
- ఆల్ పార్టీ మీటింగ్‌లో మోడీ
- భేటీకి 27 పార్టీల నేతల హాజరు
- ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేయాలని అపొజిషన్ డిమాండ్
- ఇవ్వాల్టి నుంచే వింటర్ సెషన్స్
న్యూఢిల్లీ:
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. గత సమావేశాల మాదిరే ఈ సారి కూడా ప్రొడక్టివ్‌గా సెషన్స్ సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటు రూల్స్, ప్రొసీజర్ల ఫ్రేమ్‌వర్క్ ప్రకారం అన్ని సమస్యలపై చర్చిస్తామని స్పష్టం చేశారు. సభలో జరిగే నిర్మాణాత్మక చర్చ.. బ్యూరోక్రసీని కూడా అలర్ట్‌గా ఉంచుతుందన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కానుండటంతో.. ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి.. 27 పార్టీల నేతలు హాజరయ్యారు.
ఫరూఖ్‌ను విడుదల చేయాలె..
నేషనల్ కాన్ఫరెన్స్ నేత, లోక్‌సభ ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లాను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పార్లమెంట్ సమావేశాలకు ఆయన హాజరయ్యేందుకు అనుమతి కల్పించాలని కోరాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. ‘‘ఒక పార్లమెంటేరియన్‌ను అక్రమంగా ఎలా బంధిస్తారు. ఆయన పార్లమెంటులో హాజరయ్యేందుకు అనుమతివ్వాలి’’ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద చాలా రోజులుగా ఫరూఖ్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ.. ఎకనామిక్ స్లో డౌన్, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలపై కచ్చితంగా చర్చ జరగాలని స్పష్టం చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు డిసెంబర్ 13 వరకు కొనసాగుతాయి.