ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ ప్లాంట్ ప్రారంభం

ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ ప్లాంట్ ప్రారంభం

బెంగళూరు : దేశ రక్షణలో హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ (హెచ్​ఏఎల్) కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని మోడీ అన్నారు. హెచ్​ఏఎల్ హెలికాప్టర్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్​ను తుమకూరులో సోమవారం మోడీ ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్​ మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీ ప్లాంట్. లైట్ యుటిలిటీ హెలికాప్టర్స్ (ఎల్​యూహెచ్)ను ఇక్కడ తయారు చేస్తారు. ప్లాంట్​ను సందర్శించి జాతికి అంకితం చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ యూనిట్​ ఏర్పాటు చేశామన్నారు. ‘‘దేశంలోనే అతిపెద్ద హెలీకాప్టర్ ఫ్యాక్టరీ తుమకూరు జిల్లాలో ఏర్పాటైంది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి దొరుకుతుంది. దీనికితోడు జిల్లాలో ప్రతీ ఇంటికి మంచినీరు అందజేసే ప్రాజెక్టులను కూడా ప్రారంభించాం. కర్నాటక ఇన్నోవేషన్​కు కేరాఫ్ అడ్రస్​గా నిలిచింది. డ్రోన్లు, తేజస్ ఫైటర్ జెట్స్ ఇక్కడే తయారవుతున్నాయి. ప్రపంచమంతా కర్నాటక వైపు చూస్తున్నది. ఎంతో మంది ఇన్వెస్టర్లు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న కర్నాటకను ఎంచుకుంటున్నారు. డబుల్​ ఇంజిన్​ సర్కార్ ఎలా పని చేస్తున్నదో చెప్పడానికి ఈ హెలీకాప్టర్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంటే నిదర్శనం”అని మోడీ అన్నారు. 

2016లో శంకుస్థాపన

2016లో ఈ ప్లాంట్ ఏర్పాటుకు తానే శంకుస్థాపన చేశానని మోడీ గుర్తు చేశారు. ‘‘దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. దేశ భద్రతలో ఉపయోగించే ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, ఫైటర్​జెట్స్, ఎయిర్​క్రాఫ్ట్​ క్యారియర్స్, హెలీకాప్టర్లు ఇక్కడే తయారవుతున్నాయి. వీటినే మన జవాన్లు యూజ్ చేస్తున్నారు. మేం అధికారంలోకి రాకముందు 15 ఏండ్లలో ఎరోస్పేస్​ రంగంలో పెట్టిన పెట్టుబడులు.. గడిచిన 8ఏండ్లతో పోలిస్తే 5 రెట్లు పెరిగాయి. అత్యాధునిక ఆయుధాలు ఎక్స్​పోర్ట్​ చేసే స్థాయికి ఇండియా ఎదిగింది. తుమకూరు నుంచే ప్రపంచ దేశాలకు హెలికాప్టర్లు ఎగుమతి అవుతాయి. సుమారు 4లక్షల కోట్ల బిజినెస్​ ఇక్కడే నుంచి జరుగుతుంది”అని మోడీ తెలిపారు. నేషన్ ఫస్ట్ అనే లక్ష్యంతో ముందుకెళ్తే కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. 

ఆత్మనిర్భర్​ భారత్​కు బూస్ట్​

‘‘ఎంత పెద్ద అబద్ధం అయినా.. ఎన్ని సార్లు చెప్పినా.. ఎవరితో చెప్పించినా.. అది నిజం కాదు. వారందరికీ హెచ్​ఏఎల్ గట్టిగా సమాధానం ఇస్తున్నది. ప్రపంచ దేశాలన్నీ హెచ్​ఏఎల్ వైపు చూస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్​కు బూస్ట్​ ఇస్తున్నది. ఇండస్ర్టియల్ టౌన్​షిప్​తో పాటు ఫుడ్ పార్క్​ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం”అని మోడీ వివరించారు. బడ్జెట్​లో ఫిజికల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​తో పాటు సోషల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై కూడా దృష్టి సారించామని మోడీ తెలిపారు.