మోడీకి స్వాగతం పలికిన పక్క రాష్ట్ర సీఎంలు..మరి తెలంగాణలో..?

మోడీకి స్వాగతం పలికిన పక్క రాష్ట్ర సీఎంలు..మరి తెలంగాణలో..?

ప్రధాని నరేంద్రమోడీ దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలతో బిజీగా ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో మోడీ పాలుపంచుకోనున్నారు. ఇప్పటికే ఏపీ చేరుకున్న ప్రధానికి ఏపీసీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలికారు. కొన్ని రాష్ట్రాలు కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సఖ్యతగా లేకపోయినా.. ఆ వైరాన్ని పక్కనబెట్టి ప్రధాన నరేంద్రమోడీకి స్వాగతం పలికాయి. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 

ఉదయం కర్నాటకకు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. తొలుత బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో చెన్నై మైసూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2ను జాతికి అంకితం చేశారు. ఎయిర్ పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నాధప్రభు కెంపెగౌడ 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

కర్నాటకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. సాయంత్రానికి తమిళనాడు చేరుకున్నారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు సీఎం స్టాలిన్ శాలువా కప్పి స్వాగతం పలికారు. నిజానికి హిందీ భాష అమలు, నీట్ ఎగ్జెంప్షన్ బిల్లు సహా పలు అంశాల విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా గవర్నర్ ఆర్ఎన్ రవి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎంకే ప్రభుత్వం.. ఆయనను బర్తరఫ్ చేయాలంటూ సంతకాల సేకరణ చేపట్టింది. తాజాగా గవర్నర్ మాకొద్దు అంటూ రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇంత జరుగుతున్నా ప్రధాని పర్యటన విషయంలో ప్రభుత్వం హుందాగా వ్యవహరించింది. ఆయనకు స్వాగతం పలికే విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంది.

తమిళనాడు పర్యటన అనంతరం ప్రధాని మోడీ ఏపీలో అడుగుపెట్టారు. మోడీ టూర్ కోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. శనివారం సీఎం జగన్తో కలిసి ప్రధాని పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. 

ప్రధాని మోడీ పర్యటన విషయంలో మూడు రాష్ట్రాల వ్యవహారశైలి ఇలా ఉంటే తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రేపు మధ్యాహ్నం 12గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నరేంద్రమోడీ హైదరాబాద్ కు బయలు దేరనున్నారు. అయితే ఆయనకు సీఎం కేసీఆర్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. అయితే కేసీఆర్ ఇలా చేయడం ఇదే మొదటి సారికాదు. జులైలో మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ ఇలాంటి వైఖరే ప్రదర్శించారు. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదాలు సహా పలు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రధాని టూర్ విషయంలో కేసీఆర్ ఇలా వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.