దేశంలో ప్రారంభమైన 5జీ సేవలు

దేశంలో ప్రారంభమైన 5జీ సేవలు

దేశంలో 5 జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించి, 5 జీ సర్వీసెస్ ను  ప్రధాని మోడీ లాంచ్ చేశారు. ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లోనే 5జీ సేవలు అందిస్తున్నారు. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పునె, అహ్మదాబాద్, చండీగడ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5 జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రెండేళ్లలో దేశమంతటా 5 జీ సేవలు విస్తరించనున్నారు.  ప్రపంచవ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికం సేవలు మన దేశంలోనూ మొదలయ్యాయి. ఇప్పటికే అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడా ఈ సేవలు కొన్ని నగరాల్లోనే ఉన్నాయి.

4 జీ – 5జీ సేవల మధ్య తేడా

ప్రస్తుతం మనం 4 జీ సేవలు వాడుతున్నాం. దీనికి కంటే మెరుగైన సేవలు 5జీ తో అందుతాయి. 4 జీలో గరిష్ట డౌన్ లోడ్ వేగం 1 GBPS. అయితే 5జీలో 10 GBPS. దీంతో ఎక్కువ క్వాలిటీ, డ్యురేషన్ ఉన్న వీడియోలను, సినిమాలను సెకన్ల వ్యవధిలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 4 జీ – 5జీ సేవల మధ్య ఉన్న మరో ప్రధాన తేడా సమాచారం ప్రసారమయ్యే విధానం. 4 జీలో సమాచార సంకేతాలు సెల్ టవర్ల నంచి ప్రసారం అవుతాయి. 5జీలో స్మాల్ సెల్ టెక్నాలజీ వాడుతారు. చిన్న బాక్సుల సైజులో ఉండే చిన్న సెల్స్ తో  హై బ్యాండ్ సేవలు అందుతాయి. ఐతే ఈ బాక్సులను అమర్చలేని చోట తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రాంతాల్లో సెల్ టవర్లనే వినియోగిస్తారు. 

5జీతో ఉపయోగాలు

 ఈ 5 జీతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు టెక్నికల్ ఎక్స్ పర్ట్స్. ఎంత పెద్ద సినిమానైనా ఒక్క క్లిక్ తో ఫోన్లో డౌన్లోడ్  చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దుస్తులు షాపింగ్  చేసేటప్పుడు... మనం వేసుకుంటే అవి ఎలా ఉంటాయో ఫోన్లోనే చూసుకోవచ్చు. డ్రైవర్  లేని కార్లను తయారు చేయొచ్చంటున్నారు. మారుమూల ప్రాంతాలకూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావొచ్చని చెప్తున్నారు. 

పాత 4 జీ స్మార్ట్  ఫోన్  5జీ నెట్  వర్క్  ను కూడా అందుకుంటుంది. కానీ.. హార్డ్  వేర్ , సాఫ్ట్  వేర్  పరిమితుల వల్ల కొన్ని ఫోన్లు 5జీ సేవలను పూర్తిస్థాయిలో అందించలేకపోవచ్చని అంటున్నారు నిపుణులు.  4 జీ ఫోన్  5 జీకి సరిపోతుందో లేదో సర్వీస్  ప్రొవైడర్  ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

5జీతో ఖర్చు తక్కువ

అధికారికంగా ప్రకటించకున్నా 4జీ ఖర్చులతో పోలిస్తే 5జీ ఖర్చులు భారీగా ఉండకపోవచ్చని అంచనా. ఐతే డేటా వేగం పెరుగుతుండడంతో ... వినియోగదారులు 5 జీలో అధికంగా డేటాను వినియోగించే అవకాశాలు పెరుగుతాయి. ఫలితంగా టెలికం కంపెనీలకు ప్రతి వినియోగదారుపై సగటు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. అంటే.. ఛార్జీలు పెంచకున్నా, కంపెనీలకు ఆదాయం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు.

ఇప్పటిదాకా టెలికం రంగంలోని 1జీ నుంచి 4జీ దాకా   ప్రతిసారీ నెట్ వర్క్  సదుపాయాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. 5 జీలో మాత్రం దేశీయంగా ఉత్పత్తిచేసిన పరికరాలనే వాడుతున్నారు.

క్షణాల్లో సినిమా డౌన్ లోడ్

 హైస్పీడ్  బటన్  నొక్కగానే క్షణాల్లో సినిమా డౌన్ లోడ్  అవుతుంది. ఎలాంటి బ్రేక్ లేకుండా గేమ్  లూ ఆడుకోవచ్చు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్  సేవలు మరింత ఈజీ కానున్నాయి. వ్యవసాయంలో సాంకేతికత విస్తరిస్తుంది. ఆన్ లైన్  చదువుల్లో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంది.