దేశ విభజనే మోడీ ప్రధాన ఎజెండా: రాహుల్

దేశ విభజనే మోడీ ప్రధాన ఎజెండా: రాహుల్

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని మరోసారి విభజించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శనివారం రాహుల్ అస్సాంలో పర్యటించారు.  కాంగ్రెస్‌ శ్రేణులు ఏ‍ర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. యువత, ప్రజల సమస్యలు పట్టని మోడీ.. దేశ విభజనే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గతంలో ప్రపంచ దేశాల్లో భారత్‌కు మంచి గుర్తింపు ఉండేదని.. నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను మోడీ సర్కారు నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక కొంతమంది బిజినెస్ మెన్లకే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందన్నారు రాహుల్ . ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఈశాన్య ప్రాంతమైన అస్సాంపై  RSS పెత్తనం కొనసాగించాలని చూస్తోందని… మతాల మధ్య చిచ్చు పెడుతున్న చెడ్డీగ్యాంగ్‌ ఆగడాలను ప్రజలు తిప్పికొడతారన్నారు రాహుల్.