మోడీజీ జనం వింటున్నారు..

మోడీజీ జనం వింటున్నారు..

ఎన్నికలపుపడు నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఈ సీజన్ లో వీళ్లింతేనని జనం కూడా అలవాటు పడిపోయారు. ఈ సందట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కుటుంబాన్ని వదిలి, దేశానికి అంకితమైన వ్యక్తిగా గౌరవం తెచ్చుకున్న మోడీ ప్రధాని హోదాలో అతిగా వ్యక్తిగత విమర్శలు, అబద్దాలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దేశభక్తి, భారతీయ విలువల గురించి దేశంలో ఎవరికీ తెలియనట్లు ప్రవచనాలిచ్చే మోడీ.. ఇప్పుడు తన తీరుతో రాజకీయాలకు కొత్త విలువలను నేర్పిస్తున్నారు.

ఆరేళ్లుగా  నరేంద్ర మోడీ  మాటను, చేతను దేశం ఆసక్తిగా గమనిస్తోంది. కొన్ని విషయాల్లో ఆయనును ఆదర్శంగా తీసుకుని అనుసరించింది. మరికొన్ని నచ్చక  సరిదిద్దే ప్రయత్నం చేసింది. అయితే ఓవైపు ఐదేళల్లో అద్భుతాలు  చేశానంటూనే మరోవైపు పుల్వామా దాడిని చివరిలో దొరికిన అవకాశంగా వాడుకుంటున్న ఆయన..ప్రచారంలో ఎందుకో తప్పటడుగులు వేస్తున్నారు.

మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం శరద్ పవార్ ను దేశంలో అందరూ గౌరవిస్తారు. విపక్ష నేత అయినా కేంద్ర ప్రభుత్వ  కూడా పద్మ విభూషణ్ ఇచ్చింది.  78 ఏళ్ల వృద్ధాప్యంలో పవార్ ఇప్పుడు ఎన్నికల బరిలో లేరు. ఇది కూడా మోడీకి రాజకీయ అంశంగా కనిపించింది. పవార్ కుటుంబ విషయాలను ప్రస్తావిస్తూ ప్రచారంలో విమర్శలు చేశారు. దీనికి పవార్ కూడా స్పందించారు. తన తల్లి నేర్పిన సంస్కారం వల్ల ఇలాంటి విమర్శలపై స్పందించడంలేదన్నారు. అదుపు తప్పిన విమర్శలతో  మోడీ తన తల్లికి సంపాదించి పెట్టిన గౌరవం ఇది.

ఇటీవల ఏపీ ప్రచారంలోనూ ఆయన ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుపై ఇలాగే వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనిపై బాబు కూడా అదే స్థాయిలో స్పందించారు. ఫొటోల కోసం తప్ప మోడీ తల్లిని కూడా చూడరని, తల్లినీ, భార్యనే పట్టించుకోనివాడు దేశాన్నేం పట్టించుకుంటాడని విరుచుకుపడ్డారు. కొన్నాళ్ల కింద ఏపీలో జరిగిన సభలోనే బాబు పేరు ప్రస్తావించకుండా లోకేశ్ తండ్రి అంటూ మోడీ మాట్లాడారు. అప్పుడు కూడా మోడీని జశోదా బెన్ భర్త అంటూ బాబు కామెంట్ చేశారు. భార్యను వదిలి పారిపోయిన వ్యక్తి తనపై విమర్శలు చేస్తున్నారని బదులిచ్చారు బాబు. అద్భుతమైన ప్రసంగాలిస్తారని పేరున్న మోడీ తన నోటి దురసుతనంతో తన కుటుంబాన్ని తానే రోడ్డు మీదికి తెస్తున్నారు. ఎవరినైనా అనడానికి ముందుండే మోడీ..తనపై విమర్శలొస్తే మాత్రం వృద్ధురాలైన తల్లిని, ఏ సంబంధంలేని కుటుంబాన్ని లాగుతున్నారంటూ వాపోతుంటారు. ఈ నీతులు తాను పాటించాలని అనకోరు.

అసలు నిజాలు వేరయా..

మోడీ ప్రసంగాల్లో తరచూ దొర్లుతున్న అబద్ధాలు మరోకోణం. ఇటీవలే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి వచ్చి, ఐదేళ్లలో ఒక్క పైసా కొత్త పన్ను వేయకుండానే అభివృద్ధి చేశానని చెప్పుకున్నారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పెట్రోలు రేట్లు తానే తగ్గించానని చెప్పుకున్నారు.  ఇది ఎంత నిజమో పెట్రోల్ బంకులు చూడగానే మనకు తెలుస్తుంది. ప్రపంచమంతా పెట్రోలు రేట్లు తగ్గినా ఆ ప్రయోజనాన్ని దేశ ప్రజలకు అందించకపోగా, అదే పనిగా అదనపు సుంకాలు వేసిన మోడీ సర్కారు లక్షల కోట్ల ఆదాయం దండుకుంది. పెట్రో దోపిడీ కొనసాగించింది. పెట్రో రేట్లు పెరిగినప్పుడు మాత్రం కేంద్రానికి సంబంధంలేదని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లాంటివాళ్లు  వివరణ ఇస్తుంటారు. మోడీ పాలనలోనే అన్ని రకాల సర్వీస్ ట్యాక్సుల్లో స్వచ్ఛ భారత్ సెస్ పేరుతో 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్ పేరుతో మరో 0.54శాతం వడ్డించారు. అంటే ఇప్పటికే ఉన్న సర్వీస్ ట్యాక్సును పరోక్షంగా ఒక శాతం పెంచారు.

జీఎస్టీ వల్ల రేట్ల గందరగోళంతో జనం నష్టపోయి వ్యతిరేకత రావడం వల్లే క్రమంగా జీఎస్టీ శ్లాబ్ లు తగ్గించుకుంటూ వచ్చారు. రూ.5లక్షల లోపు ఆదాయంపై ఐటీ రద్దుచేసి మధ్య తరగతికి గొప్ప మేలు చేసింది తానే అని హైదరాబాద్ సభలో మోడీ చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి ఉన్న ఈ ప్రతిపాదనను ఎవరూ పట్టించుకోకపోతే నేనే చేశానని గొప్పలకు పోయారు. నాలుగేళ్లుగా మధ్య తరగతి వర్గాలను పట్టించుకోని మోడీకి ఎన్నికల ముందు తనకు ఏ బాధ్యత లేని బడ్జెట్ లో జనం గుర్తొచ్చారు. తలన పాలన చివరి నెలలో లోక్ పాల్ ని నియమించడం ద్వారా అవినీతిపై తాను చేశానని చెప్పకునే పోరాటానికి కూడా గొప్ప ముగింపునిచ్చారు.

జనాల ముందు గ్యాస్..

దేశంలో కోట్లాది పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్  ఇస్తున్నానని మోడీ పదేపదే చెబుతున్నారు. గ్యాస్ సబ్సిడీని అనేకమంది స్వఛ్చందంగా వదులుకోవడం వల్ల మిగిలిన సొమ్ము ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్స్ కి, గ్యాస్  సిలిండర్ కి తేడా తన మాటలు వినేవాళ్లకు తెలియదని ఆయన భావిస్తున్నారు.  ఉచితంగా గ్యాస్  కనెకష్న్ ఇస్తే కుటుంబానికి కనెక్షన్ చార్జీలు మాత్రమే మిగులుతాయి. అంతేగానీ నెలనెలా సిలిండర్ ని ప్రభుత్వం  ఉచితంగా ఇవ్వదు. ఈ విషయం తెలిసినవాళ్తు తాను పొరపాటుగా చెప్పానని  అనుకోవాలని మోడీ భావిస్తూ ఉండొచ్చు. ఇక సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ప్రహసనం గ్యాస్ డే వాళ్లందరికీ తెలుసు. నగదు బదిలీ పథకం పెట్టినప్పటినుంచి ఇప్పటి వరకు అకౌంట్ లో వచ్చే సబ్సిడీలో మార్పు లేకపోగా సిలిండర్ రేటు మాత్రం ఐదేళ్లలో రూ.100 వరకు పెరిగింది.  దీన్ని ఏం పన్ను అంటారో మోడీజీనే చెప్పాలి.

 కె. మురళీకృష్ణ