్​ సీఎంపై ప్రధాని మోడీ విమర్శలు
  • వాళ్లకు కూడా ఆయనపై నమ్మకంలేదన్న మోడీ
  • నాథ్​ద్వారాలో 5.5 వేల కోట్ల ప్రాజెక్టుల కు గెహ్లాట్​తో కలిసి శంకుస్థాపన

జైపూర్: సొంత ఎమ్మెల్యేల మీదే రాజస్థాన్ సీఎంకు నమ్మకం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆయనను విశ్వసించడం లేదని ఆయన పేర్కొన్నారు. 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం అశోక్  గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్  పైలట్ మధ్య జరుగుతున్న అంతర్గత పోరుపై మోడీ స్పందించారు. ‘‘గత ఐదేళ్లుగా కాంగ్రెస్  నేతలు అంతర్గత పోరుతో బిజీగా ఉన్నారు. ప్రజల గురించి, అభివృద్ధి గురించి వారు ఆలోచించడం లేదు. రాష్ట్రాన్ని లూటీ చేయడం, పదవులను కాపాడుకోవడం మీదే వారు దృష్టి పెట్టారు” అని ఆయన ఫైరయ్యారు. రాజస్థాన్​లోని అబూ రోడ్  సిటీలో బుధవారం నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడారు. టెర్రరిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరితో ఉందని, 2008లో జైపూర్​లో జరిగిన వరుస బాంబు పేలుళ్లే ఇందుకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్  ప్రభుత్వం సరిగా పోరాడలేదని, దీంతో నిందితులు తప్పించుకున్నారని చెప్పారు.

రూ.5.5 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన..

అంతకుముందు నాథ్​ద్వారా పట్టణంలో రూ.5500 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర సీఎం అశోక్  గెహ్లాట్​తో కలిసి మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ప్రతిదానినీ ఓట్లతో కొలిచేవారు దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్లను రూపొందించలేకపోతున్నారని అన్నారు. అలాంటి వైఖరి వల్లే దేశంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి వారు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ‘‘నెగెటివ్  మైండ్ సెట్ ఉన్నోళ్లకు విజన్  ఉండదు. వాళ్లు తమ స్వార్థం గుించే ఆలోచిస్తారు. సుస్థిర అభివృద్ధి కోసం ఆధునిక మౌలిక సౌకర్యాలు కల్పించడం కూడా అవసరమని చరిత్ర చెబుతున్న సత్యం. దేశంలో తగిన సంఖ్యలో మెడికల్  కాలేజీలు కట్టి ఉంటే, ఈ రోజు డాక్టర్లకు కొరత ఉండేది కాదు. ప్రతీ ఇంటికి నీళ్లు ఇచ్చి ఉంటే, జల్ జీవన్ మిషన్  అవసరం ఉండేదే కాదు” అని మోడీ వ్యాఖ్యానించారు.

గెహ్లాట్  మాట్లాడుతుండగా ‘‘మోడీ.. మోడీ..’’ నినాదాలు

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ ప్రతిపక్షాలను గౌరవించాలని అన్నారు. ఈ విషయంలో ప్రధాని చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో శత్రుత్వం ఉండకూడదన్నారు. ప్రతిఒక్కరికీ తమ అభిప్రాయాలను తెలిపే హక్కు ఉందన్నారు. దేశంలోని అన్ని కులాలు, మతాల మధ్య సోదరభావం, ప్రేమ ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే, గెహ్లాట్  మాట్లాడుతుండగా సభలోని జనం ఒక్కసారిగా ‘మోడీ మోడీ’ అని నినాదాలు చేయడంతో సీఎం కాసేపు తన ప్రసంగాన్ని ఆపారు. ముఖ్యమంత్రిని మాట్లాడనివ్వాలని మోడీ జోక్యం చేసుకోవడంతో ప్రజలు నినాదాలు ఆపారు. అనంతరం గెహ్లాట్  తన ప్రసంగాన్ని కొనసాగించారు.