దేశంలోనే అతిపెద్ద ఎయిర్ పోర్టుకు నేడు శంకుస్థాపన

దేశంలోనే అతిపెద్ద ఎయిర్ పోర్టుకు నేడు శంకుస్థాపన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నారు. నోయిడా (ఉత్తర్ ప్రదేశ్) శివార్లలో దేశంలోనే అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ కార్యక్రమం జరగనుంది. రూ.10,500 కోట్లతో మొదటి దశ విమానాశ్రయ నిర్మాణం మొదలు కానుంది. ఈ ప్రాజెక్టు అన్ని దశలు పూర్తిచేసుకునే సరికి రూ. 35 వేల కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. నోయిడా నుంచి 40 కి.మీ.ల దూరంలో, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 72 కి.మీ.ల దూరంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1,300 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించనున్న నోయిడా ఎయిర్‌పోర్టును 2024 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

లక్ష మందికి ఉద్యోగాలు!

ఈ కొత్త విమానశ్రయానికి ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికుల తాకిడి ఉంటుందని అంటున్నారు. 20 లక్షల మెట్రిక్ టన్నుల సరకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో 80 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు విస్తరించే అవకాశం ఉంది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఆగ్రా, ఫరీదాబాద్, మథుర నగరాల ప్రజలకు ఇది ఉపయోగకరం కానుంది. ఈ ఎయిర్ పోర్టు ద్వారా సుమారు లక్ష మందికి ఉద్యోగావకాశాలు దొరుకుతాయని చెబుతున్నారు. ఢిల్లీ- ఐజీఐ విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గిస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. మెట్రో, హైస్పీడ్ రైలుతోపాటు ట్యాక్సీ, బస్ సర్వీసులతో నోయిడా విమానాశ్రయానికి మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. కర్బన ఉద్గార రహిత విమానాశ్రయంగా దీన్ని ప్రత్యేక శ్రద్ధతో నిర్మించనున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

రన్నింగ్ ట్రైన్ లో స్కూల్ గర్ల్, బోయ్ స్టంట్స్

మోడీ సర్కార్ రిపోర్టు కార్డు.. అన్నింటికీ నాదే బాధ్యత

రాష్ట్రపతి కోవింద్ టూర్ వివరాలు లీక్